రష్యా-ఉక్రెయిన్ యుద్ధం... భారత్ వ్యూహం ఇదేనా?...

ABN , First Publish Date - 2022-02-26T18:12:06+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపేయాలని రష్యాకు గట్టిగా

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం... భారత్ వ్యూహం ఇదేనా?...

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపేయాలని రష్యాకు గట్టిగా చెప్పేందుకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరవడం వెనుక వ్యూహం ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్న సమాధానం ఏమిటంటే, అన్ని పక్షాలను సంప్రదించి, తటస్థ పరిష్కారాన్ని కనుగొనడానికి వీలుంటుందనే ఉద్దేశంతోనే ఈ ఓటింగ్‌కు గైర్హాజరవాలని భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శుక్రవారం అమెరికా నేతృత్వంలోని దేశాలు ప్రతిపాదించిన తీర్మానం వీగిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఈ తీర్మానం తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకోవాలని కోరింది. కాల్పులను వెంటనే విరమించాలని కోరింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా తనకుగల వీటో అధికారాన్ని వినియోగించి రష్యా ఈ తీర్మానాన్ని వీగిపోయేలా చేసింది. ఈ ఓటింగ్‌కు భారత్, చైనా, యూఏఈ గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలన్నీ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు తీసుకెళ్తామని చెప్పాయి. రష్యాను జవాబుదారీ చేస్తామని తెలిపాయి. 


ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత దేశం తీవ్రంగా కలత చెందింది. ఈ ఓటింగ్‌కు గైర్హాజరవడం ద్వారా విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు మాత్రమే ఏకైక సమాధానమని చెప్పింది. స్థిరమైన, సమతుల్యతగల ఈ వైఖరిని కొనసాగిస్తానని చెప్పింది. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఇచ్చిన వివరణలో దౌత్య మార్గానికి తిరిగి రావాలని పిలుపునిచ్చింది. 


అంతర్జాతీయ చట్టం నిబంధనలు, ఐక్యరాజ్య సమితి చార్టర్ ఓ నిర్మాణాత్మక పరిష్కారాన్ని అందజేస్తాయని, వీటిని సభ్య దేశాలన్నీ గౌరవించాలని భారత దేశం పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం కోసం దౌత్య మార్గాన్ని వదిలిపెట్టడంపై విచారం వ్యక్తం చేసింది. దౌత్య మార్గానికి తిరిగి రావాలని అన్ని దేశాలను కోరింది. 


అమెరికా నేతృత్వంలోని దేశాలు ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరవడం ద్వారా చర్చలు, దౌత్యాన్ని ప్రోత్సహించడానికి వీలుగా ఓ తటస్థ వేదికను కనుగొనడానికి, అంతరాలను పూడ్చడానికి సంబంధిత వర్గాలను చేరుకునే అవకాశాన్ని భారత్ తన వద్ద ఉంచుకుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంబంధిత పక్షాలన్నిటితోనూ భారత్ సంప్రదిస్తోందని తెలిపాయి. 


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంది. వీటిలో ఐదింటికి వీటో అధికారం ఉంది. అమెరికా నేతృత్వంలోని దేశాలు ప్రతిపాదించిన తీర్మానానికి 11 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. రష్యా వీటో చేసింది. భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 


Updated Date - 2022-02-26T18:12:06+05:30 IST