కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఏర్పాటు

ABN , First Publish Date - 2020-08-08T22:45:32+05:30 IST

భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత దేశ

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఏర్పాటు

ఇస్లామాబాద్ : భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత దేశ దౌత్యపరమైన ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై పునఃసమీక్షకు అవకాశం కల్పిస్తూ విస్తృత ధర్మాసనాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఏర్పాటు చేసింది. 


ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ అమిర్ ఫరూఖ్, జస్టిస్ మియాన్ గుల్ హసన్ ఔరంగజేబ్‌లతో ఈ ధర్మాసనాన్ని శుక్రవారం ఏర్పాటు చేసినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఈ కేసుపై సెప్టెంబరు 3న విచారణ జరపనున్నట్లు తెలిపింది. 


కుల్‌భూషణ్ జాదవ్‌తో మాట్లాడేందుకు, న్యాయ సహాయం అందజేసేందుకు అవసరమైన కాన్సులర్ యాక్సెస్‌ను భారత దేశానికి ఇవ్వాలని పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. 


మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మాత్రం తాము జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించే విషయంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అంతకుముందు, పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో తమ వైఖరిని తెలియజేసేందుకు భారత ప్రభుత్వానికి ఓ అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ కోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. 


జాదవ్‌ను 2016లో బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ దళాలు అక్రమంగా అరెస్టు చేశాయి. ఆయన ఉగ్రవాదం, గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపించాయి. అనంతరం పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు 2017లో మరణ శిక్ష విధించింది. దీనిపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ను ఆశ్రయించింది. గత ఏడాది జూలైలో ఐసీజే తీర్పు చెబుతూ, జాదవ్‌కు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని తెలిపింది.


Updated Date - 2020-08-08T22:45:32+05:30 IST