ఆయిల్ పామ్‌కు ఈ నేల అనుకూలమేనా?

ABN , First Publish Date - 2021-08-03T06:27:38+05:30 IST

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సంవత్సరం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా...

ఆయిల్ పామ్‌కు ఈ నేల అనుకూలమేనా?

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సంవత్సరం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరచాలని ప్రభుత్వం సంకల్పించింది. 


అయితే వ్యవసాయం గురించి వాస్తవిక అవగాహన ఉన్న వారికి కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. అవి: తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన రాష్ట్రమేనా? ఆయిల్ పామ్ సాగుకు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండాలి? అలాంటి వాతావరణం మన రాష్ట్రంలో ఉందా? రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాలీ హౌస్ వ్యవసాయం ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నం లాగే ఇది కూడా సబ్సిడీల కోసం మాత్రమే పరోక్ష భూ యాజమానులు చేపట్టే పథకంగా మిగిలిపోతుందా?


మరో ముఖ్యమైన విషయమేమిటంటే దేశం మొత్తం మీద ఆయిల్ పామ్ విస్తీర్ణం గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మాత్రమే ఫైనల్ చేస్తుంది. 2020 జూన్ 12న కేంద్ర వ్యవసాయ శాఖ ఆయిల్ సీడ్స్ డివిజన్ ద్వారా తెలంగాణలో అనుమతి పొందిన ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం 3,29,665 హెక్టార్లు (8,14,269 ఎకరాలు) మాత్రమే. మరి వచ్చే సంవత్సరంలో 20 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ విస్తీర్ణం గురించి రాష్ట్ర క్యాబినెట్‌లో ఎలా నిర్ణయించారో మనకు అర్థం కాదు. మన దేశంలో వంట నూనెల కొరత ఉన్న మాట నిజమే. అయితే దేశంలో పండే వేరుశనగ, నువ్వులు, కుసుమలు, ఆవాలు, కొబ్బరి లాంటి వివిధ రకాల నూనె పంటల దిగుబడులు ఇతోధికంగా పెంచుకోవడం ద్వారా వంట నూనెల కొరతను అధిగమించవచ్చు. ఇందుకు అనుగుణంగా రైతులకు ప్రోత్సాహకాలు, న్యాయమైన గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. ఇది చేయగలిగితే మనకు అవసరమైన నూనె గింజలను మన రైతులే ఉత్పత్తి చేసి ఇవ్వగలుగుతారు. దేశం నూనెగింజల రంగంలో స్వయం సమృద్ధిని సాధించగలుగుతుంది. ఇతర దేశాల నుంచి చౌకగా వస్తున్న పామాయిల్ కోసం వినియోగ దారులు పరుగులు పెడుతున్నారు. బయట ఆహార పరిశ్రమ కూడా దానిపైనే ఆధారపడి నడుస్తున్నది. దీనివల్ల మిగిలిన నూనె గింజలలో సహజంగా ఉండే పోషక విలువలు ప్రజలకు అందడం లేదు. ఒక్క పామాయిల్‌ను మాత్రమే సంవత్సరాలపాటు వినియోగించడంవల్ల తప్పకుండా ఆరోగ్య సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి. నిజానికి మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల నూనె గింజలను ప్రోత్సహిస్తే రైతులకు ఆదాయం, వినియోగదారులకు ఆరోగ్యం. ఈ పని వదిలి పెట్టి, పామాయిల్ తోటలను లక్షల ఎకరాలలో ప్రోత్సహించాలని అనుకోవడం ప్రభుత్వ దూర దృష్టి లేమికి నిదర్శనం. 


ఆయిల్ పామ్ సాగుకు కనీసం ఒక మీటరు లోతు ఉండే నేలలు అవసరం. సెలైన్, ఆల్కలైన్ ఎక్కువగా ఉండే భూములు, తీర ప్రాంత ఇసుక భూములు, నీరు నిల్వ ఉండే భూములు ఆయిల్ పామ్ సాగుకు పనికి రావు. భూమిలో సేంద్రీయ పదార్థం బాగా ఉండాలి. మురుగు నీరు బయటకు పోయే ఏర్పాటు ఉండాలి.


తెలంగాణలో బోర్లు, బావుల క్రింద చేసే వ్యవసాయమే ఎక్కువ. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల, నీటి వినియోగం పెరిగి ప్రతి సంవత్సరం భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. భారీ వర్షాలు పడిన సంవత్సరాలలో ఏదో ఒక మేరకు బోర్లు మళ్ళీ రీఛార్జ్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాలలో మాత్రం రబీ చివరిలో భూగర్భజలాలు లేక బోర్లు, బావులు ఎండిపోవడం చూస్తున్నాం. ఆయిల్ పామ్‌కు నీళ్ళు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండాలి. పైగా కనీసం 3-4 అంగుళాల నీళ్ళు అందించగలిగేలా బోర్ల సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో మెజారిటీ బోర్లు 2 నుంచి 2.5 అంగుళాల నీళ్ళు మాత్రమే అందిస్తున్నాయి. 


ఆయిల్ పామ్ సాగుకు గాలిలో తేమ శాతం 85-90 శాతం ఉండాలి. భారీ వర్షాలు కురిసే అటవీ ప్రాంతాలలో తేమ (హ్యూమిడిటీ) కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే అటువంటి ప్రాంతాలలోనే ఇప్పటి వరకూ ఆయిల్ పామ్ సాగవుతూ వచ్చింది. మరి తెలంగాణ లో హ్యూమిడిటీ సగటు జూన్–సెప్టెంబర్ మధ్య 82శాతం, అక్టోబర్–నవంబర్ మధ్య 88శాతం, డిసెంబర్–ఫిబ్రవరి మధ్య 82 శాతం, మార్చ్-–మే మధ్య 59శాతం ఉంటుంది. మొత్తంగా సంవత్సరం సగటు 62శాతం మాత్రమే. ఆయిల్ పామ్ పంటకు నీరు అత్యధికంగా కావాల్సి ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోజుకు మొక్కకు కనీసం 300–350 లీటర్ల నీరు అవసరం. వర్షాకాలం కాకుండా మిగిలిన 8 నెలలు నీరు తప్పకుండా బయట నుండి అందించాల్సి ఉంటుంది. తెలంగాణలో నెలల వారీగా సగటు వర్షపు రోజులు జూన్లో 6-12 రోజులు, జూలైలో 9-19 రోజులు, ఆగస్టులో 9-18 రోజులు, సెప్టెంబర్‌లో 6-11 రోజులు, అక్టోబర్‌లో 7 రోజులు కాగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ చలి కాలంలో సగటు వర్షపు రోజులు 1 మాత్రమే. అదే మార్చ్ నుంచి మే మధ్య సగటు వర్షపు రోజులు మొత్తంగా 5 మాత్రమే. అంటే మొత్తంగా వర్షపు రోజులు తగ్గిపోతున్నాయి. సంవత్సరంలో సగటు వర్షపు రోజులు 61 కాగా, వర్షం లేని రోజులు సగటున 258 రోజులు. ప్రతి సంవత్సరం ఒకే రకంగా వర్షపాతం ఉండడం లేదు. పైగా డ్రై స్పెల్స్ ఉంటున్నాయి. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, వర్షాభావ పరిస్థితులు అతి తరుచుగా వస్తున్నాయి. 


ఆయిల్ పామ్ సాగుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 20 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉండాలి. సంవత్సరం పొడవునా 24 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 34.1 శాతం. ఈ సగటు కంటే 16 జిల్లాలలో సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటున్నాయి. 2015–2020 మధ్య చాలా సంవత్సరాలలో సగటు ఉష్ణోగ్రతలు వేసవిలో పగటి పూట 48 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకున్న సందర్భాలు ఉన్నాయి.


రాష్ట్ర ఉద్యాన శాఖ ఇప్పటికే ఉద్యాన రంగంలో ఉన్న సమస్యలను పట్టించుకోవడం మానేసింది. 2020లో కూరగాయల సాగు లక్ష ఎకరాల కంటే తక్కువకు పడిపోయి, కూరగాయలు బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బత్తాయి మామిడి, నిమ్మ ఇతర పండ్ల తోటల ,రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆలుగడ్డ, అల్లం, ఉల్లిగడ్డ పండించే రైతులు సరైన శీతల గిడ్డంగులు లేక నష్ట పోతున్నారు. ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యలను పరిష్కరించే పని మానేసి, ఆయిల్ పామ్ విస్తరణ కోసం పరుగులు పెట్టడం ఎందుకు? ఆయిల్ కంపెనీల ప్రయోజనాలు కోసమే కాదూ? సబ్సిడీ నిధులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పటికే కూరగాయల పందిరిలు, డ్రిప్ పెట్టుకున్న అనేకమందికి గత రెండేళ్లుగా సబ్సిడీ మొత్తాలు అందించడానికి చేతులు రాని ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆయిల్ పామ్ రైతులకు దక్కే సబ్సిడీల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు! 


అధికారులు, కంపెనీల ప్రతినిధులు చెప్పిన మాటలతో, కొంతమంది రైతులు కొన్ని భ్రమలతో, సబ్సిడీ ఎలాగూ ఉంది కదా అని మొదట్లో పంట సాగు చెయ్యడానికి ముందుకు రావచ్చు కానీ, అది కూడా సుస్థిరంగా ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే. సాగుకు దిగే ముందే అన్ని విషయాలను, ఉండే రిస్క్‌ను కూడా రైతులకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేవలం ఆ బాధ్యతను ప్రాసెసింగ్ కంపెనీల పైనే వదిలేయకూడదు. కొన్ని రాష్ట్రాలలో తమకు గిట్టుబాటు కాక, కంపెనీలు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం వల్ల ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయారని తెలుస్తోంది.


వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు నిర్వహించాలి. పంటల ప్రణాళికలలో మార్పులను సూచించాలి. ప్రభుత్వానికి ధైర్యంగా చెప్పాలి. ప్రభుత్వం వినకపోతే ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వానికి చెప్పడానికి భయపడితే, మనకెందుకులే అని నిర్లిప్తంగా ఊరుకుంటే, నష్ట పోయేది రాష్ట్రమూ, గ్రామీణ ప్రజలే. 


రైతులు కూడా ఆయిల్ పామ్ లాంటి పంటల సాగు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి ఆ పంట సాగు లోకి దిగకూడదు. పెట్టుబడి ఒక్కటే సరి పోదు. వాతావరణం కూడా ఈ పంటకు సహకరించాలి. సాగు నీరు, ముఖ్యంగా బోర్లు బాగా నిలకడగా పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పామాయిల్ ప్రాసెసింగ్ కంపెనీలు చెప్పే మాటలను తరచి చూసుకోవాలి. లాభ నష్టాలను బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. 

కన్నెగంటి రవి,

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2021-08-03T06:27:38+05:30 IST