ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌కు మినహాయింపు!

ABN , First Publish Date - 2021-04-20T15:08:23+05:30 IST

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతోంది.

ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌కు మినహాయింపు!

జరూసలెం: ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతోంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనికితోడు స్కూళ్లు, కాలేజీలను కూడా తెరిచారు. అయితే కార్యాలయాల్లో పనిచేసే సమయంలో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అనే నిబంధన కొనసాగిస్తున్నారు. దేశంలోని అత్యధిక జనాభాకు టీకాలు వేసిన అనంతరం ఇజ్రాయెల్ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్‌లోని 93 లక్షల జనాభాలోని 53 శాతం ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేశారు. ఫలితంగా ఇజ్రాయిల్‌లో కరోనా వ్యాప్తి రేటు కూడా గణనీయంగా తగ్గింది. దీంతో ఏడాదిగా కొనసాగిస్తున్న పలు కరోనా ఆంక్షలకు సడలింపునిచ్చారు. బహిరంగా ప్రదేశాలైన పార్కులు, రోడ్లు తదితర ప్రాంతాల్లో మాస్కు ధరించడంపై మినహాయింపునిచ్చారు. అయితే ఇన్‌డోర్ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలనే నిబంధనను కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పబ్లిక్ రేడియోలో మాట్లాడుతూ దేశానికి విదేశీ పర్యాటకులు, వ్యాపారుల రాకను ఆహ్వానిస్తున్నామని, అయితే కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికే అనుమతినిస్తామని అన్నారు. ఫలితంగా దేశ ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందన్నారు. 

Updated Date - 2021-04-20T15:08:23+05:30 IST