Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘సూక్ష్మ’ దృష్టి ఇదేనా?

వరి వద్దంటూ ప్రభుత్వ సూచన

ఇతర పంటలు సాగుకు కష్టం

దిక్కుతోచని స్థితిలో రైతులు


‘తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేయండి.. రబీలో బోరు బావుల పరిధిలో వరి పంటను వేయవద్దు. ఏ పంటలు వేయాలో వ్యవసాయ శాఖ ద్వారా సూచిస్తాం..’ ఇదీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో చేసిన ప్రకటన. సూక్ష్మ సేద్య విధానాలు అనుసరించాలని చెబుతున్న మంత్రి... వాటిపై ఇస్తున్న రాయితీల సంగతిని ప్రస్తావించలేదు. అసలు రాయితీలే లేవని, పూర్తిగా ఎత్తి వేశారని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర పంటలు వేయడం అన్నదాతలకు తలకు మించిన భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

రబీలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెబుతోంది. ఇతర పంటలపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. కానీ ఆ దిశగా ప్రోత్సాహం అందించడంలో విఫలమవుతోంది. దీంతో ఏవి సాగుచేయాలో తెలియక రైతులు అయోమయంలో పడుతున్నారు. సూక్ష్మ సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఒక్క అడుగూ వేసిన దాఖలాలు లేవు. దీనికి అందించే రాయితీలకు ప్రభుత్వం 2019 నుంచి నేటి వరకు ఒక్క పైసా విదల్చలేదు. దీంతో బిందు, తుంపర సేద్య విధానాలు పూర్తిగా పడకేశాయి. సన్న, చిన్నకారు రైతులది సూక్ష్మ వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయలేని పరిస్థితి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం రాయితీపై సూక్ష్మ వ్యవసాయ పరికరాలు అందేవి. వైసీపీ ప్రభుత్వం ఈ పరికరాలకు రాయితీలు నిలిపేసింది. దీనికి తోడు గత ప్రభుత్వ పాలనా సమయంలో అందించిన పరికరాలకు సంబంధిత కంపెనీలకు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తే గానీ కొత్తగా సూక్ష్మ వ్యవసాయ పరికరాలు ఇవ్వలేమని కంపెనీలు చేతులెత్తేశాయి. ఆ తర్వాత ప్రభుత్వం నామ్‌కే వాస్తేగా టెండర్లు పిలిచింది. కంపెనీలు ముందుకు రావడం లేదని రైతులను తప్పుదోవ పట్టిస్తోంది. రైతు భరోసా పేరుతో రైతులకు నేరుగా డబ్బులు చెల్లిస్తూ... దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే విధానానికి తిలోదకాల్చింది. వ్యవసాయ పంటలను పుష్కలంగా పండించుకునే పథకాలను నీరుగార్చింది. 

సాధ్యమేనా?

వరి కంటే తక్కువ నీటి ఆవశ్యకత ఉన్న లాభదాయక పంటలు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు  సూచిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేయాలంటే పండ్ల తోటలే ఆధారం. లేదా ఆరుతడి పంటలు వేయాలి. అరటి, జీడిమామిడి, మామిడి, పామాయిల్‌ వంటి పంటలను వేసుకోవాలి. ఉద్యాన పంటలు వేయాలంటే ఖచ్చితంగా బిందు సేద్యం అవసరం.  ఆ పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందించడం లేదు. ఓ వైపు రాయితీలు ఎత్తేసి ...మరోవైపు లాభదాయక పంటలు వేయాలని సూచిస్తోంది. ఎలా సాధ్యం అన్నదానికి ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. వచ్చే రబీలో బోరుబావుల పరిధిలో వరి వేయని పక్షంలో మొక్కజొన్న, వేరుశనగ, అరటి, చెరకు, మినుములు, పెసలు, కందులు, ఉలవలు, కొమ్ముశనగలు, నువ్వులు ఇలా ఏ ఆరుతడి పంట వేయాలన్నా ప్రభుత్వం రాయతీలు అందించాల్సిన అవసరం ఉంది. విత్తన రాయితీలతో పాటు సూక్ష్మ వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలపై రాయితీలు అందించాల్సి ఉంది. ఆ వైపుగా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే మంత్రి ప్రకటనలకు అర్థం ఉంటుంది. 

 రైతులు వ్యవసాయ కూలీల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించాలంటే ఖచ్చితంగా సాగు యంత్రాలు అవసరం. వాస్తవంగా చూస్తే రాయితీలు ఎత్తేసి పథకాన్ని నీరుగార్చారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు స్ర్పేయర్లు, వీడర్లు, డ్రమ్‌ సీడర్లు, దుక్కి దున్నే పరికరాలు, విత్తనాలు వేసుకునే పరికరాలు, నీటి తడిని అందించే ఇంజిన్లు, ట్రాక్టర్లు ఇలా అనేక రకాల పరికరాలు అందించేవారు. ఆసక్తి, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు 50శాతం రాయితీ లేదా గరిష్ట రాయితీ విధానంలో పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది. 

 ఈ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క పైసాకూడా వ్యవసాయ యాంత్రీకరణకు అందివ్వలేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా యాంత్రీకరణ హబ్‌లు, హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించి నేటికీ ఏర్పాటు చేయలేక పోయింది. ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని అందించని పక్షంలో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి.

 ఈ ఏడాది వర్షాలు సంతృప్తిగా కురవడంతో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. చెరువులు, జలాశయాలు జలకళతో తొణికిసలాడుతున్నాయి. రబీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు అనే నిబంధనలు విధించడంపై అన్నదాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూములకు అనువైన  వి,  మార్కెట్‌ ఉన్న పంటలు వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉంది. పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

 ఏటా ఖరీఫ్‌లో వరి విస్తీర్ణం 3.20 లక్షల ఎకరాలు కాగా రబీలో 30వేల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. జీడి తోటలు 40వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. మామిడి 45వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. పామాయిల్‌ తోటలు 40వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అరటిని 35వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఈ ఉద్యాన పంటలకు సూక్ష్మ వ్యవసాయ విధానమైన బిందు సేద్యం కీలకం. ప్రభుత్వం వాటిపై రాయితీలు ఇస్తేనే ఎక్కువ మంది రైతులు సూక్ష్మ వ్యవసాయ విధానాలను అనురిస్తారు. Advertisement
Advertisement