Advertisement
Advertisement
Abn logo
Advertisement

అసెంబ్లీలోనూ అబద్ధాలేనా?

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు అత్యంత కీలకమైనవి. ప్రజల సమస్యలను చర్చించడానికి అనువైన వేదికలవి. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ, కౌన్సిల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యలపై జరిగిన చర్చకు, వచ్చిన ప్రశ్నలకు మంత్రులు బాధ్యతాయుతంగా, జవాబు ఇవ్వడం జరగాలి. ఈ సందర్భంలో అప్పటికే అమలులో ఉన్న చట్టాలను, నిబంధనలను దృష్టిలో ఉంచుకుని జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటినీ మించి ప్రభుత్వం సభకు అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి వైపరీత్యాల నష్టాలు, కౌలురైతులకు కూడా సహాయం అందించడం అనే అంశాలపై అక్టోబర్ 8న తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా పక్కకు పెట్టి, అబద్ధాలతో అసలు చర్చను పక్కదారి పట్టించింది. మరీ ముఖ్యంగా నెపాన్ని పూర్తిగా కేంద్రప్రభుత్వం మీదకు తోసేసి చేతులు దులుపుకోవాలని చూసింది. 


2020 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రైతులు తీవ్రస్థాయిలో పంటలను నష్టపోయారు. ఈ సంవత్సరం కూడా వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు నష్ట పోతున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పంటనష్టాలను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖకు తగిన ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేయాల్సి ఉంటుంది. లేదా అధికారికంగా అవసరమైన సర్క్యులర్ పంపించాల్సి ఉంటుంది. 2015 తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను అమలుచేయడం మానేసింది. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలు నష్టపోతున్నా, అప్పుల పాలవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటున్నది. వెంటనే గ్రామాలకు వెళ్ళి, ప్రతి రైతుకూ కలిగిన నష్టాన్ని అంచనా వేయడం లేదు. అధికారికంగా ఆ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టడం లేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగినా ఇవ్వడం లేదు.


2020 వానాకాలం సీజన్‌లో జరిగిన పంటనష్టాల గురించి 2021 సెప్టెంబర్ 13న రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వం స్వయంగా ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో 5.97 లక్షల హెక్టార్లలో లేదా 15 లక్షల ఎకరాలలో పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని (33 శాతం కంటే ఎక్కువ), ఆ నష్టం విలువ 7219.5 కోట్లు ఉంటుందని పేర్కొంది. ఎన్‌డి‌ఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడానికి 552.46 కోట్ల నిధులు అవసరమని కూడా అందులో పేర్కొంది. 


కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన నివేదికలో జిల్లాలవారీగా వర్షాల వల్ల నష్టపోయిన విస్తీర్ణం వివరాలను, రెండు పట్టికలలో వివరంగా ఇచ్చారు. ఒక పట్టికలో జిల్లాలవారీగా నష్టపోయిన భూముల్లో సాగునీరు అందుబాటులో ఉన్న భూములు, వర్షాధార భూముల విస్తీర్ణం వివరాలు ఇచ్చారు. నష్టపోయిన రైతులలో సన్న, చిన్నకారు రైతుల సంఖ్యా వివరాలను అనుబంధం 6లో, ఇతర రైతుల సంఖ్యా వివరాలను అనుబంధం 7లో  ఇచ్చారు. అంటే రాష్ట్రప్రభుత్వం కిందిస్థాయి అధికారుల ద్వారా, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించిందని మనకు అర్థమవుతోంది. 


2020 నవంబర్‌లో రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గత పది నెలలుగా విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. 2020 వానాకాలంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను, కౌలురైతులను గుర్తించి 4 నెలల లోపు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని, ప్రభుత్వం పంటల బీమా పథకాలు అమలు చేయనందున రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి సన్న, చిన్నకారు రైతులకు అదనంగా పంటల బీమా పరిహారం కూడా చెల్లించాలని గత నెల 28న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. 


రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు సమాచార హక్కు చట్టం క్రింద సేకరించిన సమాచారం మేరకు (2021 ఫిబ్రవరి 11 లేఖ ద్వారా) ‘2020 అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాల వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించడానికి జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.245.96 కోట్లు విడుదల చేశారు. ఇందులో 188.9 కోట్లు పంట నష్ట పరిహారంగా చెల్లించడానికి ఇచ్చారు. అప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధిగా 977 కోట్లు అందుబాటులో ఉన్నాయని, కాబట్టి ఈ నిధులను అందులో నుంచి ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పారు. కానీ కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా రాష్ట్రప్రభుత్వం రైతులకు పంపిణీ చేయలేదు. 


ఎన్‌డి‌ఆర్‌ఎఫ్, ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ నియమాల ప్రకారం 5.97 లక్షల హెక్టార్ల పంటనష్టానికి పరిహారం అందించేందుకు రూ.552.46 కోట్లు అవసరమవుతాయి. 2021 ఫిబ్రవరి 11 లేఖ ప్రకారం కేంద్రం 188.93 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇంత తక్కువ మొత్తాన్ని ఎందుకు ఇచ్చిందో కేంద్రమే చెప్పాలి. జాతీయ విపత్తు నిర్వహణ యాజమాన్యం డివిజన్ 1 నుంచి అందిన లేఖ ప్రకారం 2020 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి కింద 977 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. 2020–21 సంవత్సరానికి మరో రూ.449 కోట్ల నిధులను కేంద్రం తన వాటాగా విడుదల చేసింది. అంటే మొత్తం రూ.1456.87 కోట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధిలో దగ్గర ఉన్నాయన్నమాట. 50 శాతం వాటా సూత్రం ప్రకారం 2020 అక్టోబర్ వర్షాలకు పరిహారం అందించడానికి ఇక జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి మరే సహాయమూ అందే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అందుబాటులో ఉన్న ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ నుంచే రూ.245.96 కోట్లు వినియోగించుకోమని సూచించింది. 


తెలంగాణ అకౌంటెంట్ జనరల్ మే 21న జాతీయ విపత్తు నిర్వహణ కమిటీకి రాసిన లేఖలో కేంద్రం చెప్పిన సమాచారాన్ని పూర్తిగా నిర్ధారించారు. 2020–21 సంవత్సరానికి ఎస్‌డి‌ఆర్‌ఎఫ్ దగ్గర రూ.2581 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. 


2020 నష్టాలను పరిశీలించడానికి కేంద్రబృందం రాష్ట్రానికి వచ్చి ప్రధాన కార్యదర్శిని కలిసింది. క్షేత్ర పర్యటన చేసింది. ఆ వార్తలు మీడియాలో కూడా వచ్చాయి. వాస్తవాలు ఇలా ఉండగా, 2020 వర్షాకాలం నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర బృందం రానే లేదనీ, 8000 కోట్లు నష్టం జరిగితే కేంద్రం 8 రూపాయలు కూడా ఇవ్వలేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పచ్చి అబద్ధం. 


ప్రధానమంత్రి పంటల బీమా పథకపు నియమాలను మార్చడం ద్వారా, 2020 ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకం విషయంలో స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే అధికారం రైతులకు ఉందని కోర్టు ముందు వక్రీకరించే ప్రయత్నాన్ని రాష్ట్రప్రభుత్వం చేసింది. అసెంబ్లీలో కూడా అదే జవాబు చెప్పింది. అంటే రైతులు కావాలనుకుంటే స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరవచ్చని చెపుతున్నది. కానీ వాస్తవం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సంబంధించి అసలు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. రాష్ట్రస్థాయిలో మరో పంటల బీమా పథకాన్ని కూడ ప్రకటించలేదు. ఫలితంగా రైతులు పంటల బీమా పథకంలో చేరేందుకు అవకాశమే లేకుండా చేశారు. 


ఇతర రాష్ట్రాలలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం వద్దనుకున్నప్పుడు, ప్రత్యామ్నాయంగా రాష్ట్ర స్థాయిలో మరో బీమా పథకాన్ని ప్రవేశపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై‌ఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం (రైతుల నుంచి కేవలం 1 రూపాయి తీసుకుని రిజిస్టర్ చేసుకునే పద్ధతిలో) ప్రవేశపెట్టింది. రైతులందర్నీ బీమా పరిధిలోకి తీసుకు వచ్చింది. 2020 ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు 1820 కోట్ల రూపాయల పరిహారం అందించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లా సస్య బీమా పేరుతో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, 2019 రబీలో 46 లక్షల మంది రైతులను, 2020 ఖరీఫ్‌లో 60 లక్షల మంది రైతులను పంటల బీమా పథకం పరిధిలోకి తీసుకువచ్చింది. గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజనా పేరుతో బీమా పథకం ప్రవేశపెట్టి 2020 ఖరీఫ్‌లో 56 లక్షల మంది రైతులను పథకం పరిధిలోకి తీసుకువచ్చింది.


ఈ విషయాలన్నీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతోందని అర్థమవుతోంది. రైతులను ఆదుకోవలసిన బాధ్యత తనకు ఉందని రాష్ట్రప్రభుత్వం గుర్తించి, హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలుచేయడానికి చర్యలు తీసుకోవాలి. ఈ యాసంగి సీజన్‌లో పంటల బీమా పథకాలను అమలు చేయాలి. 2022 ఖరీఫ్ నాటికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక పంటల బీమా పథకాలను ప్రారంభించాలి. అన్ని పంటలను, గ్రామం యూనిట్‌గా బీమా పరిధిలోకి తీసుకురావాలి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...