Rayachotiకి రైలు కలేనా.. CM YS Jagan మనసులో ఏముంది..!?

ABN , First Publish Date - 2022-01-25T05:28:13+05:30 IST

కడప నుంచి బెంగళూరుకు నేరుగా వెళ్లేందుకు రైలు మార్గం లేదు. ఇటు తిరుపతి లేదా అటు గుంతకల్లు మీదుగా వెళ్లాల్సి వస్తుంది. లేదంటే రోడ్డు మార్గమే శరణ్యం. దీంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. ఈ ఇబ్బందులు తప్పించేందుకు కడప-బెంగళూరు వయా పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లె మీదుగా 255.40 కి.మీల నూతన రైల్వే లైనను 2008-09లో మంజూరు చేశారు.

Rayachotiకి రైలు కలేనా.. CM YS Jagan మనసులో ఏముంది..!?
ఇప్పటికే 21.80 కి.మీ నిర్మాణం పూర్తయిన కడప-పెండ్లిమర్రి రైల్వేలైన

  • కడప-బెంగళూరు రైల్వేలైన్ సర్వే పనులు కూడా పూర్తి
  • ఆ లైన్ వద్దు.. ముద్దనూరు-ముదిగుబ్బ చాలు
  • రైల్వే బోర్డుకు లేఖ రాసిన ప్రభుత్వం
  • 255 కి.మీలకు బదులు 72 కి.మీలే చాలన్న సర్కారు
  • పులివెందుల మీదుగా వెళ్లేలా సీఎం ప్రణాళిక
  • ఆర్థిక భారం తగ్గించుకోవడం మరో ఎత్తుగడ
  • రాయచోటి నియోజకవర్గ వాసులకు తీరని నష్టం


రాయచోటి నియోజకవర్గం ప్రజలకు రైల్వే రవాణా సేవలు కలగానే మిగలనున్నాయా..? కడప-బెంగళూరు రైల్వే లైన్ మరిచిపోవాల్సిందేనా..? ఇప్పటికే చేపట్టిన పనులు నిష్ప్రయోజనమేనా..? రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నిజమే అన్న సమాధానం ఇస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా రైల్వే లైన్ నిర్మించాలి అనుకున్నారో.. ప్రస్తుత ప్రతిపాదిత రైలుమార్గం వల్ల రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం అవుతుందని భావించారో.. ఏలికలకే ఎరుక. 255 కి.మీల కడప-బెంగ ళూరు రైల్వేలైన్ వద్దు.. 72 కి.మీల ముద్దనూరు- ముదిగుబ్బ రైల్వే లైన చాలు..! అని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు లేఖ రాసింది. దీంతో కడప-బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.


(కడప-ఆంధ్రజ్యోతి): కడప నుంచి బెంగళూరుకు నేరుగా వెళ్లేందుకు రైలు మార్గం లేదు. ఇటు తిరుపతి లేదా అటు గుంతకల్లు మీదుగా వెళ్లాల్సి వస్తుంది. లేదంటే రోడ్డు మార్గమే శరణ్యం. దీంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. ఈ ఇబ్బందులు తప్పించేందుకు కడప-బెంగళూరు వయా పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లె మీదుగా 255.40 కి.మీల నూతన రైల్వే లైన్‌ను 2008-09లో మంజూరు చేశారు. అంచనా వ్యయం రూ.1,000.23 కోట్లు. భారత రైల్వే శాఖ 50 శాతం.. మరో 50 శాతం నిధులు ఆంధ్రప్రదేశ, కర్ణాటక ప్రభుత్వాలు సమకూర్చాలి. రాష్ట్రంలో కడప, చిత్తూరు జిల్లాల్లో 205 కి.మీలు, మిగిలిన 50.40 కి.మీ కర్ణాటక పరిధిలో నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఈ రైలు మార్గం ప్రధానంగా రాయచోటి నియోజకవర్గానికి ఎంతో కీలకం. ఆ ప్రాంత వాసుల దశాబ్దాల స్వప్నం కూడా.


ఇప్పటికే 21.80 కి.మీలు రైలుమార్గం పూర్తి

కడప-బెంగళూరు రైల్వే లైన్ 2008-09లో ఆమోదించిన అలైన్‌మెంట్‌ ప్రకారం జిల్లాలో కడప, పెండ్లిమర్రి, ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, చిత్తూరు జిల్లా వాయల్పాడు, మదనపల్లె, కర్ణాటకలోని మడగట్ల, ముళబాగల్‌ మీదుగా వెళ్లి కోలార్‌-బంగారుపేట రైల్వే లైనలో కలుస్తుంది. అక్కడి నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ ఉంది. ఫేజ్‌-1 కింద 0.00 నుంచి 21.80 కి.మీల వరకు (కడప-పెండ్లిమర్రి), ఫేజ్‌-2 కింద 28.80 నుంచి 101.00 కి.మీలు (పెండ్లిమర్రి-రాయచోటి) వరకు, ఫేజ్‌-3 కింద రాయచోటి నుంచి వాయల్పాడు స్టేషన వరకు, ఫేజ్‌-4 కింద వాయల్పాడు స్టేషన్ నుంచి మడగట్ల వరకు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అక్కడి నుంచి రెండు దశల్లో బెంగళూరు వరకు ఈ లైన్ నిర్మిస్తారు. ఆరు దశల్లో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. సర్వే పనులు కూడా పూర్తి అయ్యాయి. ఏ దశలో ఎంత ఖర్చు చేయాలన్నది భారత రైల్వే శాఖ బడ్జెట్‌ వివరాలు పింక్‌ బుక్‌లో స్పష్టంగా పేర్కొంది. ఫేజ్‌-1లో కడప-పెండ్లిమర్రి వరకు 21.80 కి.మీలు రైలుమార్గం, స్టేషన్లు నిర్మించారు. సుమారుగా రూ.165 కోట్లు ఖర్చు చేశామని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.


తాజా ప్రతిపాదన ఇలా

కడప-బెంగళూరు వయా పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లె మీదుగా 255.40 కి.మీలు రైల్వే లైన్ నిర్మాణానికి 2008-09లో అంచనా వ్యయం రూ.1,000.23 కోట్లు కాగా.. రివైజ్డ్‌ ఎస్టిమేట్‌ ప్రకారం రూ.1,732.19 కోట్లకు చేరింది. మరోసారి ప్రతిపాదనలు సవరిస్తే రూ.2,132.77 కోట్లకు చేరిందని, తాజాగా రూ.3,500 కోట్లకు పైగా అంచనా వ్యయం పెరిగిందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ లైన పూర్తి అయ్యేనాటికి రూ.4-5 వేల కోట్లకు చేరుతుందని అంచనా. అందులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై- ముంబాయి వయా కడప, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి రైల్వే లైన్ ఉంది. ముద్దనూరు-ముదిగుబ్బ వయా పులివెందుల మీదుగా 72 కి.మీలు నూతన రైలుమార్గం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించింది. ఈ మేరకు ఢిల్లీలోని రైల్వే బోర్డుకు జగన ప్రభుత్వం లేఖ రాసిందని గుంతకల్లు రైల్వే డివిజన అఽధికారులు పేర్కొన్నారు. ఈ మార్గాన్ని అటు నుంచి పాకాల-ధర్మవరం వయా కదిరి మీదుగా వెళ్లే రైల్వేలైనలో కలపాలని కోరారు. దీనివల్ల ముదిగుబ్బ- ధర్మవరం- పెనుకొండ- హిందూపురం మీదుగా బెంగళూరుకు కనెక్టివిటీ వస్తుందని ప్రభుత్వం తాజా ప్రతిపాదన. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ.1,400 కోట్లకు మించదని అంచనా. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 50 శాతం అంటే రూ.700 కోట్లు ఇస్తే సరిపోతుంది. పైగా సీఎం జగన్ సొంత నియోజకవర్గ కేంద్రం పులివెందులకు రైల్వే లైన కూడా వస్తుంది. ఓ పక్క ఆర్థిక భారం తగ్గించుకోవడం, మరో పక్క పులివెందులను కలుపుతూ రైలుమార్గం రెండు ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.


రాయచోటి ప్రాంతానికి అన్యాయం

- మన్నేరు రామాంజులు, వ్యాపారి, రాయచోటి

కడప-బెంగళూరు వయా రాయచోటి రైల్వేలైన్ నిర్మిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించాం. మేము బెంగళూరుకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులే శరణ్యం. సామాన్యులు భరించలేని చార్జీలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి ఏదో ఒక రోజు రైలుమార్గం వస్తుందని ఆశించాం. ఇప్పటికే సర్వే పనులు కూడా పూర్తి చేశారు. ఓ వైపు పనులు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రైలుమార్గం వద్దు.. మద్దనూరు-ముదిగుబ్బ వయా పులివెందుల మీదుగా 72 కి.మీలు రైలుమార్గం చాలని ప్రభుత్వం రైల్వేబోర్డుకు లేఖ రాయడం సరికాదు. 30 ఏళ్ల కల సాకారం అయ్యే సమయంలో నీళ్లు చల్లడం రాయచోటి ప్రాంతానికి తీరని అన్యాయం చేయడమే. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కడప-బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయాలి.


రాయచోటి వాసులకు కలేనా..?

కడప-బెంగళూరు రైలుమార్గం రాయచోటి నియోజకవర్గంలో సుమారు 115 కి.మీలు ఉంటుంది.  ఈ మార్గం వల్ల రామాపురం, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, చిన్నమండెం రాయచోటి, సంబేపలి, వీరబల్లి, టి.సుండుపల్లి తదితర మండలాలకు చెందిన 190 గ్రామాల ప్రజలు బెంగళూరు వెళ్లడానికి ఎంతో అనుకూలం. బస్సులతో పోలిస్తే రైలు చార్జీలు ఎంతో తక్కువ. అంతేకాదు.. నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే రాయచోటి జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌ కూడా బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజల రైల్వే లైన్ ఆశలపై సీఎం జగన్ నీళ్లు చల్లారు. అన్నింటినీ పులివెందులకే అన్నట్లు ఇప్పటికే మంజూరైన కడప-బెంగళూరు వయా పెండ్లిమర్రి, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి రైలు మార్గాన్ని కాదని ముద్దనూరు- ముదిగుబ్బ వయా పులివెందుల మీదుగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ వంటి కీలకమైన పదవిలో ఉన్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకోసం ప్రస్తుత నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ కోసం కృషి చేస్తారా..? సీఎంను ప్రశ్నించలేక పులివెందుల కోసం ముద్దనూరు-ముదిగుబ్బ రైల్వే లైన్‌కే జై కొడతారా..? వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు.


కడప-బెంగళూరు మార్గం వివరాలు

రైల్వేలైన్ నిర్మాణం పొడవు : 255.40 కి.మీలు

2008-09 అంచనా వ్యయం : రూ.1,000.23 కోట్లు

ప్రస్తుతం అంచనా వ్యయం : సుమారు రూ.3,500 కోట్లు

రైల్వే స్టేషన్లు            : 25

నిర్మించాల్సిన బ్రిడ్జిలు  : 278

పెద్ద వంతెనలు   : 38

ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు   : 06

నిర్మాణ గడువు    : 08 ఏళ్లు

ఇప్పటి వరకు చేసిన ఖర్చు : సుమారు రూ.165 కోట్లు

నిర్మించిన రైలు మార్గం    : 21.80 కి.మీలు

Updated Date - 2022-01-25T05:28:13+05:30 IST