యోగీకి సీఎంగా మళ్లీ ఛాన్స్ లేనట్టేనా?

ABN , First Publish Date - 2021-06-21T22:49:05+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి స్టార్ క్యాంపెనయినర్‌గా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. మోదీ-షాల ప్రభావం ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో యోగి ఇమేజ్

యోగీకి సీఎంగా మళ్లీ ఛాన్స్ లేనట్టేనా?

లఖ్‌నవూ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రే అయ్యే అవకాశాలు లేవనే అనుమానాలు వస్తున్నాయి. యూపీ కేబినేట్‌‌లో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇలాంటి అనుమానాల్ని లేవనెత్తుతున్నాయి. ‘‘ఉత్తరప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది’’ అని ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.


ఇలాంటి వ్యాఖ్యలే కొంత కాలం క్రితం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేశారు. ఉత్తరప్రదేశ్ తర్వాతి సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, తమ పరిధిలో లేని అంశంపై చర్చలు అనవరసరమని కేశవ్ ప్రసాద్ మౌర్య గతంలో వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీళ్లు చేస్తున్న వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో కూడా యోగి ఆదిత్యనాథే సీఎం అభ్యర్థనే వాదన పార్టీలోని కార్యకర్తల్లో బలంగా ఉంది. యోగి నేతృత్వంలోనే యూపీ ఎన్నికలకు బీజేపీ వెళ్తుందనే ప్రచారం కూడా బాగానే జరిగింది. ఇప్పుడు తీరా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థి యోగి అవ్వొచ్చు, కాకపోవచ్చనే అనుమానాలు పార్టీ నేతలను కార్యకర్తలను అయోమయంలోకి నెడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి స్టార్ క్యాంపెనయినర్‌గా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. మోదీ-షాల ప్రభావం ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో యోగి ఇమేజ్ కూడా ఉపయోగపడిందని అంటుంటారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అంటే యోగి.. యోగి అంటే బీజేపీ అనే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థుల్ని మార్చబోతున్నారన్న వార్తలు బీజేపీలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయనే చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-06-21T22:49:05+05:30 IST