వ్యాసం సాహిత్యంలో భాగం కాదా?

ABN , First Publish Date - 2021-04-26T06:04:30+05:30 IST

మనకు సాహిత్యం అనగానే వెంటనే కథ, నవల, నాటకం, కవిత, గేయంలాంటివి గుర్తొస్తాయి. ఇవన్నీ వేటికవే విశిష్టమైనవి. ప్రత్యేకమైనవి....

వ్యాసం సాహిత్యంలో భాగం కాదా?

మనకు సాహిత్యం అనగానే వెంటనే కథ, నవల, నాటకం, కవిత, గేయంలాంటివి గుర్తొస్తాయి. ఇవన్నీ వేటికవే విశిష్టమైనవి. ప్రత్యేకమైనవి. ఏదీ మరొక దానికన్నా ఎక్కువ కాదు. అలాగని తక్కువ కాదు. దేని విలక్షణత, ఆస్వాదన, ఉపయోగాలు దానివి. కానీ వీటి సరసన వ్యాసాన్ని చేర్చినట్లు అంతగా కనిపిం చదు. నిజానికి వీటిలో ఏ ఒక్కదాని పరిచయం, సమీక్ష, పరిచయం, పరామర్శ, విశ్లేషణ లాంటివి చేయాలన్నా అందుకు వ్యాసమే శరణ్యం. విభిన్న సృజనలన్నింటినీ ఆస్వాదకులకు అనుసంధానం కలిగించేది వ్యాసకర్తలే. విశ్వవిద్యాలయాలలో ఏ శాఖలో పరిశోధన పత్రాలైనా అవన్నీ వ్యాస రూపాలే. అంతెందుకు వ్యక్తిని, ప్రపంచాన్ని కలిపే పత్రికలకు గుండెకాయ లాంటి సంపాదకీయాలు వ్యాసాలే. చెప్పుకుంటూపోతే కొండవీటి చాంతాడవుతుంది. 


ఇంతటి విశిష్టత గల వ్యాసం రాయటం అందరూ అనుకునేంత సులువు కాదు. ఎన్నో సామర్థ్యాలుండాలి. తీసుకున్న అంశం పూర్వాపరాలపై పూర్తి సాధికారిత ఉండాలి. వాటిని పరిణత స్థాయిలో వ్యక్తం చేయగల భాషపై పట్టుండాలి. అన్నింటా కార్యాకారణ సంబంధం ఉండాలి. వ్యాస సంగీతంలో పదం పదం మధ్య శృతి ఉండాలి. వాక్యాల హారం రాగంలా సాగాలి. లింకు ఏ మాత్రం తెగ రాదు. ప్రతిదీ సహేతుకంగా, సూటిగా, సంక్షిప్తంగా ఉండాలి. అలతి అలతి పదాలతో అలవోకగా చదువరి హృదయాలను అలరించాలి. అంశాల కారణంగా సుదీర్ఘమైన వాటిని భాగాలుగా విభజించాలి. వాటి నడుమ పరస్పర అనుసంధానం, ఏకసూత్రత ఉండాలి. ఆయా సందర్భాలలో అనుబంధ అంశాల మనోరంజక ప్రస్తావన పాఠకులకు మృష్టాన్నం పెట్టినట్లు కాగలదు. అవసరాన్నిబట్టి భాషాపరమైన నుడికారాలు, జాతీయాలు, చారిత్రిక, వైజ్ఞానిక, ప్రముఖుల, ప్రామాణిక కొటేషన్లతో సర్వ సమగ్ర వ్యాసం చదువరిని వికసింపజేస్తుంది. విస్తృత పరుస్తుంది. అతనిలో వెలుగులు బాహ్యంగానూ వెదజల్లేలా చేస్తుంది.  


వ్యాస రచయిత ఎంత చదువరి అయితే ఆ వ్యాసాలు అంతగా కాంతిని వెదజల్లుతాయి. పర భాషలు ఎన్ని తెలిసుంటే అంతగా అధ్యయనంతో అంతకరణ అనితర సాధ్యంగా ఆవిష్కరణ అవుతుంది. అందువల్లనే మంచి చదువరి కాని వారు ఎవరూ మంచి లేక గొప్ప సృజనకార్లు కారు. కాలేరు. ఇది మరింత వాస్తవం వ్యాసం విషయములో.  


అనేక సౌలభ్యాలు ఇతర ప్రక్రియలలో ఉన్నట్లు వ్యాసాలకు ఉండవు. కాల్పనిక సాహిత్యంలో శిల్పం, శైలి వగయిరా ముసుగులో ఏమి రాసినా ఎట్లా రాసినా సమర్థకులకు లోటు ఉండదు. పైగా ఒక్కోసారి ఎంత అస్పష్టంగా, గందరగోళంగా, పాషాణ పాకంలా రాస్తే అంత గొప్పగా చెలామణి అవుతుంది. మంచి వ్యాసాల్లో ఈ అవకాశం ఉండదు.  


మన తెలుగులో గొప్ప స్థాయి గల వ్యాసకర్తలు తొలి నుండి అనేక మంది ఉన్నారు. బహుశా వారిలో ఎంద రెందరో విశ్వ సాహిత్యంలోని ఏ ఒకరికి తక్కువ కాదు. పుట్టపర్తి, సంజీవదేవ్‌, కొడవటిగంటి, పానుగంటి, బుచ్చి బాబు, నార్ల, విద్వాన్‌విశ్వం, రారా, తిరుమల రామచంద్ర, ముట్నూరి, సదాశివ లాంటి ఉద్దండులు ఎందరో గలరు. ముట్నూరి వారి ‘లో వెలు గులు’ మన ముంజేతి కంక ణాలుగా ఉదయ కిరణాలు వెదజల్లే కాంతులు. పాను గంటి ‘సాక్షి’ అధిక్షేప వ్యాసాలు ఆలోచనాత్మక శరాలు. పుట్ట పర్తి బహుముఖ ప్రజ్ఞ వారి రచనల నిండా వ్యాపించి ఉంటుంది. సంజీవదేవ్‌ ఏది రాసినా అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఉంటుంది. వారి ‘రసరేఖలు’, ‘రూపారూపాలు’, ‘కాంతిమయి’, ‘తేజోరేఖలు’, ‘తెగిన జ్ఞాపకాలు’ వగైరా లలో ప్రతి వాక్యము ఇందుకు సాక్ష్యాలు. అనన్య సామాన్యమైన సంయమనం, సమన్వయ సాధన ఆయన సొంతం. అందుకే రసలోకంలో అక్షర శిల్పిగా మిగిలారు. కొ.కు అంత వైవిధ్యభరితంగా, విస్తృతంగా రాసిన వారు మరొకరు లేరు. చేపట్టిన ప్రతి ప్రక్రియలో తన ముద్ర, మనిషి పట్ల తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన చారిత్రిక, సాంస్కృతిక, సాహిత్య వ్యాసాలు మనకు గుప్త నిధులే. మనోవైజ్ఞానిక అంశాలతో బుచ్చిబాబు వ్యాసాలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. జగమెరిగిన నార్ల సంపా దకీయాలు, ఇతర రచనలు ఏ రంగంలో వారికైనా నిఘం టువులు. విద్వాన్‌ విశ్వం’ మాణిక్యవీణ’ సుస్వరాలు పలికించే సరస్వతీ వీణ. ఎంత సున్నితత్వం? సునిశిత వైవిధ్యం? అన్నింటా. రాచమల్లు రామచంద్రారెడ్డికి వారి అనువాద సమస్యలకే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినా సాహిత్య వ్యాసాలు ప్రతిదీ ప్రతి ఒక్కరికి ప్రామాణికాలే. తిరుమల రామచంద్ర గారి’ హంపీ నుంచి హరప్పా దాక’, ‘నుడి-నానుడి’ లాంటి ప్రతి రచన వారి పరిజ్ఞానం జిజ్ఞాస గలవారికి వడ్డించిన విస్తరి. సదాశివ గారి ప్రతి పదము మనల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని శ్రవణానికి, కంటికి నోటికి తీయదనం ఇచ్చినట్లు తేనెలు ఊరిస్తుంది. 


1970దాకా వ్యాసాలకి గొప్ప ఆదరణ ఉండేది. తెలుగు సాహితీ ప్రక్రియల్లో విశిష్టమైన స్థానం ఉండేది. రాను రానూ వ్యాసాన్ని సాహితీ ప్రాంగణం నుండి బయటికి నెట్టారు. సాహిత్య వ్యాసాలే సాహిత్యంలో అంతర్భాగంగా గుర్తించడం వల్ల సాహిత్యేతర వ్యాసాలు కేవలం దిన పత్రికలకే పరిమితమైపోయాయి. సాహిత్యానికి వ్యాసానికి మధ్య కనిపించని గోడ తయారయింది. ఈ గోడను తొలగించి పూర్వ వైభవం తీసుకు రాగలిగితే అది రచయితలకు, పాఠకులకు శ్రేయస్కరం. 


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల పొందిన రాచపాళెం, కాత్యాయనీ విద్మహే గార్లకు కూడా ఆ అవా ర్డులు వారి సాహిత్య విమర్శల వ్యాసాల సంపుటిలకు వచ్చాయి. అవి విమర్శనా వ్యాసాలు. వాటి స్థాయికి లభించిన గుర్తింపుగా భావించాలి. నిష్పాక్షికంగా, నిర్దిష్టంగా, సాధికారంతో, అన్ని పార్శ్వాలు స్పృశించి వ్యాస రూపంలో పెట్టడం సామాన్య విషయం కాదు. వారికి ఆయా సాహిత్య ప్రక్రియలతో పాటు సాహిత్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రిక, మనో వైజ్ఞానిక, సాంకేతిక పరిణామాలు, ఆయా సాహిత్యకారులపై, ప్రక్రియలపై వాటి ప్రభావం ఎంతగా, ఏ రీతిలో ఉన్నదో తెలియాలి. వాటిని సహేతుకంగా, సమర్థవంతంగా, సరళ రీతిలో, మానవీయ కోణంలో ఆవిష్కరించగలగాలి. అప్పుడే మంచి వ్యాసం అవుతుంది. ఉటంకింపులతో నింపితే నిష్ప్రయో జనం. ఈ రంగంలో కృషి చేయదలచినవారు పై వారిని మార్గదర్శకంగా తీసుకోవాలి. సమగ్ర అధ్యయనం తప్పనిసరి. అన్నింటా రాగద్వేషాలకతీతంగా విషయ ప్రాధాన్యత ముఖ్యం. వ్యాసరచన ఎంతటి ఉత్కృష్టమైనదో అత్తలూరి నరసింహారావు గారు ఒకే వాక్యంలో చెప్పారు: ‘‘గొప్ప కవిత్వం రాయటానికి ఒక ఉద్విగ్న క్షణం చాలు. అదే గొప్ప వాక్యం వ్రాయటానికి ఒక జీవితం చాలదు.’’ వ్యాసం సాహిత్యం కాదు అన్న వారిని చూసి జాలిపడాలి.


బి. లలితానంద ప్రసాద్‌

92472 99715

Updated Date - 2021-04-26T06:04:30+05:30 IST