Abn logo
May 12 2021 @ 01:28AM

సిఎస్‌గారూ ఇదేం వైఖరి?

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి,

కొవిడ్ మహమ్మారి నియంత్రణలో ఒక డాక్టర్‌గా రోగులకు చికిత్స చేయడంతో పాటు ఇంకా పలు విధాల పాల్గొంటున్నాను. ఆసుపత్రిలో పడకలు అవసరమైన వారికి వాటిని ఏర్పాటు చేసేవాళ్లంగా (మాలో చాలా మందిమి ఫిజీషియన్ల కంటే బెడ్ మేనేజర్లమైపోయాం!), వాక్సిన్ సమకూర్చే వాళ్లం (ఇది మా సరికొత్త బాధ్యత)గా మిగిలిపోతున్నాం. మీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను వీక్షించిన తరువాత మీకీ బహిరంగ లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చాను. 


‘ట్రెండ్ చాలా బాగుంది’ అనే వ్యాఖ్యతో మీరు మీ పత్రికా గోష్ఠిని ప్రారంభించారు. ట్రెండ్! ఒక సినిమా పంపీణీదారు లేదా సినిమా హీరో తమ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నప్పుడు అలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మరి మీరు ఏ ట్రెండ్ గురించి మాట్లాడారు? సరే, అసలు విషయానికి వస్తాను. కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిందని, ఆక్సిజన్ పడకలు సరిపోయినన్ని ఉన్నాయని చెప్పారు కదా. మీరు, నేను విలేఖర్లతో సహా ప్రభుత్వాసుపత్రులు అన్నిటికీ వెళదాం. అక్కడేం జరుగుతోందో చూద్దాం. మీరన్నట్టు కేసుల సంఖ్య తగ్గిందని, ఆక్సిజన్ పడకలు సరిపోయినన్ని ఉన్నాయో లేదో స్వయంగా నిర్ధారించుకుందాం. ఆసుపత్రుల ఎదుట, లోపల సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి టీవీఛానెల్స్‌తో వాటిని అనుసంధానించండి.. అప్పుడు మీరు చెప్పిన విషయాలపై నమ్మకం దృఢపడుతుంది. 


ఫ్రాణాలను కాపాడే కొన్ని ఔషధాల కోసం మాకు రేయింబవళ్ళు అభ్యర్థనలు వస్తున్నాయి. అటువంటి ఔషధాల్లో ఒకటైన రెమ్‌డెసివిర్‌కు కొవిడ్ నివారణలో చాలవరకు ఎటువంటి పాత్ర లేదని, ప్రతి కొవిడ్ రోగికి దానిని ఇవ్వకూడదని మీరు చెప్పారు. అయితే మహమ్మారి ఉగ్రతాండవం చేస్తూ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న వేళ కూడా అక్రమ నిల్వదారులు ఆ ఔషధ ధరను విపరీతంగా పెంచేశారు. రూ.700కు లభించాల్సిన ఆ ఔషధాన్ని రూ.30,000 నుంచి రూ.60,000 మధ్య అమ్ముతున్నారు. ఒక ప్రముఖ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఆ ఔషధాన్ని రూ.65,000కు కొన్నారన్న విషయం మీకు తెలుసునా? ఇప్పుడు చెప్పండి. ప్రాణ రక్షణకు అత్యంతావశ్యకమైన దానిని అక్రమంగా నిల్వ చేసి అమ్ముకుంటూ అమితంగా సొమ్ము చేసుకుంటున్నవారిపై మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? 


మీరు కొవిడ్ కిట్ గురించి గొప్పగా చెప్పారు. అందులో ఉన్న ఔషధాలు ఏవీ కొవిడ్ చికిత్సలో ఉపయోగపడేవి కావు. అదలా ఉంచండి, గత అనుభవాలను ఒకసారి గుర్తుచేసుకోండి. కిట్ లోని ఔషధాలను అక్రమంగా నిల్వ చేసి మార్కెట్లో కొరతను సృష్టించారు. ఇప్పుడు వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరి మీరు మీ పత్రికాగోష్ఠిలో కొవిడ్‌కిట్‌ను ప్రదర్శించడం సంబంధిత ఔషధాల అక్రమ నిల్వలను, వాటి అక్రమ విక్రయాలను ప్రోత్సహించడమే కాదూ? మీ సలహా మేరకు, మహమ్మారితో అల్లల్లాడిపోతున్న ప్రజలు ఆ ఔషధాలను తప్పక కొనుగోలు చేస్తారు. అయితే మార్కెట్లో అవి అందుబాటులో లేకపోవడమనేది తప్పక సంభవిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఆక్సిజన్ సిలిండర్లు, మందులను అక్రమంగా నిల్వ చేస్తున్నవారిపై మీరు ఎందుకు దాడులు నిర్వహించరు? 


అన్ని రాష్ట్రాలు వాక్సిన్లను తమకు తామే కొనుగోలు చేసుకోవాలని గత నెలలో కేంద్రం స్పష్టం చేసింది. ఏ ధరలకు వాటిని కొనుగోలు చేయాలో కూడా నిర్దేశించింది. ఈ విషయమై కంపెనీలతో ఇంతవరకు మీరు ఒక తుది ఒప్పందానికి ఎందుకు రాలేదు? రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టీకాను ఉచితంగా వేయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ద్వారానే వాక్సినేషన్ జరుగుతుందని అన్నారు. మీరు టీకా వేయించుకోవడానికి మీ పేరు రిజిస్టర్ చేయించుకోవలసిన అవసరం లేదు. అయితే ఒకసారి అలా చేసి చూడండి. ఏమి జరుగుతుందో మీకే తెలిసివస్తుంది. రిజిస్టర్ చేయించుకునేందుకు ఆన్‌లైన్ కొవిన్ యాప్‌ను ఓపెన్ చేసిన కొద్ది క్షణాలకే అది క్లోజ్ అవుతుంది. ఎంతకూ మళ్ళీ ఓపెన్ కావడం లేదు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని అసంఖ్యాక ప్రజలు వేచిఉండి ఓపెన్ కాగానే క్లిక్ చేస్తున్నారు. ఫలితంగా కొద్ది సెకన్లలోనే మీరు నిర్దేశించిన కోటా పూర్తవుతుంది. దాంతో మరెంతోమంది తమ పేరు రిజిస్టర్ చేయించుకోలేకపోతున్నారు.


కొవిడ్ సంక్షోభ వేళ అనవసరమైనప్పటికీ ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత ఒక మంత్రిని తొలగించారు. అదీ ఆరోగ్యశాఖ మంత్రిని! ఈ విపత్తు యుద్ధ కాలపు పరిస్థితులను సృష్టించింది. అయితే ఒక యుద్ధంలో వలే మీరు ఆ పరిస్థితులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారా? మునిసిపల్ ఎన్నికలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారు. ఎన్నికైన కార్పొరేటర్లు కొవిడ్ బాధితులను ఆదుకుంటున్నారా? బాధితులు కానివారికి సంపూర్ణ భద్రత కల్పించేందుకు శ్రద్ధ వహిస్తున్నారా? ప్రభుత్వాసుపత్రులలో కొవిడ్ రోగులకు చాలా పడకలు అందుబాటులో ఉన్నాయని మీరు ప్రకటించారు. మరి పలు హోటళ్ళను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చివేసేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారు? సంపన్నుల కోసమే కాదూ? మరి పేదల విషయమేమిటి? వారు ఎక్కడకు వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు? 


కొవిడ్ రెండో ధఫా విజృంభణను అదుపు చేసేందుకు, మనలను మరింత విషమంగా ప్రభావితం చేయనున్న మూడో, నాలుగో దఫా విజృంభణను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నదీ మీరు వివరించనేలేదు. అటువంటి విపత్తులు, అవాంతరాలను ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధమవ్వడం మీ బాధ్యత కాదా? కొవిడ్ మొదటి దశలో, ఆస్పత్రుల్లో పడకల కొరత గురించి వివరణ ఇస్తూ మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడిన కారణంగానే ఆ సమస్య ఏర్పడిందని మీరు సహేతుకంగా పేర్కొన్నారు. అయితే రెండో దఫా విజృంభణలో సైతం పడకల కొరత ఎందుకు అంత తీవ్రంగా ఉంది? తొలి దశ మొదలైన సంవత్సరం అనంతరం కదా రెండో దఫా విజృంభణ ప్రారంభమయింది? మరి ఇప్పుడు కూడా పడకల కొరత తీవ్రంగా ఉండడానికి కారణమేమిటి?


పత్రికాగోష్ఠిలో మీరు మాస్క్ ఎందుకు ధరించలేదు? మీ పక్కన కూర్చున్న వారందరూ మాస్క్‌లు ధరించారు. మహమ్మారిని అదుపు చేసేందుకు అత్యంత ప్రభావశీల చర్యను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకారదర్శిగా మీరే పాటించకపోవడం ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? విలేఖర్ల సమావేశంలో మీరు మీ జూనియర్లను మాస్క్‌లు తొలగించాలని ఆదేశించడం గర్హనీయం. దీనికితోడు మీరు చేతులు అడ్డం పెట్టుకుని దగ్గారు. ముక్కును రద్దుకున్నారు. వైరస్ వ్యాప్తికి దోహదం చేసే ఇటువంటి పనులు మీరు చేయవచ్చునా? పత్రికాగోష్ఠిలో మీరు బిస్కట్లు తినడం కూడా ఏమాత్రం హర్షణీయం కాదు. రాష్ట్రంలో అత్యంత ముఖ్య అధికారి ఇలా వ్యవహరిస్తే, కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా సంసిద్ధం చేస్తున్నారో ఇక చెప్పవలసిన అవసరమున్నదా?

డాక్టర్ పి. వినయ్ కుమార్

చైర్మన్, సామాజిక అధికార వేదిక

[email protected]

Advertisement
Advertisement
Advertisement