జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇష్టారాజ్యం..!

ABN , First Publish Date - 2022-05-28T04:28:47+05:30 IST

జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా నడుస్తోంది. అధికారులు ఆడిందే ఆటగా పరిస్థితి తయా రైంది. గ్రామాలకు సరఫరా చేసే సరుకులకు టెండర్లు ఆహ్వానించకుండా నేరుగా ఆర్డర్లు పెడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ లక్షలు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వర్షాకాలంలో క్లోరినేషన్‌ చేసేందుకు జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలకు సరఫరా చేసే బ్లీచింగ్‌ పౌడర్‌లో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా చేసేందుకు టెండర్లను ఆహ్వానించేవారు.

జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇష్టారాజ్యం..!
జిల్లా పంచాయతీ కార్యాలయం

బ్లీచింగ్‌ పౌడర్‌ ఆర్డర్‌లో నిధులు గోల్‌మాల్‌

టెండర్లకు వెళ్లకుండా నేరుగా కొనుగోళ్లు

గతంలోనూ అనేక అక్రమాల ఆరోపణలు

విచారణ చేపట్టిన రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌

మంచిర్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా నడుస్తోంది. అధికారులు ఆడిందే ఆటగా పరిస్థితి తయా రైంది. గ్రామాలకు సరఫరా చేసే సరుకులకు టెండర్లు ఆహ్వానించకుండా నేరుగా ఆర్డర్లు పెడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ లక్షలు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వర్షాకాలంలో క్లోరినేషన్‌ చేసేందుకు జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలకు సరఫరా చేసే బ్లీచింగ్‌ పౌడర్‌లో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా చేసేందుకు టెండర్లను ఆహ్వానించేవారు. గ్రామ పంచాయతీలకు ఎంత బ్లీచింగ్‌ పౌడర్‌ అవసరం ఉంటుందో కార్యదర్శి ద్వారా మండల పంచాయతీ అధికారి(ఎంపీవో)కు సమాచారం అందేది. ఎంపీవో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)కు అందజేస్తారు. డీపీవో ద్వారా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌)కు రిపోర్టు చేసిన అనంతరం ఆయన పత్రికా ప్రకటనల ద్వారా టెండర్లు ఆహ్వానిస్తారు. టెండర్లలో పాల్గొని బిడ్‌ దక్కించుకున్న వారికి బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలి. జిల్లాలో ఈ ప్రక్రియ ఏమీ లేకుండానే నేరుగా హైద్రాబాద్‌కు ఆర్డర్‌ ఇచ్చినట్లు సమాచారం. 

కమీషన్లు అందడం లేదని....

గతంలో టెండర్లలో బిడ్లు దక్కించుకుని బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్‌ కమీషన్లు ఇవ్వడం లేదనే నెపంతో నేరుగా ఆర్డర్‌ పెట్టినట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాలుగా బ్లీచింగ్‌ పౌడర్‌ సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ను కాదని ఎక్కువ ధరకు హైద్రాబాద్‌లోని ఓ సంస్థకు  టెండర్‌ ఇవ్వకుండానే ఆర్డరిచ్చినట్లు సమాచారం. గత నెల వరకు బ్లీచింగ్‌ పౌడర్‌ ఒక బ్యాగు ధర రూ. 1150 ఉండగా, ప్రస్తుతం దానికి మరో రూ. 200 అదనంగా చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో ఒక్కో గ్రామ పంచాయతీకి కనీసం 500 బ్యాగుల బ్లీచింగ్‌ పౌడర్‌ అవసరం ఉంటుందని అంచనా. ఇందుకోసం హైద్రాబాద్‌లోని సదరు సంస్థ నుంచి కమీషన్ల రూపంలో పెద్ద మొత్తంలో అధికారి జేబుల్లో వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా అదనపు చెల్లింపుల కారణంగా పంచాయ తీలపై కూడా భారం పడనుంది. ఇదేమిటని ప్రశ్నించిన వారిని టెండర్ల విషయం తాను చూసుకుంటానని, విషయం బయటకు పొక్కితే బాగుండదని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బ్లీచింగ్‌ పౌడర్‌ జీపీలకు సరఫరా కాగా వాటిపై పరిశ్రమల ఉపయోగార్థం అని రాసి ఉన్నట్లు తెలుస్తోంది. క్లోరినేషన్‌కు పనికిరాని పౌడర్‌ అంటగడుతూ పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసింది. 

కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ

గతంలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, చెత్తబుట్టల పంపిణీలో కమీషన్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డ సదరు అధికారి ప్రస్తుతం గ్రామాల్లో ఎలాంటి కొనుగోళ్లు లేకపోవడంతో ఇతరత్రా మార్గాలపై దృష్టి సారించారు. గ్రామ పంచాయతీల పర్యటనల పేరుతో గ్రామాల్లోకి వెళ్తూ లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మాట వినని కార్యదర్శులు, సర్పంచ్‌ల పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. గతంలో హాజీపూర్‌ మండలంలో ఆ అధికారి తీరును ఎండగట్టిన ఒకరిద్దరు సర్పంచులను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది.

కార్పస్‌ ఫండ్‌లోనూ అవినీతి...

జిల్లా పంచాయతీ కార్యాలయంలో పని చేసే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే నెపంతో అధికారి ప్రత్యేకంగా బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసినట్లు సమాచారం. జిల్లాలో ఉన్న ఎంపీవోలు, కార్యదర్శులు ప్రతి నెల ఆ అకౌంటులో రూ.200 జమచేయాలని ఆదేశాలు జారీ చేసేవారు. ఈ విషయమై పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. అయితే ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం బ్లీచింగ్‌ పౌడర్‌ కుంభకోణం వెలుగు చూడడంతో శుక్రవారం పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వెస్లీ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో విచారణ జరిపారు. అనంతరం జిల్లా కార్యాలయంలోనూ ఆయన విచారణ జరిపి, రికార్డులు పరిశీలించారు. అయితే డిప్యూటీ కమిషనర్‌ తనిఖీలను అధికారులు గోప్యంగా ఉంచారు. కాగా అవినీతికి పాల్పడ్డ అధికారిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2022-05-28T04:28:47+05:30 IST