ఇదేనా ఆదర్శం?

ABN , First Publish Date - 2022-06-24T05:17:32+05:30 IST

‘సువిశాలమైన భవనాలు ఉన్నా వినియోగించడం లేదు. మూడేళ్ల కిందటే నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వందలాది మంది విద్యార్థులకు అసౌకర్యం తప్పడం లేదు’... ఇదీ పాతపట్నంలోని ఆదర్శ పాఠశాల దుస్థితి. పాతపట్నం డిగ్రీ కాలేజీని.. ఆదర్శ కాలేజీగా గుర్తిస్తూ సౌకర్యాలను మెరుగుపరిచారు.

ఇదేనా ఆదర్శం?
ప్రారంభానికి నోచుకొని వసతిగృహాలు

ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కాలేజీలో వింత పరిస్థితులు

మూడేళ్ల కిందట హాస్టల్‌ భవనాల నిర్మాణం

ఇప్పటికీ ప్రారంభించని వైనం

విద్యార్థులకు తప్పని అసౌకర్యం

(పాతపట్నం)

‘సువిశాలమైన భవనాలు ఉన్నా వినియోగించడం లేదు. మూడేళ్ల కిందటే నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వందలాది మంది విద్యార్థులకు అసౌకర్యం తప్పడం లేదు’... ఇదీ పాతపట్నంలోని ఆదర్శ పాఠశాల దుస్థితి. పాతపట్నం డిగ్రీ కాలేజీని.. ఆదర్శ కాలేజీగా గుర్తిస్తూ సౌకర్యాలను మెరుగుపరిచారు. 2018 నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సువీశాలమైన డిగ్రీ కాలేజీ భవనాలతో పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లను సైతం నిర్మించారు. ఇందులో డిగ్రీ కాలేజీ భవనాలను మాత్రం ప్రారంభించారు. కానీ హాస్టళ్లను మాత్రం విస్మరించారు.. కొవిడ్‌ సమయంలో క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగించిన అధికారులు..వాటిని ప్రారంభించి విద్యార్థులకు మాత్రం అందుబాటులోకి తేవడం లేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ కాలేజీలో 540 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో విద్యార్థినులే 270 మంది ఉన్నారు. బీఎస్సీ, బీకాం, బీఏలో సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులు సైతం కాలేజీలో అందుబాటులో ఉన్నాయి. పాతపట్నం, సారవకోట, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టితో పాటు పక్కనే ఉన్న ఒడిశా నుంచి విద్యార్థులు కళాశాలలో చేరుతుంటారు. ఇక్కడి ఆడ్మిషన్లకు సైతం గిరాకీయే. అందుకే ప్రభుత్వం ఇక్కడ డిగ్రీ కాలేజీని.. మోడరన్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేసింది. అన్నిరకాల వసతులను ఏర్పాటుచేసింది. అధ్యాపకులను సైతం నియమించింది. అంతా బాగానే ఉంది. కానీ హాస్టళ్లను అందుబాటులోకి తేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

 విమర్శల వెల్లువ

హాస్టళ్లు అందుబాటులో లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు హాస్టళ్లలో చేరుతున్నారు. బీసీ, ఎస్సీ, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో కొనసాగుతున్న వారూ ఉన్నారు. మంచి వసతులతో ఆదర్శ డిగ్రీ కాలేజీకి చెందిన హాస్టళ్లు నిర్మితమైనా.. అధికారులు కుంటిసాకులు చూపుతూ ప్రారంభించడం లేదు. ప్రధానంగా హాస్టళ్ల చుట్టూ ప్రహరీ నిర్మాణం జరగలేదు. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో విష సర్పాలు, జంతువులు ప్రవేశించే అవకాశముందని.. బాలికలకు రక్షణ కూడా ఉండదని.. రేపు ఏదైనా జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. రూ.12 కోట్లతో భవనాలు నిర్మించి ప్రహరీలు నిర్మించకపోవడమేమిటని విద్యార్థిను తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికైనా ప్రహరీ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. హాస్టళ్లను ప్రారంభించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


నిధులు మంజూరు

వసతిగృహాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరాం. ముఖ్యంగా ప్రహరీల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశాం. నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రహరీల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం రూ.90 లక్షలు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.

- కె.సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కాలేజీ




111111111111111111111111111111111

Updated Date - 2022-06-24T05:17:32+05:30 IST