లాక్‌డౌన్‌ ఎత్తివేత సబబేనా?

ABN , First Publish Date - 2020-05-31T08:27:00+05:30 IST

అమెరికా, భారత్‌లలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను క్రమేణా సడలించారు. వైరస్‌ పూర్తిగా కట్టడి కాకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సరైన చర్యేనా? కరోనాతో సహజీవనం చేయాలన్న పిలుపు సమంజసమేనా? అన్న ప్రశ్నలు పలువురు సంధిస్తున్నారు...

లాక్‌డౌన్‌ ఎత్తివేత సబబేనా?

  • సడలింపుల అనంతరం ఎలా!
  • అమెరికాలో పకడ్బందీ చర్యలు
  • ఇక్కడ ప్రజల క్రమశిక్షణే కీలకం
  • అప్పుడే కరోనాకు ముకుతాడు

(అమెరికా నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)

అమెరికా, భారత్‌లలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను క్రమేణా సడలించారు. వైరస్‌ పూర్తిగా కట్టడి కాకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సరైన చర్యేనా? కరోనాతో సహజీవనం చేయాలన్న పిలుపు సమంజసమేనా? అన్న ప్రశ్నలు పలువురు సంధిస్తున్నారు. ఇంతకాలం లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటూ నిలదీస్తున్నవారూ ఉన్నారు. ఇంతకీ ఇరుదేశాల్లో సడలింపు అనంతరం పరిస్థితులు ఎలా ఉన్నాయి? 


అమెరికాలో ఏం జరుగుతోంది?

కరోనా కోరల్లో చిక్కుకున్న అమెరికా తీవ్రంగా నష్టపోయి, జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్లో ఆ దేశానిదే అగ్రస్థానం. 17.94 లక్షల మంది దీని బారినపడ్డారు. లక్ష మందికిపైగా మరణించారు. అయితే ఈ ఏడాది నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు జయకేతనం ఎగరేయాలని ఉవ్విళ్లూరుతున్న అధ్యక్షుడు ట్రంప్‌.. కరోనా వైరస్‌ తన పాలిట శనిలా భావించారు. అందుకే ఆయన దూకుడు నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని అందరికీ అర్థమైంది. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు అధికార పక్షమైన రిపబ్లికన్‌ పార్టీ చేతిలో ఉండగా.. మరికొన్ని ప్రతిపక్ష డెమోక్రాట్ల చేతుల్లో ఉన్నాయి. విస్తీర్ణపరంగా అతి పెద్దదైన టెక్సస్‌.. తొలుతగా లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన రాష్ట్రాల్లో ఒకటి. ఈ నెలారంభంలోనే సడలింపులు ఇస్తూ రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌కు అనుమతి ఇచ్చారు. వాటితో పాటు వ్యాపారసంస్థలు, దుకాణాలను 50ు సామర్ధ్యంతో నడపొచ్చని పదిరోజుల క్రితం ఆదేశాలిచ్చారు. కరోనా కేసుల రికవరీ శాతం పెరిగిన నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇచ్చారు. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన నూయార్క్‌ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.  న్యూయార్క్‌ తర్వాత కరోనాతో అతలాకుతలమైన న్యూజెర్సీ రాష్ట్రంలో ఏప్రిల్‌తో పోలిస్తే ప్రస్తుతం రోగులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈనెల 18న కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు తొలగించారు. దశలవారీగా దీనిని అమలు చేస్తూ తదుపరి దశలో గోల్ఫ్‌కోర్టులు, పార్కులు, పబ్‌లకు అనుమతి ఇవ్వనున్నారు. తొలి నుంచీ జాగ్రత్త వహిస్తూ కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పటికీ రోజుకి 1400 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రం అత్యంత జాగరూకతతో సడలింపులు ఇస్తోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ ఉన్న వర్జీనియా రాష్ట్రంలో నిత్యావసరాలు మినహా పెద్దగా వేటికీ సడలింపులు ఇవ్వలేదు. జూన్‌ 8 నుంచి కొన్ని వ్యాపారాలను అనుమతించే వీలుంది.  


నియంత్రణ ఎలా ఉంటుంది?

అమెరికా పౌరులకు ప్రభుత్వం, పోలీసులు, నిబంధనలు అంటే భయం., గౌరవం ఉంటాయి. అందుకే సడలింపులతో కూడిన ఆంక్షలను అలవోకగా అమలు చేయగలుగుతారు. ఆస్పత్రిలో చేరే రోగులు, కరోనా పరీక్షలు జరిపే సామర్ధ్యం, కేసుల ట్రేసింగ్‌ సామర్ధ్యం, క్వారంటైన్‌ వసతులు తదితర అంశాల ఆధారంగా లాక్‌డౌన్‌ ఎత్తివేతపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. 


భారత్‌లో సాధ్యమా!

లాక్‌డౌన్‌ను సడలించినా అమెరికాలో కరోనావైర్‌సను బాగా కట్టడి చేయగలుగుతున్నారు. భారత్‌లో మాత్రం కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సడలింపు పూర్తిగా కనిపిస్తోంది. కరోనాతో సహజీవనం చేయాలని చెబుతూ ఆంక్షలు ఎత్తివేయడమేమిటనే విమర్శలూ లేకపోలేదు. ఏప్రిల్‌ అంతా లాక్‌డౌన్‌ అమలైన అనంతరం మే 3వ తేదీ నాటికి దేశంలో 40000 కేసులు నమోదయ్యాయి. కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత మే 10కి ఈ సంఖ్య 60వేలకు చేరింది. మే 20 నాటికి లక్ష దాటిపోయింది. ఆస్పత్రుల సంఖ్య, పరీక్షల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయంగా పెంచాయి. అలాగే కరోనా ట్రేసింగ్‌ సామర్ధ్యమూ పెరిగింది. పోలీసులు, గ్రామ వాలంటీర్ల ద్వారా కాంటాక్ట్‌ కేసులను ఇట్టే పట్టేయగలిగారు. అలాగే క్వారంటైన్‌ సామర్ధ్యాన్నీ పెంచుకున్నారు. అయితే ఆంక్షల సడలింపు అనంతరం ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరించకపోతే అదుపు చేసే శక్తి ప్రభుత్వాలకు లేదు. అమెరికా భూవిస్తీర్ణంలో మూడోవంతు, జనాభాపరంగా నాలుగు రెట్లు ఎక్కువ ఉన్న భారత్‌లో ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరించడమే కీలకం కానుంది.  


Updated Date - 2020-05-31T08:27:00+05:30 IST