ఈ స్థాయి సంకుచితత్వం అవసరమా!

ABN , First Publish Date - 2020-09-07T06:25:43+05:30 IST

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణగా వచ్చిన ‘తెలంగాణలో భావ కవిత్వవికాసం’ గ్రంథంపై ‘‘వృథా పరిశోధన’’ పేరుతో ఆంధ్రజ్యోతి వివిధ సాహిత్య వేదిక (17 ఆగస్టు 2020)లో సంగిశెట్టి చేసిన...

ఈ స్థాయి సంకుచితత్వం అవసరమా!

ఎన్ని లోపాలున్నా ఏ పరిశోధనా వృథా కాదు. ‘‘తప్పుల తడక’’తో నిండిన ఈ పుస్తకాన్ని ప్రభుత్వం అమ్మకాలనుంచి ఉపసంహరించుకోవాలి అని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉన్నది. తమ నమ్మకాలకు భిన్నంగా ఉండే పుస్తకాలను తొలుత పంపిణీ నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయడం మతవాదులకు, నియంతలకు పరిపాటి. ఇది ఫాసిజానికి సంబంధించిన ఆలోచన. 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణగా వచ్చిన ‘తెలంగాణలో భావ కవిత్వవికాసం’ గ్రంథంపై ‘‘వృథా పరిశోధన’’ పేరుతో ఆంధ్రజ్యోతి వివిధ సాహిత్య వేదిక (17 ఆగస్టు 2020)లో సంగిశెట్టి చేసిన రచన నా దృష్టికి వచ్చింది. వాస్తవానికి ఎన్ని లోపాలున్నా ఏ పరి శోధనా వృథా కాదు. ‘‘తప్పుల తడక’’తో నిండిన ఈ పుస్త కాన్ని ప్రభుత్వం అమ్మకాలనుంచి ఉపసంహరించుకోవాలి అని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉన్నది. తమ నమ్మ కాలకు భిన్నంగా ఉండే పుస్తకాలను తొలుత పంపిణీ నుంచి ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ మతవాదులకు, నియం తలకు పరిపాటి. ఇది ఫాసిజానికి సంబంధించిన ఆలోచన. 


నిజానికి ఇంతటి భారీ స్థాయిలో ‘తెలంగాణ సాహిత్య వికాసం’ గ్రంథాన్ని తీయడానికి సంగిశెట్టి పరోక్షంగా కార కుడు. తెలుగు అకాడమి ‘ఆధునిక తెలంగాణ సాహిత్య చరిత్ర’ అన్న పేరుతో అనేక వక్రీకరణలతో పుస్తకం అచ్చేసింది. దీని సంపాదకవర్గంలో సంగిశెట్టి సభ్యుడు. సహరచయిత కూడ. ఇందులో తెలంగాణలో ‘‘భావకవిత్వం రాలేదు’’ అని వక్రీకరించారు. వక్రీకరణలకు దిగినవారిలో సంగిశెట్టి భాగస్వామి. కనుక మొదట ఈయన తెలంగాణ సమాజానికి, పాఠకులకు క్షమాపణలు చెప్పాలి. వాస్తవానికి ఈ తరహా పోకడలను అడ్డుకోనీకే ఈ పుస్తకం తెచ్చాను. అదే సంగిశెట్టికి కంటగింపుగా మారింది. 


‘‘తెలంగాణవాదిగా అసత్యాలు, అసంబద్ధ విషయాలు పాఠకుల దృష్టికి తీసుకరావడం నా భాధ్యతగా భావిస్తు న్నాను’’ అని అంటున్నాడు. సంగిశెట్టి సంకలనాలు పరిశోధన కిందికి రావన్నది తెలుసుకోవాలి. పరిశోధన పేరుతో సంగి శెట్టి అచ్చేసిన పుస్తకాలలో అసత్య, అసంబద్ధ విషయాలు లేకుండా ఒకటి కూడ లేదు. ఒక రచయితతో కలిసి సంగిశెట్టి ఆళ్వారు స్వామిపై ‘సార్థక జీవనం’ పేరుతో ఒక పుస్తకం అచ్చేశాడు. అందులో చివరిదశలో ఆళ్వారు స్వామి సీపిఐని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగ తిని దాచి తెలంగాణ సమాజాన్ని దగా చేసేందుకు సంగిశెట్టి ఒడిగట్టాడు. ‘‘వెట్టి మాదిగ’’ అన్న కథను భాగ్య రెడ్డి వర్మ రాసినట్టు ఈయన కథల సంకలనాల్లో చెలామణి చేస్తున్నాడు. భాగ్యరెడ్డివర్మ రచనల మీద ఒక పుస్తకం వచ్చింది. ఆ రచయిత కూడ దీనిని తేల్చలేదు. వర్మ రాసినట్టు ఆధారాలు చూపిస్తే నేను క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. విషయ సూచిక లేదన్న ప్రశ్న మంచిదే. అది లేకుండా పుస్తకాలు అచ్చేసే పద్ధతి తెలుగుసహా ఇంగ్లీషులో కూడ ఉన్నది. పాత మూసను మార్చి కవితలను కావాలనే రాండమ్‌గా కూర్చాను. కాలవ్యవధి లేక కొన్ని పరి మితులు ఏర్పడ్డాయి. 


బూర్గుల రంగనాథరావు, బూర్గుల రామకిషన్‌రావు రచనలపై ఒక ప్రచురణ సంస్థ వేసిన పుస్తకాలను చూసి నేను నా పుస్తకంలో వారి కవితలను చేర్చినట్టు చెబు తున్నాడు. నిజానికి ఇది తప్పిదమేమీ కాదు. బూర్గుల రామకిషన్‌రావు కవితా సంపుటాలలో ‘ఉమర్‌ఖయాం రుబాయిలు’ (మూడు భాషలలో వెలువడిన సంపుటి), ‘నివేదన’, ‘తొలిచుక్క’.. ఇరవై అయిదేళ్ళ క్రితం నాకు లభ్యమయ్యాయి. రెండు కవితలను మినహాయిస్తే పూర్తి స్థాయిలో ‘నివేదన’ భావకవితా సంపుటి. తెలంగాణలో భావకవిత్వం వచ్చిందన్నదానికి నాకు ప్రేరణ ఈ సంపుటే. బూర్గుల రంగనాథరావు ‘అభియానం’ కూడ ఆ కాలంలోనే నాకు ఫుట్‌పాత్‌మీద లభ్యమైంది. దాన్నుంచి కొన్ని కవిత లను, నేను కొత్తగా అనేకం సేకరించినవి నా పుస్తకంలో చేర్చాను. ఆ సంస్థ వేసిన పుస్తకాలలో కూడ ఇవి లేవు. వాటిని తిరిగేసి మోక దొరికిందని నిందలు వేస్తున్నాడు. ‘‘కవితా సంకలనమంటే వారి ప్రతిభకు అద్దంపట్టే ఒకటి రెండు కవితలు ఉంటాయి కానీ ఒక్కొక్కరివి 25 కవిత లంటే ఆశ్చర్యంగా ఉన్నది’’ అంటూ ఆక్షేపిస్తున్నాడు. తెలంగాణ కేంద్రంగా వచ్చిన భావ కవిత్వానికి చిరస్థాయి నివ్వాలని- దాని వైవిధ్యాన్ని, విశిష్టతను తెలిపేందుకు, సంగిశెట్టి వంటివారికి కనువిప్పు కలిగించేందుకు చాలా కవితలను చేర్చడమైంది.


సంపాదకునిగా నాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. అది నా ఇష్టం. దీనిపై ఆక్షేపణ ఏమిటో? మొత్తం 536 కవితలున్న ఈ పుస్తకంలో మహాకవి సురభి బుక్కపట్నం నరసింహాచార్యులవారి కవిత ఒకటి రిపీట య్యింది సత్యమే. సురభి కావ్యంపై సురవరం సమీక్ష రాశారు. సురవరం పరిశోధకుడు ఇందుర్తి ప్రభాకర్‌రావు ఈ సమీక్ష గురించి చెప్పి తెలంగాణ కవిగానే భావించారు. ఈ కవి స్థానికుడే అని చెప్పడానికి నేను పాలమూరు లోని సురభి గ్రామం పేరున్నది అని రాశాను. సంగిశెట్టి కూడ ఇదే దించేశాడు. నిజానికి సురభి అనేది రఘపతి పేట అనే గ్రామానికి మరో పేరు. ఈ విషయం ఈయనకు తెలిసినట్టులేదు. ఈ కవికి జటప్రోలు రాజావారు ధన సహాయం చేశారని సంగిశెట్టి చూసినట్టు వక్రీకరించాడు. దీనికి ఆధారాలులేవు. ఈ కావ్యాన్ని ఆ రాజాకు అంకితం ఇచ్చింది సురభి పుస్తకంలోనే ఉన్నది. బుక్కపట్నం వారి వంశవృక్షాన్ని చూసినట్టు రాశాడు. ఇది పూర్తిగా అబద్ధం. నరసింహాచార్యులవారు ఆంధ్రకు చెందిన కవి అయితే అక్కడ భావకవిత్వంపై జరిగిన పరిశోధనలో ఏనాడో తేలిపోయేది. తెలంగాణవారైనందునే మరుగయ్యాడు. బుక్కపట్నం వారిలో వారు స్థిరపడ్డ ఊర్ల పేర్లను ఇంటి పేరుగా స్వీకరించిన వారు ఉన్నారు. వైద్యం వెంకటేశ్వర్లు అభిప్రాయం నాకు ప్రామాణికం కాదు. ‘‘ఆంధ్రవాదుల కవితలు యథేచ్ఛగా సంకలితమయ్యాయి’’ అన్న ఆరోపణకు దిగి కొన్ని పేర్లు యిచ్చాడు. వారిని చేర్చిన సంగతి, ఎంత మందివి చేర్చానన్న సంగతి ముందుమాటలోనే చెప్పాను.


ఉస్మానియా తెలుగు శాఖను గొప్ప పరిశోధక కేంద్రంగా రాయప్రోలు సుబ్బారావు తీర్చిదిద్దాడు. ఆ శాఖలో ఒకనాడు పరిశోధక విద్యార్థినైన నేను రాయప్రోలు కవితను వేస్తే తప్పేమిటి? ఊటుకూరు సత్వనారాయణ, సన్నిధానం సూర్య నారాయణ, ఇంద్రగంటి నాగేశ్వరశర్మ ఖమ్మం జిల్లావాసు లన్నది నాకు రూఢీగా తెలుసు. ఈయనకు తెలియనంతమాత్రాన అవి అసత్యాలయితాయా? భారతీరత్నాకరాంబ ప్రఖ్యాత రచయిత ఖండ వల్లి లక్ష్మీరంజనం సోదరి. వీరి కుటుంబం ఏనాడో తెలంగాణలో స్థిరపడ్డది. ఆదిపూడి సోమనాథరావు, ఆదిపూడి ప్రభాకరమాత్య ఇద్దరు సోదరులు. గద్వాలలో జన్మించినవారు. ఈ రచయితలంతా గత శతాబ్ది తొలిమలి దశకాల్లో తెలంగాణ వికాస ఉద్య మంలో పెద్దఎత్తున పాల్గొ న్నారు. వారిని గౌరవిం చడం నా తప్పా. ఈ స్థాయి సంకుచితత్వం అవసరమా! వీరిని, పీసుపాటిరమణయ్యను తెలంగాణవారిగానే భావిస్తున్నాను. 


నిజానికి ఆంధ్ర రచయితలను తెలంగాణ ఖాతాలో చేర్చడం మొదలు పెట్టింది సంగిశెట్టియే. అందుకు సాక్ష్యం ఒక పెద్దాయన పురమాయింపు మేరకు సంకలనం చేసిన వాసుదేవరావు కథలు, తాడి నాగమ్మ కథల సంపుటి. వీరు పూర్తిగా కోస్తాంధ్రకు చెందిన రచయితలు. అదేవిధంగా ‘బండారు అచ్చమాంబ’ కథల సంపుటి. అచ్చమాంబను పూర్తిగా తెలంగాణ రచయితగా చెప్పలేం. గ్రాంథిక బాషలో కథలు రాసిన ఈమె గురజాడకు పోటీ అనేందుకు దిగజారాడు. గిడుగు వ్యవహారిక భాషా ఉద్యమం పట్ల, ఆధునిక భావ వీచికలకు గురజాడ ఆద్యుడన్న సంగతిపైన ఏమాత్రం గౌరవం లేని ఈయన నిర్వాహకమది. ఈయన సహ సంపాదకునిగా వెలువడిన ‘మలితరం తెలంగాణ కథ’ అన్న గ్రంథంలో రాయలసీమకు చెందిన చిత్తూరు మాజీ ఎంపీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రాటకొండ నర సింహారెడ్డి, సిరిగూరి జయరావు కథలను చేర్చాడు.


నౌడూరి బంగారయ్యను కావాలనే చౌడూరిగా మార్చినట్టు విమర్శ చేశాడు. మొత్తం మూడు కవితలలో మొదటి కవిత నౌడూరిగానే ముద్రితమయ్యింది. మిగిలిన రెండు కవితలు చౌడూరిగా అచ్చుతప్పు పడింది. సంగిశెట్టి భావిస్తున్నట్టు చేస్తే మొత్తం మూడు కవితలు చౌడూరిగానే వేసేవాన్ని. సుజాత పత్రిక నుంచి తీసుకున్న కవితలలో ఎక్కువ ఆంధ్ర వాళ్లవే అంటూ సురవరం ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాడు. ఇది పూర్తి అబద్ధం. ఈయన ఇచ్చిన కేటలాగులో పేర్లున్న కవులతోసహా తెలంగాణకవుల కవితలు అత్యధికం సుజాత పత్రిక నుంచి తీసుకున్నవే. మూడేళ్లు నడిచిన సుజాత సంపుటాలలో ఆంధ్ర రచయితల రచనలు 20కూడ లేవు. ‘సురవరం కవిత్వం’ పేరుతో మర్యాద పాటించలేదు అంటున్నాడు. అన్వేషి లైబ్రేరిలోని గృహలక్ష్మి పత్రిక నుంచి బండారు అచ్చమాంబ కథలు నేను, సంగిశెట్టి కలిసి సేకరించాము. ఆ సంపుటిలో నా పేరు ప్రస్తావించని తరీఖా ఈయనది. వాస్తవానికి ఈయన సంకలనం చేసిన ‘సుర వరం కవిత్వం’ పుస్తకానికైనా, నా పుస్తకానికైనా ఆధారం ఆరవ దశకాన ‘స్రవంతి’ పత్రికలో కేతవరపు రామకోటి శాస్త్రి వ్యాసం. అందులో సురవరం కవితలు ఏయే పత్రికల్లో వచ్చాయో తెలిపారు. దానిని చూసి ఆ తేదీలవారిగా కవితలను సేకరించాను. దొరకనివి ‘సురవరం కవిత్వం పుస్తకం’లో తీసుకుని ఆ మేరకు 637వ పేజీలో సంగిశెట్టి పుస్తకాన్ని ప్రస్తావించాను. ఇక్కడ శాస్త్రిగారి పేరును తలవకుండా ఈ రచనకు పూనుకోవడం సంగిశెట్టిది ఏపాటి మర్యాద? సురవరం ‘కవికుమారుడు’, ‘దీర్ఘ దర్శి’ పేరుతో రాసిన కవితలకు ఆధారాలు కావాలట. నేను ఓయూ తెలుగుశాఖలో నిజాంకాలాన తెలంగాణకథపై పిహెచ్‌డిలో చేరినందున సురవరం మారుపేర్లతో చేసిన రచనలపై ఆయన కుమారుడు ఎస్‌ఎన్‌ రెడ్డిని కలిసి ఆ పేర్లను సేకరించాను. ఈ తరహావల్ల సంగిశెట్టికి భావకవిత్వంపై ప్రాథమిక పరిజ్ఞానం కూడ లేదని తేలింది.

సామిడి జగన్‌ రెడ్డి,

85006 32551


Updated Date - 2020-09-07T06:25:43+05:30 IST