మజార్-ఇ-షరీఫ్‌ మసీదులో పేలుడు మా పనే: ఐసిస్

ABN , First Publish Date - 2022-04-22T01:50:24+05:30 IST

ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌ నగరమైన మజార్-ఇ-షరీఫ్ నగరంలోని షియా మసీదులో బాంబు పేలుడు తమ

మజార్-ఇ-షరీఫ్‌ మసీదులో పేలుడు మా పనే: ఐసిస్

కాబూల్: ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌ నగరమైన మజార్-ఇ-షరీఫ్ నగరంలోని షియా మసీదులో బాంబు పేలుడు తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. ఈ మధ్యాహ్నం మసీదు వద్ద జరిగిన పేలుడులో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 40 మందికిపైగా  తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ మాసం నేపథ్యంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది.


తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత షియాలపై ఉగ్రవాదుల దాడులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. గతేడాది సెప్టెంబరులో తూర్పు ఆఫ్ఘనిస్థాన్ నగరమైన జలాలాబాద్‌లో జరిగిన వరుస బాంబు దాడుల్లో 30 మందికిపైగా తాలిబన్లు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఆ తర్వాతి నెలలో కుందుజ్ నగరంలోని షియా మసీదుపై దాడి జరిగింది. కాందహార్ నగరంలోని ఓ మసీదు శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా జరిగిన పేలుళ్లలో 32 మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో కాందహార్ ప్రావిన్స్‌లోని షా వలికోట్ జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2022-04-22T01:50:24+05:30 IST