ఇష్టారీతిగా..

ABN , First Publish Date - 2022-01-25T04:04:38+05:30 IST

కొవిడ్‌ను తరిమికొట్టేందుకు తప్పనిసరిగా కరోనా టీకా వేసుకోవాలని వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు ప్రజలకు సూచిస్తుంటే, మర్పల్లి మండలంలో మాత్రం వ్యాక్సినేషన్‌ నమోదు ప్రక్రియ తప్పుల తడకగా మారింది.

ఇష్టారీతిగా..

  •  కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నమోదు ప్రక్రియ
  •  వ్యాక్సిన్‌ వేసుకోకున్నా..వారి లెక్కలో వేసుకున్నట్లే..
  • ఆరోగ్య శాఖ మెసేజ్‌లతో కంగుతింటున్న టీకా లబ్ధిదారులు
  • రెండో డోస్‌పై ఆందోళన చెందుతున్న వైనం
  • వికారాబాద్‌ జిల్లాలో పలు పీహెచ్‌సీల సిబ్బంది తీరు

కొవిడ్‌ను తరిమికొట్టేందుకు తప్పనిసరిగా కరోనా టీకా వేసుకోవాలని వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు ప్రజలకు సూచిస్తుంటే, మర్పల్లి మండలంలో మాత్రం వ్యాక్సినేషన్‌ నమోదు ప్రక్రియ తప్పుల తడకగా మారింది. వ్యాక్సిన్‌ వేసుకోకున్నా వేసుకున్నట్లు వస్తున్న మేసేజ్‌లతో టీకా లబ్ధిదారులు కంగుతింటున్నారు. కొవిడ్‌ మొదటి డోస్‌ టీకా తీసుకున్న వారు.. రెండో డోస్‌  తీసుకోకుండానే తీసుకున్నట్లు తమ సెల్‌ఫోన్లకు వస్తున్న మెసేజ్‌లతో ఆందోళన చెందుతున్నారు.

వికారాబాద్‌/మర్పల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  బతికున్నారో లేదో తెలుసుకోకుండానే చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్లు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఫోర్టల్‌లో నమోదు చేయడం పట్ల  ప్రజలు  బెంబెలెత్తుతున్నారు. రెండోడోస్‌ టీకా వేయాలని కేంద్రాలకు వెళితే మీరు ఇది వరకే టీకా తీసుకున్నారంటూ వైద్య సిబ్బంది చెబుతుండడంతో లబ్ధ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలు ప్రాంతాల్లో వెలుగులోకి వస్తున్నాయి. మర్పల్లి మండలం, కల్కోడ గ్రామానికి చెందిన కుడుగుంట దశరథ్‌ రెండో డోస్‌ టీకా తీసుకోకుండానే తీసుకున్నట్లు ఆయన కుమారుడు సుధాకర్‌ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. అదే ఇంట్లో ఆయన పెద్ద కుమారుడు సురేందర్‌, కోడలు నాగలక్ష్మి కూడా రెండో డోస్‌ టీకా వేసుకోకుండానే వేసుకున్నట్లు సురేందర్‌ ఫోన్‌కు సమాచారం వచ్చింది. కాగా, మర్పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురికి ఇదే విధంగా వ్యాక్సిన్‌ వేయకుండానే వేసినట్లు,  మెసేజ్‌లు వచ్చాయి. మర్పల్లికి చెందిన సింగూరి రాజు గత ఏడాది జూలై 2న మొదటి డోస్‌ టీకా తీసుకోగా, ఈనెల 17న రెండవ డోస్‌ తీసుకున్నట్లు ఆయనకు మెసేజ్‌ వచ్చింది. రెండో డోస్‌ టీకాతీసుకున్నట్లు మెసేజ్‌ వచ్చిన రోజు ఆయన స్థానికంగా లేరు. సంగారెడ్డి జిల్లా, కోహీర్‌కు వ్యక్తిగత పనిపై వెళ్లారు. తాను రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోకుండానే తీసుకున్నట్లు ఆయన ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో ఆయన కంగుతిన్నారు. దౌల్తాబాద్‌ మండలం, దేవర ఫస్లావాద్‌ గ్రామానికి చెందిన కూర నారాయణమ్మ గత ఏడాది అక్టోబరు 13న మొదటి డోస్‌ టీకా తీసుకోగా, ఆమె రెండో డోస్‌ టీకా తీసుకోకుండానే ఈనెల 5న తీసుకున్నట్లు మెసేజ్‌ పంపించారు. ఎంతో పకడ్బందీగా చేపట్టాల్సిన కరోనా వ్యాక్సినేషన్‌ పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఈ సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

తప్పుల తడకగా నమోదు ప్రక్రియ

కొవిడ్‌ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు 15 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టీకా వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సూచిస్తుంటే, మర్పల్లి మండలంలో మాత్రం వ్యాక్సినేషన్‌ నమోదు ప్రక్రియ తప్పుల తడకగా మారింది. ఈ విషయమై సంబంఽధిత వైద్య సిబ్బందిని ప్రశ్నించగా తమకేమీ సంబంధం లేదని, టీకా వేసుకున్నా, వేసుకోకపోయినా జిల్లాస్థాయి నుంచే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని, పైగా గడువులోగా టీకా వేసుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారు. వృద్ధులు, నిరక్ష్యరాస్యులకు ఎప్పుడు టీకా వేసుకోవాలో తెలియక అయోమయం చెందుతుంటే,  ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తయినట్లు చూపించుకోవడానికి తప్పుడుగా నమోదు చేస్తున్నారు. మర్పల్లి మండలంలో ఎంతోమంది లబ్ధ్దిదారులకు రెండో డోసు టీకా వేసుకోకుండానే వేసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదవుతున్నాయి. మండలంలో ప్రతి గ్రామంలో ఎంతో కొంతమంది ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు.

చనిపోయిన మహిళకు  రెండో డోస్‌ టీకా వేశారట..

కల్కోడ గ్రామానికి చెందిన కుడుగుంట నాగమణి (54) గతఏడాది, అక్టోబరు 19న కొవిషీల్డ్‌ మొదటి డోస్‌ వేసుకుంది. కాగా, నాగమణి డిసెంబరు ఒకటో తేదీన తన పొలం వద్ద పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందింది. అయితే ఆరోగ్య  సిబ్బంది మాత్రం కుడుగుంట నాగమణి (ఆధార్‌కార్డు నెం 4441 5704 1228) ఈనెల 18న కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వేసుకున్నట్లు ఆమె రెండో కుమారుడు సుధాకర్‌ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపించారు. 48 రోజుల కిందట మృతి చెందిన నాగమణి రెండోడోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేజ్‌ కూడా జారీ చేశారు. దీని బట్టి చూస్తే వ్యాక్సినేషన్‌ నమోదులో ఏ మేర నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టమవుతోంది. 

రెండో డోస్‌ తీసుకోకున్నా మెసేజ్‌ పంపించారు: - సింగూరి రాజు, మర్పల్లి, వికారాబాద్‌ జిల్లా 

నేను రెండో డోస్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోకున్నా తీసుకున్నట్లు నాకు మెసేజ్‌ పంపించారు. నేను మర్పల్లి  కేంద్రంలో గత ఏడాది జూలై 2న మొదటి డోస్‌ టీకా తీసుకున్నా. నాకు రెండవ డోస్‌ టీకా వేయకున్నా వేసినట్లు ఈనెల 17న, సాయంత్రం 4 గంటలకు నా ఫోన్‌కు మెసేజ్‌ పంపించారు. ఆ రోజు స్థానికంగా లేను. నా వ్యక్తిగత పనిపైన కోహీర్‌ వెళ్లాను. వ్యాక్సిన్‌ తీసుకోకున్నా తీసుకున్నట్లు మెసేజ్‌ పంపించడం దారుణం.

Updated Date - 2022-01-25T04:04:38+05:30 IST