ఇదేం సర్దుబాటు?

ABN , First Publish Date - 2022-08-08T05:22:54+05:30 IST

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ.. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ పేదలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మిగులుతోంది. తాజాగా ఈ నెల 15 నుంచి 104 మొబైల్‌ వాహనంలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. పీహెచ్‌సీల్లో ఒక వైద్యుడి సర్దుబాటు చేసి.. ఈ వాహనం ద్వారా నేరుగా ఇంటివద్దే రోగులకు వైద్య

ఇదేం సర్దుబాటు?
పాతర్లపల్లి పీహెచ్‌సీ

 104 వాహనాల్లో ప్రభుత్వ వైద్యుడు

 ఫ్యామిలీ డాక్టర్‌గా నామకరణం

 పీహెచ్‌సీ నుంచి బదలాయిస్తూ ఉత్తర్వులు

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటాడుతున్న వైద్యుల కొరత 

 రోగులకు అరకొరగానే సేవలు

 ప్రభుత్వం తీరుపై విమర్శలు 

(రణస్థలం)

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ.. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ పేదలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మిగులుతోంది. తాజాగా ఈ నెల 15 నుంచి 104 మొబైల్‌ వాహనంలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. పీహెచ్‌సీల్లో ఒక వైద్యుడి సర్దుబాటు చేసి.. ఈ వాహనం ద్వారా నేరుగా ఇంటివద్దే రోగులకు వైద్యసేవలు అందజేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కాగా.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీహెచ్‌సీలను నిర్వీర్యం చేసేలా ఈ జీవో ఉందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పీహెచ్‌సీలను వైద్యుల కొరత వెంటాడుతోంది. కొన్ని పీహెచ్‌సీలు డిప్యూటేషన్లపై నడుస్తున్నాయి. ఈ సమయంలో కొత్తగా డాక్టర్లును నియమించాల్సింది పోయి.. ఉన్న డాక్టర్లను 104వాహనంలో సర్దుబాటు చేయడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ తీరుపై వైద్య వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

గత ప్రభుత్వాల్లో మంచి సేవలు

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 104 వాహన సేవలు ప్రారంభమయ్యాయి. మెరుగైన సేవలు అందేవి. తర్వాత టీడీపీ హయాంలో ‘చంద్రన్న సంచార వైద్యం’ పేరిట ఈ పథకం కొనసాగింది. మండలంలో రోజుకో పంచాయతీ చొప్పున ఎంపిక చేసి.. మొబైల్‌ వాహనంలో వైద్యసేవలందించేవారు. వాహనంలో ఒక డాక్టర్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, నర్సు, అటెండర్‌ సేవలందించేవారు. వీరంతా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేసేవారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు నెలకు సరిపడా మందులు అందించేవారు. ఆస్పత్రులకు వెళ్లలేని వృద్ధులు, మహిళలకు 104 వాహనాలు ఎంతగానో ఉపయోగపడేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 104 వాహనాల సేవలు గగనమయ్యాయి. సిబ్బంది పరిస్థితి కూడా తారుమారైంది. వారందర్నీ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన తొలగించి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కింద ప్రైవేటు సంస్థకు కేటాయించారు. వీరికి సక్రమంగా వేతనాలు అందలేదు. ఉద్యోగ భద్రత కరువైంది. దీంతో చాలామంది వైద్యులు, సిబ్బంది ఉద్యోగాలను విడిచిపెట్టారు. ఎక్కడికక్కడే 104 వాహనాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వాటి భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. అటు 104 బాధ్యతలు తీసుకున్న సంస్థ కూడా వైద్యులపై పనిభారం మోపుతోంది. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న బంధువులకు 104 ఏజెన్సీని అప్పగించడంతో వారి ఇష్టారాజ్యమైపోతోందని ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు అందించి.. సంబంధిత ఏజెన్సీకి మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎత్తుగడకు అదే కారణం..

104 వాహనాల్లో ఖాళీల భర్తీ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంతో పనిచేసేందుకు వైద్యులెవరూ ముందుకు రావడం లేదు. దీంతో  పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులనే వాహనాల్లో సర్దుబాటు చేస్తున్నారు. సాధారణంగా పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యుల చొప్పున ఉంటారు. అందులో ఒకర్ని 104 వాహనాలకు బదలాయిస్తూ ఇటీవల జీవో జారీచేశారు. జిల్లాలో 68 పీహెచ్‌సీలుండగా.. వాటిలో 120 మందికిపైగా డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో పీహెచ్‌సీకి ఒకరు చొప్పున 60మందిని 104 వాహనాల్లో బదలాయించారు. దీనిపై వైద్యులు భగ్గుమంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నారు. సాధారణంగా పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులుంటే ఒకరు పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉంటారు. మిగతా ఒక డాక్టర్‌ వైద్య పరీక్షలు అందిస్తుంటారు. అందుకే మరో డాక్టరును నియమించాలన్న ప్రతిపాదన వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉంది. కానీ అమలుకు నోచుకోవడం లేదు. ఇటువంటి సమయంలో ఉన్న ఇద్దరు డాక్టర్లలో ఒకర్ని ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పేరిట మొబైల్‌ వాహన సేవలకు బదలాయిస్తే పీహెచ్‌సీల్లో వైద్యసేవల మాటేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది భర్తీకి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

 చాలా అన్యాయం

ఇప్పటివరకూ 104 వాహనాలు మెరుగైన సేవలందించేవి. కానీ దానిని నీరుగార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణం. కాంట్రాక్ట్‌ సిబ్బందిని ఏజెన్సీ కిందకు తేవడం వారికి అన్యాయం చేయడమే. ఎప్పటికైనా పర్మినెంట్‌ అవుతుందన్న భావనతో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం పొమ్మన లేక పొగ పెట్టింది. పీహెచ్‌సీలను విడిచి  ఇంటింటికి వెళ్లి వైద్యం చేయమంటున్నారు. ఇది జరిగే పనికాదు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం.  ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి.

డాక్టర్‌ వి.కిషోర్‌, ప్రభుత్వ  ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు 


 నిర్ణయం సరికాదు

పీహెచ్‌సీల్లో అరకొరగా వైద్యసేవలందుతున్నాయి. వైద్యులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వైద్యులను నియమించాల్సింది పోయి ఉన్న ఇద్దరిలో ఒకర్ని 104 వాహనాల్లో సర్దుబాటు చేయడం ఏమిటి. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. తక్షణం ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఉద్యమం చేపడతాం. 

- నడుకుదిటి ఈశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

ఉత్తర్వులు వచ్చాయి.

104 వాహనాల నిర్వహణను ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ అందుబాటులో రానున్నారు. పీహెచ్‌సీల పరిధిలో ఒక డాక్టర్‌ను పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు సంబంధించి ఉత్వర్వులిచ్చింది. 

- బి.మీనాక్షి, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం



Updated Date - 2022-08-08T05:22:54+05:30 IST