ISB ఒక మైలురాయిని దాటింది: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-05-26T20:54:37+05:30 IST

ఐఎస్‌బీ (ISB) ఒక మైలురాయిని దాటిందని ప్రధాని మోదీ (Prime Minister Modi) కొనియాడారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణమని ప్రశంసలు కురిపించారు.

ISB ఒక మైలురాయిని దాటింది: ప్రధాని మోదీ

హైదరాబాద్: ఐఎస్‌బీ (ISB) ఒక మైలురాయిని దాటిందని ప్రధాని మోదీ (Prime Minister Modi) కొనియాడారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణమని ప్రశంసలు కురిపించారు. 20 ఏళ్ల వసంతాలను ఐఎస్‌బీ పూర్తి జరుపుకుంటోందని, 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్‌ ఐఎస్‌బీని ప్రారంభించారని తెలిపారు. నేడు ఆసియాలోనే ఐఎస్‌బీ టాప్‌ బిజినెస్‌ స్కూల్‌ అని మోదీ పొగడ్తలు కురిపించారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని తెలిపారు. ఐఎస్‌బీలో చదివిన వారు విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని చెప్పారు. అనేక స్టార్టప్‌లను ప్రారంభించారని, దేశానికి ఐఎస్‌బీ గర్వకారణమన్నారు. వచ్చే 25 ఏళ్లకు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని మోదీ ప్రకటించారు. 



‘‘జీ20 దేశాల్లో భారత్‌ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్‌ (Internet) వాడకంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ దేశంలో ఉంది. కరోనా సమయంలో దేశం తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూపింది. భారత్‌కు రికార్డుస్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. నేడు ఇండియా (India) అంటే బిజినెస్‌ అనేలా పరిస్థితి ఉంది. భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. మనం చెప్పే పరిష్కారాలను ప్రపంచం అంతా అమలు చేస్తోంది. యువత కోసమే దేశంలో ఎన్నో సంస్కరణలు చేస్తున్నాం. యువతతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రిఫామ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ అందరికీ ముఖ్యం. దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో దేశం మొదటి స్థానంలో ఉంది. మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించండి. మీ కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండి’’ అని మోదీ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-26T20:54:37+05:30 IST