Apr 11 2021 @ 10:31AM

'దోస్తానా-2' కథ అదేనా..?

బాలీవుడ్‌లో ఒకప్పుడు ఎలాంటి జోనర్స్‌లో అయినా సినిమా చేసేసేవారు. ప్రేక్షకులు ఆ సినిమాలని బాగా ఆదరించేవారు కూడా. అందుకే బాలీవుడ్‌లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు మరే భాషలో రాలేదు. అక్కడ చేసిన ప్రయోగాలు మరే భాషలోనూ చేయలేదు. బాలీవుడ్ మార్కెట్ పెద్దది.. అక్కడ ఆడియన్స్ మెచ్యూరిటీ లెవల్స్ వేరే స్థాయిలో ఉంటాయి. కాబట్టే అన్నీ వర్గాల పేక్షకులను టార్గెట్ చేసే సినిమాలు రూపొందిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమా కథల విషయంలో కాంట్రవర్సీ బాగా అవుతోంది. దీనికితోడు నెపొటిజం కూడా ఒక కారణం అవుతోంది. సంబంధం ఉన్నా.. లేకపోయినా చేయాల్సిన రచ్చ చేస్తున్నారు. అందుకే గతంలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా కథా నేపథ్యాన్నే మార్చినట్టు చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్‌లో వచ్చిన దోస్తానా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2008లో వచ్చిన ఈ సినిమా విమర్శలకి కేంద్ర బిందువుగా నిలిచింది. ఆ సినిమాలో హీరోలుగా నటించిన జాన్ అబ్రహం అభిషేక్ బచ్చన్ ఇద్దరు స్వలింగ సంపర్కులుగా నటించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 12 ఏళ్ళు కావస్తుండగా ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా దోస్తానా 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, జాన్వీకపూర్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. కాగా దోస్తానా-2 కూడా మొదటి సినిమాలాగే లైంగికతపై స్వలింగ సంపర్కం అనే టాపిక్ వ్యంగ్యంగా టచ్ చేస్తున్నట్టు గతంలో నిర్మాత కరణ్ జోహార్ చెప్పాడు. 

కానీ ఇప్పుడు కథలో ఈ అంశాలను లేకుండా భారీ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. దోస్తానా-2లో .. కార్తీక్ ఆర్యన్, జాన్వీకపూర్ ఇద్దరూ అన్నచెల్లెలిగా నటిస్తుండగా.. వీరిద్దరూ కలిసి ఒకే అబ్బాయిని ప్రేమించడం అనేది అసలు కథ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆకథ కాకుండా వేరే కథతో దోస్తానా-2 రూపొందిస్తున్నట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమాకి కొలిన్ డి కున్హా దర్శకత్వం వహిస్తున్నాడు.