Ukraine-Russia War: మధ్యవర్తిగా ఇజ్రాయెల్!

ABN , First Publish Date - 2022-03-07T00:17:28+05:30 IST

శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్ కలిసి మూడు గంటల పాటు చర్చించారు. దీనికి ముందు రష్యాతో చర్చించాలని ఇజ్రాయెల్‌ను ఉక్రెయిన్ కోరిన విషయం తెలిసిందే. అమెరికాకు అత్యంత సన్నిహితంగా మెదిలే దేశమైన..

Ukraine-Russia War: మధ్యవర్తిగా ఇజ్రాయెల్!

మాస్కో: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అటు రష్యావైపు కానీ, ఇటు ఉక్రెయిన్‌‌వైపు కానీ ఎటువైపూ ఒక స్టాండ్ తీసుకోలేని పరిస్థితులో ప్రపంచ దేశాలు ఉన్నాయి. రష్యా దుర్మార్గాన్ని ఖండించాలంటూ ప్రపంచ వేదికలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ విజ్ణప్తి చేస్తున్నారు. ఇక ఇది తమ ఇద్దరి మధ్య తగువని, మూడవ వ్యక్తి తలదూర్చితే ఊరుకునేది లేదని రష్యా అధినేత పుతిన్ గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. అమెరికా సహా నాటో దేశాలు నైతికంగా ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ యుద్ధ నివారణకు ముందుకు రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్ కలిసి మూడు గంటల పాటు చర్చించారు. దీనికి ముందు రష్యాతో చర్చించాలని ఇజ్రాయెల్‌ను ఉక్రెయిన్ కోరిన విషయం తెలిసిందే. అమెరికాకు అత్యంత సన్నిహితంగా మెదిలే దేశమైన ఇజ్రాయెల్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించింది. అయినప్పటికీ పుతిన్‌తో సమావేశం అవ్వడం గమనార్హం. పైగా ఈ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధినేతతో సమావేశమైన మొదటి దేశాధినేత ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌నే.


పుతిన్‌తో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో బెన్నెట్ మాట్లాడినట్లు శనివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం రష్యా, ఉక్రేనియన్ నాయకులతో సత్సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామ‌ని తెలిపారు. ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మూడవ ప్రత్యామ్నాయం కావాలని చాలా మంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే ఆతృత నెలకొంది. 11 రోజులుగా యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. ముందుగా యుద్ధం ఆపేసి చర్చలు చేయాలని అంటున్నారు. అయితే ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం ఎంత కాలం కొనసాగుతుందనే అనుమానాలు లేకపోలేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - 2022-03-07T00:17:28+05:30 IST