అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహారం.. తింటే ఆరోగ్యానికి హానికరమేనా..?

ABN , First Publish Date - 2020-06-01T20:33:31+05:30 IST

ఓ ఆహార పదార్థ స్థితిలో మార్పు తీసుకొచ్చే ప్రక్రియను ప్రాసెసింగ్‌ అంటారు. దీని వల్ల ఆహారంలో ఉండే కొన్ని పోషక విలువలు తగ్గుతాయి. ఉడికించడం, వేయించడం,

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహారం.. తింటే ఆరోగ్యానికి హానికరమేనా..?

ఆంధ్రజ్యోతి (01-06-2020):

ప్రశ్న: అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహారం అంటే ఏమిటి? అది హానికరమా?

-రమ్యశ్రీ, విజయవాడ


డాక్టర్ సమాధానం: ఓ ఆహార పదార్థ స్థితిలో మార్పు తీసుకొచ్చే ప్రక్రియను ప్రాసెసింగ్‌ అంటారు. దీని వల్ల ఆహారంలో ఉండే కొన్ని పోషక విలువలు తగ్గుతాయి. ఉడికించడం, వేయించడం, కూరగా చేయడం మొదలైనవన్నీ ప్రాసెసింగ్‌ కిందకే వస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రాసెసింగ్‌ లేకుండా తినలేం. ప్రాసెసింగ్‌ అనేది కొంత వరకు అవసరమే. ఇక అల్ట్రాప్రాసెసింగ్‌ అంటే ఆహారానికి రుచి, రంగు కోసం లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం కొవ్వులు, చక్కర, ఉప్పు, రంగులు, ప్రిజర్వేటివ్స్‌ మొదలైనవి కలపడం. అలా్ట్ర ప్రాసెస్డ్‌ ఆహారం తీసుకోవడం వల్ల రోజువారీ ఆహారం నుండి వచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు రావు. అంతేకాకుండా  అధిక మోతాదులో కెలోరీలు, కొవ్వు, అనారోగ్యకరమైన కెమికల్స్‌ వచ్చి చేరతాయి. వీటి వల్ల దీర్ఘకాలంలో వివిధ రకాల అనారోగ్యాలు రావచ్చు. అధిక కెలోరీల వల్ల ఒబెసిటీ, మధుమేహం; అధిక కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్‌, గుండె సమస్యలు; అధిక సోడియం వల్ల బీపీ, కిడ్నీ సమస్యలు; కెమికల్‌ ప్రిజర్వేటివ్స్‌ ద్వారా క్యాన్సర్‌, కాలేయ సంబంధిత వ్యాధులు రావచ్చు. అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహారానికి ఉదాహరణలు బిస్కట్లు, చాక్‌లెట్లు, కూల్‌ డ్రింకులు, చిప్స్‌, బేకరీ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ మొదలైనవి. రెడీ మిక్స్‌లతో ఇంట్లో చేసుకునే నూడిల్స్‌, కేక్స్‌, స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌ కూడా ఈకోవకు చెందినవే. ఈ దుష్పరిణామాలకు దూరంగా ఉండాలంటే వీలున్నంత వరకు వీటిని నియంత్రించాలి. ముఖ్యంగా ఈ ఆహారం వల్ల చిన్నపిల్లల్లో చురుకుదనం, ఏకాగ్రత తగ్గుతాయి.  

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-06-01T20:33:31+05:30 IST