వీఎంఆర్‌డీఏ సెక్యూరిటీ కళ్లు మూసుకుందా?

ABN , First Publish Date - 2021-07-27T06:17:50+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)లో సెక్యూరిటీ విభాగం మొద్దు నిద్రపోతోంది.

వీఎంఆర్‌డీఏ సెక్యూరిటీ కళ్లు మూసుకుందా?
ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌

ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ ఆస్తులు గతంలో వీఎంఆర్‌డీఏ సీజ్‌

క్రేన్‌ తెచ్చి జనరేటర్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

స్వాధీన ఆస్తులపై అధికారుల నిర్లక్ష్యం

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)లో సెక్యూరిటీ విభాగం మొద్దు నిద్రపోతోంది. అధికారులు కూడా పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పట్టపగలు దొంగలు పడి క్రేన్‌ సాయంతో జనరేటర్‌, ఏసీ పరికరాలు ఎత్తుకుపోతుంటే... కళ్లు మూసుకున్నారు. ‘దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి’ అనే చందంగా దొంగతనం జరిగిన ఎనిమిది నెలలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే వీఎంఆర్‌డీఏ కార్యాలయం ఎదురుగా రెండు టన్నుల బరువైన జనరేటర్‌ను ఎలా తీసుకెళ్లారా? అని పోలీసులు ఆరా తీస్తే... ఒక క్రేన్‌, మరొక వ్యాను తీసుకువచ్చి, పట్టపగలే పట్టుకుపోయినట్టు తెలిసింది. వీఎంఆర్‌డీఏకి 100 మంది వరకు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అలాగే ఫ్యూజన్‌ఫుడ్స్‌ని ఆనుకొని ఉన్న గురజాడ కళాక్షేత్రం, చిల్డ్రన్‌ ఎరీనాకు కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా దొంగతనం జరుగుతున్న విషయం గమనించకపోవడం విశేషం. 

ఎంత నిర్లక్ష్యం అంటే...?

ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ను రాజకీయ కారణాలతో గత ఏడాది నవంబరు 15న వీఎంఆర్‌డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో సామాన్లు అన్నీ 10 లారీల్లో తరలించారు. అయితే ఆవరణలోని 125 కేవీ జనరేటర్‌,  10 ఏసీ కంప్రెషర్లు, స్టీల్‌ డిష్‌ వాషర్లు అలాగే వదిలేశారు. వాటిపై కన్నేసిన దొంగలు ఎత్తుకుపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠా పట్టపగలే క్రేన్‌, వ్యాన్‌తో వచ్చి జనరేటర్‌, ఏసీ కంప్రెషర్లు, డిష్‌ వాషర్‌ ఎత్తుకుపోయారు. సీజ్‌ చేసిన ఆస్తులను భద్రంగా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. కానీ దొంగతనం జరిగిందనే విషయం ఎవరూ గుర్తించలేదు. ఇటీవల ఎవరో ఫోన్‌ చేసి చెబితే గానీ అధికారులు కళ్లు తెరవలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన వీఎంఆర్‌డీఏలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కమ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న లెక్కల అర్జునరావు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి ఐదుగురు ముఠా సభ్యులను పట్టుకున్నారు. చినవాల్తేరు అమ్మవారి వీధికి చెందిన ఎలక్ర్టీషియన్‌ గనిరెడ్డి జాన్‌ మరో నలుగురితో కలిసి ఈ చోరికి పాల్పడినట్టు క్రైమ్‌ డీసీపీ సురేశ్‌బాబు వెల్లడించారు. పోలీసులు జనరేటర్‌ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏసీ కంప్రెషర్లు, డిష్‌ వాషర్ల సంగతి తేలాల్సి ఉంది. 

అధికారులదే బాధ్యత

హర్షవర్దన్‌, ఫ్యూజన్‌ ఫుడ్స్‌ అధినేత

రెస్టారెంట్‌ను వీఎంఆర్‌డీఏ అధికారులు స్వాధీనం చేసుకొని తాళాలు వేశారు. అందులో ఏ సామాన్లు పోయినా వారిదే బాధ్యత. పత్రికల్లో వార్త చూశాకే అక్కడ దొంగతనం జరిగిందని తెలిసింది. జనరేటర్‌తోపాటు 10 ఏసీ కంప్రెషర్లు, డిష్‌ వాషర్‌ ఉండాలి. ఈ చోరీ విషయంలో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఉన్నదీ లేనిదీ తేలాల్సి ఉంది. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి.

Updated Date - 2021-07-27T06:17:50+05:30 IST