బాగు పడే మార్గమేదీ?

ABN , First Publish Date - 2022-05-17T06:19:10+05:30 IST

అడుగడుగునా గోతులు.. పలు చోట్ల రాళ్లు తేలి రాకపోకలు సాగించలేని పరిస్థితి.

బాగు పడే మార్గమేదీ?
కితలంగి వద్ద రాళ్లు తేలిన రహదారి

రాళ్లు తేలి గోతులతో అధ్వానంగా లోతేరు- బొర్రా రోడ్డు

వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

పర్యాటకులకు తప్పని అవస్థలు

పట్టించుకోని అధికారులు

స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం




అరకులోయ, మే 16: అడుగడుగునా గోతులు.. పలు చోట్ల రాళ్లు తేలి రాకపోకలు సాగించలేని పరిస్థితి. వర్షమొస్తే ఇక అంతే సంగతులు.. ఇదీ పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే లోతేరు- బొర్రా ప్రధాన రహదారి దుస్థితి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటువైపు రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ రహదారికి మరమ్మతులు చేయాలని పలువురు అభ్యర్థిస్తున్నా స్పందించడం లేదు. లోతేరు రోడ్డు నుంచి బొర్రా వరకు ఉన్న సుమారు పది కిలోమీటర్ల తారురోడ్డు అధ్వానంగా తయారైంది. తారు కొట్టుకుపోయి రాళ్లు తేలి ఉంది. ఈ మార్గంలో పలుచోట్ల గోతులు దర్శనమిస్తున్నాయి. దీని వల్ల వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అరకులోయ నుంచి అనంతగిరి మీదుగా బొర్రా వెళ్లే ప్రధాన రహదారి పర్యాటక సీజన్‌లో ట్రాఫిక్‌ జామ్‌ అయితే లోతేరు రోడ్డు నుంచి కర్రాయగుడ, కితలంగి- కోనాపురం మీదుగా బొర్రాకు వెళుతుంటారు. సీజన్‌లో అధిక సంఖ్యలో పర్యాటకుల వాహనాలు, స్థానిక ఆటోలు, కార్లు ఈ మార్గం గుండా బొర్రా గుహలకు చేరుకుంటాయి. అదే విధంగా గన్నెల, లోతేరు, ఇరగాయి గ్రామ పంచాయతీల ప్రజలు ఎస్‌.కోట, విశాఖపట్నం వెళ్లేందుకు లోతేరు రోడ్డు నుంచి బొర్రా వరకు ఉన్న ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనికి ఆహార పథకం కింద ఈ రహదారిని నిర్మించారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో లోతేరు రోడ్డు నుంచి కర్రాయిగుడ, కితలంగి, కోనాపురం, చప్పాడి, కొయిటిగుడ మీదుగా బొర్రా వరకు తారు రోడ్డుతో పాటు బొర్రాకు సమీపంలో పెద్ద గెడ్డపై వంతెన కూడా నిర్మించారు. అయితే ఆ తరువాత ఈ రహదారి నిర్వహణను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారైంది. తారు కొట్టుకుపోయి రాళ్లు తేలి కనిపిస్తున్నది. పలు చోట్ల గోతులతో దర్శనమిస్తున్నది. లోతేరు రోడ్డు మొదలు కర్రాయిగుడ, కితలంగి, కోనాపురం మధ్య రహదారి ప్రమాదకరంగా ఉంది. రెండు మండలాలకు బైపాస్‌ రోడ్డు తరహాలో ఉపయోగపడుతున్న ఈ రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని లోతేరు, ఇరగాయి, గన్నెల పంచాయతీ సర్పంచ్‌లతో పాటు అనంతగిరి మండలానికి చెందిన కోనాపురం, బొర్రా సర్పంచ్‌లు, బొర్రా ఎంపీటీసీ సభ్యురాలు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఈ రహదారి నిర్మాణ పనులను ఐటీడీఏ ఇంజనీరింగ్‌ అదికారులు పర్యవేక్షించారు. అయితే దీనిని ఆర్‌ అండ్‌ బీ పరిధిలోకి తెచ్చి మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌, ఐటీడీఏ పీవోను స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. 


స్పందనలో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం


ఈ రహదారిలో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, జీసీసీ చైర్మన్‌ స్వాతీరాణిలు పలుమారు ప్రయాణించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు వారిని కలిసి రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పాడేరు స్పందన కార్యక్రమంలో సైతం సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్ట లేదు. 


మరికొన్ని రోడ్లు కూడా..


గన్నెల జంక్షన్‌ నుంచి గన్నెల వరకు రోడ్డు ఘోరంగా ఉంది. అలాగే అరకులోయ నుంచి చొంపి మీదుగా చంపగుడ బస్కీ, బస్కీ దేవరాపల్లి వరకు రహదారి గోతులమయంగా ఉంది. అరకులోయ నుంచి కొత్తవలస మీదుగా కోడిపుంజువలస, సిరగాం వరకు రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సుంకరమెట్ట, బొండాం, సిరగాం, బస్కీ, చొంపి గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. గోతులతో అధ్వానంగా ఉన్న బస్కీ రోడ్డుకు ఆరు నెలల క్రితం బస్కీ, చొంపి, మాడగడ పంచాయతీ పరిధిలో ఉన్న ఆటోలు, జీపుల యజమానులు చందాలు వేసుకుని మరమ్మతులు చేపట్టారు. మండలంలో ముఖ్యమైన రహదారుల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు

Updated Date - 2022-05-17T06:19:10+05:30 IST