75 ఏళ్ల తర్వాత ఎగిరిన భారత జెండా

ABN , First Publish Date - 2022-03-21T23:17:09+05:30 IST

కర్ణాటక, కోలార్‌లోని క్లాక్ టవర్‌పై తొలిసారిగా భారత జెండాను ఎగరేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు శనివారం జెండా ఎగరేశారు.

75 ఏళ్ల తర్వాత ఎగిరిన భారత జెండా

కోలార్‌: కర్ణాటక, కోలార్‌లోని క్లాక్ టవర్‌పై తొలిసారిగా భారత జెండాను ఎగరేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు శనివారం జెండా ఎగరేశారు. కోలార్‌లోని క్లాక్ టవర్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 75 ఏళ్లుగా ఈ టవర్ ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. అప్పట్నుంచి దీనిపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతూనే ఉండేవి. అయితే, కొంతకాలంగా ఈ టవర్ విషయంలో వివాదం చెలరేగుతోంది. టవర్ రంగు మార్చాలని, టవర్‌పై ఉన్న జెండాలను తొలగించి మూడు రంగుల భారత జెండా ఎగరేయాలని స్థానిక ఎంపీ మునిస్వామితోపాటు పలువురు డిమాండ్ చేశారు. దీంతో చాలాకాలంగా వివాదం నడిచింది. గత శుక్రవారం కూడా మునిస్వామి ఈ అంశంపై ఆందోళన నిర్వహించారు. ఈ వివాదం నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. చివరకు గత శనివారం పోలీసుల భద్రత మధ్య టవర్‌కు తెలుపు రంగు వేశారు. టవర్‌పై ఉన్న జెండాలను తొలగించిన అధికారులు మూడు రంగుల భారత పతాకాన్ని ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జరిపి, వివాదం తలెత్తకుండా చూశారు.

Updated Date - 2022-03-21T23:17:09+05:30 IST