జనం భయమే వారికి వరం

ABN , First Publish Date - 2020-08-10T11:18:10+05:30 IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో కొవిడ్‌ బాధితులు చనిపోవడం అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది.

జనం భయమే వారికి వరం

తిరుపతిలోనూ స్వర్ణ ప్యాలెస్‌లు!


తిరుపతి, ఆంధ్రజ్యోతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో కొవిడ్‌ బాధితులు చనిపోవడం అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. చనిపోయిన వారిలో 8మందికి కొవిడ్‌ నెగటివ్‌. ఇద్దరికే పాజిటివ్‌ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే జ్వరం, జలుబు, దగ్గు వంటి సీజనల్‌ లక్షణాలకు బెంబేలెత్తిపోతున్న జనాన్ని స్టార్‌ హోటల్‌ గదుల్లో దించడం జరుగుతోందని అర్థమైంది . అయితే ఇలాంటి వ్యవహారాలు తిరుపతిలోనూ జరుగుతున్నాయి.కొవిడ్‌ రోగులకు చికిత్స చేసేందుకు 12 ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే తిరుపతిలో అనుమతి ఉంది. వాటికి అనుబంధంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఐసొలేషన్‌ సెంటర్‌ పేరిట ఒక స్టార్‌ హోటల్‌కు మాత్రమే అనుమతి వుంది. కానీ పలు ఆస్పత్రుల నిర్వాహకులు ప్రైవేటు హోటళ్ళు, లాడ్జీలతో ఒప్పందం కుదుర్చుకుని వాటిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు లేదా ఐసొలేషన్‌ సెంటర్లుగా వాడుకుంటున్నారు. వీటిలో దేనికీ అనుమతుల్లేకపోవడమే విశేషం.


అసలేం జరుగుతోందంటే.....

కరోనా లక్షణాలు కనిపించిన వారికి, కొవిడ్‌ టెస్టులు చేయించుకుని రిపోర్టులు ఇంకా అందని వారికి ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో అడ్మిషన్‌ దొరకదు. కేవలం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి మాత్రమే వాటిలో అడ్మిషన్‌ దొరుకుతుంది. కానీ చాలామంది కరోనా లక్షణాలున్న వారు, టెస్టులు చేసుకుని రిపోర్టులు ఇంకా చేతికి అందని వారు మానసిక ఆందోళనతో వుంటున్నారు. తమ నుంచీ కుటుంబీకులకు వైరస్‌ సోకకుండా వుండాలని,ముందస్తుగా వైద్యం పొందాలని ఆరాటపడుతున్నారు. వీరు రిపోర్టులు రాకనే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.


సరిగ్గా ఇక్కడే ప్రైవేటు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు లేదా ఐసొలేషన్‌ సెంటర్లు, హోమ్‌ కేర్‌ ప్యాకేజస్‌, హోటల్‌ క్వారంటైన్‌, రిమోట్‌ మానిటరింగ్‌ వంటి పేర్లతో దందాకు తెర లేస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులు తమకు అనుబంధంగా ఒప్పందం కుదుర్చుకున్న హోటళ్ళు, లాడ్జీలకు వీరిని రోజుకు కనీసం రూ. 2500 చొప్పున చెల్లించేలా మాట్లాడుకుని పంపిస్తున్నారు. ఆ మొత్తం కేవలం బస, ఆహారం కోసం మాత్రమే.తర్వాత్తర్వాత వారికి పాజిటివ్‌ అని తేలితే వైద్యానికి సెపరేటు ప్యాకేజీ వుంటుంది.అయితే చాలామందికి రిపోర్టులు నెగటివ్‌ అని వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లు వుండి, వాటిలో రిపోర్టులు రాని అనుమానితులకు బస కల్పించడం జరిగేది. ఇపుడు ప్రభుత్వ క్వారంటైన్లు దాదాపుగా మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు రంగంలో ఎలాంటి అనుమతులు లేకుండానే కొవిడ్‌ కేర్‌సెంటర్లు, ఐసొలేషన్‌ సెంటర్లు వెలుస్తున్నాయి.


దానివల్ల కొవిడ్‌ అనుమానితులు తమకు నెగటివ్‌ అని తేలేసరికి ఉత్తి పుణ్యానికి హోటల్‌ ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఎందుకంటే మొత్తం 14 రోజులకు ఐసొలేషన్‌ ప్యాకేజీ కింద మొత్తం డబ్బంతా అడ్వాన్సుగా ముందే చెల్లించాలి. పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం కోసం రూ. లక్షల్లో ప్యాకేజీలు వున్నాయి. అది మరో పెద్ద దందా! కొవిడ్‌ అనుమానితుల ఆత్రుత, ఆరాటాల స్థాయిని బట్టి వైద్య సేవలు అందుబాటులో వుంటాయని ప్రైవేటు ఆస్పత్రులు నమ్మించి హోటళ్ళకు పంపుతున్నాయి. తొలుత రూములు ఖాళీలేవని చెప్పడం, కొన్ని గంటల పాటు నిరీక్షించేలా చేసి తర్వాత అతి కష్టంమీద గది కేటాయిస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.అదేవిధంగా రూములు కేటాయించడానికి తొలుత వైద్యుడి నుంచీ తమకు పాజిటివ్‌ వుందని లెటర్‌ తీసుకురమ్మని చెబుతున్నారు. అలా తేవడానికి వీలు కాదని చెబితే తమకు తాముగా ఐసొలేషన్‌ సెంటర్లో చేరుతున్నామంటూ అఫిడవిట్‌ తరహాలో లేఖ రాయించుకుని మరీ గదులు కేటాయిస్తున్నట్టు సమాచారం. అనుమతుల్లేకపోయినా రెండు ఆస్పత్రులు మాత్రం నిజంగానే అనుబంధ హోటళ్ళలో వైద్యులను అందుబాటులో వుంచుతున్నాయి. మిగిలినవి కేవలం బస, ఆహారం అందించడం వరకే పరిమితమవుతున్నాయి. 

Updated Date - 2020-08-10T11:18:10+05:30 IST