జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అదేనా?

ABN , First Publish Date - 2022-01-02T19:32:23+05:30 IST

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన

జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అదేనా?

న్యూఢిల్లీ : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వాయు సేన, ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ నివేదికను త్వరలోనే వాయు సేన చీఫ్‌కు సమర్పించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా  ఆదివారం తెలిపింది. 


జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక ప్రయాణించిన హెలికాప్టర్ డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్లో ప్రయాణించిన 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ జరుగుతోంది. 


ఈ ప్రమాదానికి కారణం వాతావరణం ప్రతికూలంగా ఉండటమేనని దర్యాప్తులో వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. దారి కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, సాంకేతిక లోపం వంటివి కారణం కాదని తెలిసిందని పేర్కొంది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో పైలట్ గందరగోళానికి గురై ఉండవచ్చునని, ప్రమాదవశాత్తూ భూమిపైకి వచ్చి ఉండవచ్చునని దర్యాప్తు బృందం భావించినట్లు పేర్కొంది.  ఈ దర్యాప్తు నివేదికను తయారు చేయడానికి వాయు సేన న్యాయ విభాగం సలహాలు ఇస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది రోజుల్లోనే తుది నివేదికను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి సమర్పించనున్నట్లు పేర్కొంది. 


Updated Date - 2022-01-02T19:32:23+05:30 IST