సహనశీలికే దైవ ప్రసన్నత!

ABN , First Publish Date - 2021-02-05T05:36:46+05:30 IST

వ్యక్తులకూ, మానవ సమాజాలకూ జీవన ప్రయాణంలో అత్యంత సున్నితమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా ఘన విజయం సాధించినప్పుడు,

సహనశీలికే దైవ ప్రసన్నత!

వ్యక్తులకూ, మానవ సమాజాలకూ జీవన ప్రయాణంలో అత్యంత సున్నితమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా ఘన విజయం సాధించినప్పుడు, లేదా పరాభవాన్ని ఎదుర్కొన్నప్పుడూ మనోనిగ్రహంతో మసలుకోవడం చాలా కష్టం. అయితే నిగ్రహాన్నీ, సంయమనాన్నీ పాటించవలసిన సమయం అదే! అప్పుడే వ్యక్తుల్లో, సమాజాల్లో సౌమనస్యం, హుందాతనం ఉంటాయి. ఉన్నతమైన వ్యక్తిత్వానికీ, సౌమ్యతకూ దోహదపడే గుణాలు నెలకొంటాయి.


‘‘మేము మనిషికి ఏదైనా కారుణ్యాన్ని రుచి చూపించి, దాన్ని అతని నుంచి తిరిగి తీసుకుంటే అతను నిరాశ చెందుతాడు. కృతఘ్నుడిగా మారిపోతాడు. అతనికి కష్టాలు కలిగిన తరువాత ఏదైనా అనుగ్రహాన్ని రుచి చూపిస్తే, నా దురవస్థలన్నీ దూరమైపోయాయని అనుకుంటాడు. నిశ్చయంగా అతడు మిడిసి పడతాడు. గొప్పలు చెప్పుకుంటాడు. అయితే సహనం వహించి మంచి పనులు చేసేవారు అటువంటి వారు కారు. ఇటువంటి వారి కోసమే మన్నింపూ, గొప్ప పుణ్య ఫలం ఉన్నాయి. ఓర్పు వహించేవారి మంచి ఆచరణలను ప్రతిఫలాన్ని తప్పనిసరిగా ప్రసాదిస్తాం’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. ‘‘సహనం ద్వారా, నమాజ్‌ ద్వారా సహాయం అర్థించండి. సహనం వహించేవారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. 


దైవ ప్రవక్త కూడా ‘‘ఎవరైతే సహన గుణాన్ని అలవరచుకోవాలనుకుంటారో వారికి అల్లాహ్‌ సహనాన్ని ప్రసాదిస్తాడు. సహనం కన్నా మేలయినదీ, ఇతోధికంగా మేలు కలిగించేదీ అయిన దైవ వరం మరొకటి లేదు’’ అని ప్రకటించారు. ‘‘పరీక్ష ఎంత క్లిష్టమైనదయితే అంత గొప్ప బహుమానం లభిస్తుంది. అల్లాహ్‌ ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి పరీక్ష పెడతాడు. అప్పుడు దైవ నిర్ణయంపై సమ్మతిని, ఆమోదాన్నీ తెలిపి ఎవరు ఓర్పు వహిస్తారో వారిపట్ల ప్రసన్నుడవుతాడు. తన పట్ల అసమ్మతి తెలిపిన వారి పట్ల అల్లాహ్‌ కూడా అసమ్మతి కనబరుస్తాడు’’ అని తెలిపారు. ‘‘విశ్వాసి చేసే ప్రతి పనిలోనూ అతనికి మేలు చేసే అంశం ఉంటుంది. అతను ఆనంద ఘడియలలో దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటాడు. దాని వల్ల అతనికి పుణ్యం లభిస్తుంది. కష్టాలు వస్తే సహనం వహిస్తాడు. అది కూడా అతనికి మేలే చేస్తుంది’’ అని చెబుతోంది హదీస్‌ గ్రంథం. 


ప్రపంచంలో సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంది. మంచితో పాటు చెడూ ఉంది. వాటిలో ఏది ఎదురైనా... మనిషి తనను తాను నియంత్రించుకోవాలి. అంటే... సుఖ, సంతోషాలకు ఉబ్బితబ్బిబ్బయిపోకూడదు. కష్టాలు, బాధలూ వచ్చినప్పుడు ఉదాసీనతనూ, నిరాశనూ దరి చేరనీయకూడదు. మనసులో ఎదురయ్యే ఈ ఉద్వేగాలకు సరైన చికిత్స... అత్యుత్తమ రీతిలో సహనం పాటించడమే!

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-02-05T05:36:46+05:30 IST