వంజంగి అభివృద్ధి ఒట్టి మాటేనా?

ABN , First Publish Date - 2022-09-27T06:40:55+05:30 IST

దేశ వ్యాప్తంగా విశేష పర్యాటకాదరణ పొందిన మండలంలోని వంజంగి మేఘాల కొండల అభివృద్ధిపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ కనీసం దృష్టిసారించలేదు.

వంజంగి అభివృద్ధి ఒట్టి మాటేనా?
వంజంగి మేఘాల కొండలు

విశేష పర్యాటకాదరణ పొందినా పట్టించుకోని టూరిజం అధికారులు

సందర్శకులకు కనీస సదుపాయాలు కరువు

కొండపైకి కనీసం రోడ్డు సైతం లేని దుస్థితి

గిరిజనుల శ్రమదానంతోనే మట్టి రోడ్డు నిర్మాణం 


(ఆంధ్రజ్యోతి- పాడేరు)

దేశ వ్యాప్తంగా విశేష పర్యాటకాదరణ పొందిన మండలంలోని వంజంగి మేఘాల కొండల అభివృద్ధిపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ కనీసం దృష్టిసారించలేదు. దీంతో అక్కడికి వచ్చే పర్యాటకులకు కనీస సదుపాయాలు లేకపోవడంతో పాటు మేఘాల కొండలకు వెళ్లేందుకు సైతం పక్కా రోడ్డు సౌకర్యం లేదు. వాస్తవానికి పర్యాటక శాఖ మంత్రిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉన్నప్పుడు వంజంగి హిల్స్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ మచ్చుకైనా అభివృద్ధికి నోచుకోలేదు. వంజంగి హిల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం కనీసం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. మండలంలోని వంజంగి మేఘాల కొండలు శీతాకాలంలో వివిధ వర్ణాలతో సూర్యోదయం, పచ్చని కొండలను చుట్టి ముట్టే మేఘాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉత్తర భారతంలో హిమాలయాలు, కశ్మీరు మంచు అందాలను తలపించేలా ఉండే వంజంగి హిల్స్‌కు తక్కువ కాలంలోనే ఊహించని ప్రాచుర్యం లభించింది. దీంతో పర్యాటక సీజన్‌లో ప్రతి రోజూ ఐదు నుంచి పది వేల మంది పర్యాటకులు వంజంగి హిల్స్‌ను సందర్శిస్తుంటారు. అయితే పాడేరు నుంచి మేఘాల కొండలను చేరుకునేందుకు ఆరు కిలోమీటర్ల వరకు తారురోడ్డు ఉండగా, కొత్తవలస కూడలి నుంచి మేఘాల కొండలను చేరుకునేందుకు సుమారుగా ఒకటిన్నర కిలో మీటర్లు కొండ మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఆ మార్గాన్ని పక్కా రోడ్డుగా అభివృద్ధి చేసి పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని రెండేళ్ల కిత్రం అప్పటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చినా నేటికీ రోడ్డు వేయలేదు. దీంతో ప్రతి ఏడాది పర్యాటక సీజన్‌కు ముందు అక్కడ స్థానిక గిరిజనులే శ్రమదానంలో ఆ మార్గాన్ని బాగు చేస్తున్నారు. దసరా తరువాత నుంచి వంజంగి హిల్స్‌కు సందర్శకుల తాకిడి పెరగనుంది. గతవారమే స్థానిక గిరిజనులు ఆ మార్గాన్ని శ్రమదానంలో బాగు చేశారు. వాస్తవానికి వంజంగి కొండకు సిమెంట్‌ రోడ్డు, కొండపై వ్యూపాయింట్‌ నిర్మించడం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు, అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా పర్యాటక శాఖ కనీసం దృష్టిసారించలేదు. దీంతో వంజంగి హిల్స్‌ అభివృద్ధికి నోచుకోని పరిస్థితి కొనసాగుతున్నది. అయితే వంజంగి హిల్స్‌ రిజర్వు ఫారెస్ట్‌ పరిఽధిలో ఉండడంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం రూ.50 లక్షలతో చేపట్టే కార్యక్రమాలు అక్కరకు రావనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికైనా పర్యాటక శాఖ స్పందించి వంజంగి హిల్స్‌ను అభివృద్ధి చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-27T06:40:55+05:30 IST