Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఐఎస్‌బి.. చంద్రబాబు విజన్ ఫలితమే

twitter-iconwatsapp-iconfb-icon
ఐఎస్‌బి.. చంద్రబాబు విజన్ ఫలితమే

పోటీప్రపంచంలో ఏ దేశానికైనా, రాష్ట్రాలకైనా పెట్టుబడులు, ప్రతిష్టాత్మక సంస్థలు ఊరికే నడుచుకొంటూ రావు. అందుకు అధికారంలో ఉన్న వారి చొరవ, కృషి, పట్టుదల, కార్యాచరణ తోడవ్వాలి. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగి నేడు ద్విదశాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న హైదరాబాద్‌ ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ (ఐఎస్‌బి) ఏర్పాటు వెనుక ఓ నాయకుడి పట్టుదల, అసమాన కృషి, దూరదృష్టి ఉన్నాయి. ఆయనెవరో కాదు– ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు. 


1998లో ప్రపంచంలోని 500 ఫార్చూన్‌ కంపెనీలు తమ ఉమ్మడి భాగస్వామ్యంలో ఆసియా ఖండంలో ఓ బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని భావించాయి. ఆ తర్వాత భారతదేశంలో అనువైన వాతావరణ స్థితిగతులు, మెరుగైన శాంతిభద్రతలు, సహకరించే ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో తమ బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకున్నాయి. మెకిన్సే సంస్థకు చెందిన రజత్‌గుప్తా, అనిల్‌కుమార్‌లతోపాటు కొంతమంది విదేశీ ప్రతినిధులను ఓ బృందంగా ఏర్పాటుచేసి వారికి ‘ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌’ ఏర్పాటు బాధ్యతను అప్పగించారు.


ఈ ప్రతిపాదన తెరమీదకు రాగానే హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దానికోసం పోటీ పడ్డాయి. బిజినెస్‌ స్కూల్‌ ప్రతినిధి బృందం కూడా ఆ రాష్ట్రాలలో ఒకదానిని ఎంచుకోవాలనుకొన్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌‍ను వారు కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని అన్ని రంగాలలో ఉపయోగిస్తూ ‘స్మార్ట్‌ గవర్నెన్స్‌’తో ముందుకు దూసుకువెళుతున్న వైనాన్ని దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఆసక్తితో గమనిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సమర్థులైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఆయన పేషీలో పనిచేసేవారు. అందులో ఐటీ, బిజినెస్‌ రంగాలలో చక్కటి అవగాహన కలిగిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రణదీప్‌ సుడాన్‌ దృష్టికి ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు అంశం రాగానే ఆయన ఆ విషయాన్ని చంద్రబాబు చెవిన వేశారు. బిజినెస్‌ స్కూల్‌ ప్రమోటర్ల తొలి ప్రాధాన్యం ముంబాయి, ఆ తర్వాత బెంగుళూరు. ఈ రెంటిలో ఏదో ఒక చోట స్కూల్‌ పెట్టడానికి వారు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. అప్పటికే పలు జాతీయ సంస్థలను, వ్యాపార సంస్థలను రాష్ట్రానికి రప్పించడానికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రమోటర్లతో మాట్లాడటం చిన్నతనంగా భావించకుండా ఫోన్‌ ద్వారా ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ ప్రమోటర్లందరితో మాట్లాడారు. హైదరాబాద్‌ను కూడా పరిగణనలోకి తీసుకోమని అభ్యర్థించారు. ‘మాకు బొంబాయి తొలి ప్రాధాన్యత. లేదంటే బెంగుళూరు. హైదరాబాద్‌ ఆలోచనే లేదు’ అని వారు తేల్చేశారు. చంద్రబాబు పట్టువీడలేదు. ‘మీరు ఏమీ అనుకోకపోతే, ఒక్కసారి హైదరాబాదు రండి. నన్ను కలిసి జస్ట్‌ టీ తాగి వెళ్లండి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్‌ చేస్తున్నా’ అంటూ ఎటువంటి భేషజాలు లేకుండా ఒక మెట్టుదిగి కోరారు.


బిజినెస్‌ స్కూల్‌ ప్రమోటర్లకు అది ఓ కొత్త అనుభవం. వారు అప్పటివరకు నెగోషియేషన్స్‌ జరిపింది ఆయా రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతోనే. భారతదేశంలో రెడ్‌టేపిజం ఎక్కువని, అధికారంలో ఉన్నవారు ఒకటికి పదిసార్లు తిప్పించుకుంటారనే అభిప్రాయానికి భిన్నంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తమకు ఫోన్‌ చేసి ‘టీ’కి రమ్మని ఆహ్వానించడంతో వారు కాదనలేకపోయారు. ‘మేము వస్తాం, మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. కానీ, మీ దగ్గరే బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామన్న గ్యారంటీ మాత్రం ఇవ్వం’ అన్నారు. చంద్రబాబు సరేనన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆ ప్రమోటర్లను ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకోవడానికి చంద్రబాబు తన క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులను ఎయిర్‌పోర్టుకు పంపారు. మంత్రుల స్వాగత సత్కారం స్వీకరించిన ఆ ప్రమోటర్లు అక్కడి నుండి నేరుగా జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి వారికి ఎదురేగి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలుకప్పి సాదరంగా లోపలికి తీసుకువెళ్లారు. స్వయంగా గరిటె పట్టి ప్రతినిధులందరికీ బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించి ‘అతిథిదేవోభవ’ అన్న భారత సంప్రదాయాన్ని వారికి రుచి చూపించారు. ఆ తర్వాత తన నివాసంలోనే ఓ అరగంటపాటు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రతినిధి బృందం ముందు తన విజన్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌ ప్రత్యేకతలతోపాటు, అభివృద్ధిపథంలో రాష్ట్రం ఏవిధంగా ముందుకు సాగుతున్నదో గణాంకాలతోసహా వివరించారు. ‘ఇక్కడ స్కూల్‌ ఏర్పాటు చేస్తే మీరు అందించే రాయితీలు ఏమిటి?’ అని ఆ ప్రతినిధులు చంద్రబాబును అడిగారు. ‘మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఆ ప్రభుత్వాలు ప్రతిపాదించిన రాయితీలకంటే మేము ఎక్కువ ఇస్తాం. అనుమతులలోనూ ఎటువంటి జాప్యం ఉండదు. అనుకొన్న సమయంలో నిర్మాణం పూర్తి చేసుకొని కార్యకలాపాలు మొదలుపెట్టుకోవచ్చు’ అని చంద్రబాబు చెప్పడంతో బిజినెస్‌ స్కూల్‌ బృందం సంతృప్తితో తిరుగు ప్రయాణమైంది. ఇది జరిగిన కొన్ని రోజులకే హైదరాబాద్‌లో ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ‘ఐఎస్‌బిని హైదరాబాదులోనే నెలకొల్పాలన్న మా నిర్ణయానికి కారణం– రాష్ట్రాభివృద్ధి పట్ల ఈ ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి. ప్రభుత్వం అప్రోచ్‌ అద్భుతంగా ఉంది’ అని ఐఎస్‌బి ప్రతినిధి బృందం మీడియా ద్వారా దేశ ప్రజలందరికీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి శివారు ప్రాంతంలో అత్యంత ఖరీదు చేసే 250 ఎకరాలను బిజినెస్‌ స్కూలుకు ఇవ్వజూపింది. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు నగరానికి సమీపంలోనే 250 ఎకరాలు ఇస్తామన్నది. చివరకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలంలో ఐఎస్‌బి ఏర్పాటయింది. ఐఎస్‌బికి స్టాంపుడ్యూటీ మినహాయింపుతోపాటు కొన్ని రాయితీలు కల్పించడంపై ఆనాడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేశారు. కొందరు నాయకులు కేసు వేశారు. కానీ, అన్ని అంశాలను విచారించిన కోర్టు చాలా స్పష్టంగా ‘ఇట్‌ ఈజ్‌ నాట్‌ ఎ ప్రాఫిట్‌ మేకింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఓ మంచి ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు, అధికార దుర్వినియోగం ఏమీ లేదు’ అని స్పష్టంగా చెప్పింది. 


కొసమెరుపు ఏమంటే, హైదరాబాద్‌కు ‘ఐఎస్‌బి’ రాకుండా చేయడానికి ఇక్కడ కొందరు కాంగ్రెస్‌ నేతలు అడ్డుపడగా, ఆ సమయంలో మహారాష్ట్రలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొందరు ‘ఐఎస్‌బి’ని సాధించలేకపోయిన తమ రాష్ట్ర ముఖ్యమంత్రుల అసమర్థతను బాహాటంగా విమర్శించారు. చంద్రబాబు చొరవ ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసిందని కొన్ని జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాశాయి. 1999లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌కు పునాదిరాయి పడింది. 2001లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రపంచంలోనే ఓ అగ్రగామి విద్యాసంస్థగా, హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచింది. అసాధ్యాలను సుసాధ్యం చేయడం గొప్ప నాయకులకే సాధ్యం. ‘ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌’ ఇందుకు ఓ చక్కని ఉదాహరణ.

విక్రమ్‌ పూల (సీనియర్‌ జర్నలిస్ట్‌)

(నేడు ‘ఐఎస్‌బి’ ద్విదశాబ్ది వేడుకలు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.