మిడతల దండు ముప్పు తప్పినట్లేనా?

ABN , First Publish Date - 2020-06-01T09:40:43+05:30 IST

మహారాష్ట్ర సరిహద్దుల్లో తిష్ట వేసిన మిడతల దండు నుంచి జిల్లాకు ముప్పు తప్పినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

మిడతల దండు ముప్పు తప్పినట్లేనా?

మహారాష్ట్రలోని వర్ధా ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్‌ దిశగా మళ్లింపు 

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో అధికారుల ఏరియల్‌ సర్వే

సరిహద్దుల్లో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం  

వేసవి కావడంతో ముప్పుతప్పిందంటున్న అధికారులు 

ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్న దృశ్యం


ఆదిలాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర సరిహద్దుల్లో తిష్ట వేసిన మిడతల దండు నుంచి జిల్లాకు ముప్పు తప్పినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఇంద్రావతి నది పరివాహక ప్రాంతం వైపు మిడతల దండు మళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగైదు రోజులుగా మధ్యప్రదేశ్‌-మహారాష్ట్ర సరి హద్దుల్లో తిష్ట వేసిన మిడతల దండు గాలి విచే దిశగా పయనిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీని వేసిన రాష్ట్ర ప్రభుత్వ బృందం ఆదివారం జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏరియల్‌ సర్వే చేసింది. ఇప్పట్లో జిల్లాకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటిం చింది. అయినా జిల్లా రైతాంగం అప్రమత్తంగా ఉం డాలని సూచిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి పంటలు లేని కారణంగానే మిడతల దండు జిల్లా వైపుకు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.  ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా అధికా రులు, అగ్నిమాపక శాఖ,  హార్టికల్చర్‌, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సమన్వయంతో సరిహద్దుల్లో నిఘా  సారించారు. మిడతల దండును సమర్థవం తంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు చేప డుతున్నారు. అయితే జిల్లాలోకి మిడతల దండు ప్రవేశించినీ ప్రస్తుతం పెద్దగా ముప్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. 


ఛత్తీస్‌గఢ్‌ దిశగా ప్రయాణం..

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో తిష్ట వేసి న మిడతల దండు వాతావరణ పరిస్థితులకు అను గుణంగా ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు చెబు తున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో తొలకరి వర్షాలు కురియడంతో వాతావరణం చల్లబడింది. దీంతో పచ్చదనం ఏర్పడడంతో అటు వైపు మిడ తల దండు కదిలినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గాలిదిశ కూడా అటువైపే ఉండడంతో మిడతలు వెళ్లేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అలాగే దట్టమైన అడవులు ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశిం చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి పంటలు లేక పోవడం కూడా ప్రధాన కారణమంటున్నారు. మిడతలు తమ దిశను మార్చుకొని ఇతర ప్రాంతాల వైపు వెళ్తున్నట్లు వ్యవసాయ శాఖ  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


రాష్ట్ర అధికారుల బృందం సర్వే..

మహారాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో రాష్ట్ర స్థాయి అధికారుల బృందం నిరంతరంగా నిఘా సారిస్తు న్నారు. ఆదివారం జిల్లా సరిహద్దుల్లో పర్యటించిన ఉన్నతాధికారుల బృందం మిడతల దండు కదలి కలపై పరిశీలన చేశారు. సుమారుగా 200 కి.మీల దూరంలో ఉన్న మిడతలు నాలుగైదు రోజులుగా జిల్లాలోకి ప్రవేశించ లేదు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కొన్ని తప్పిపోయిన మిడతలు మాత్రమే దిశను మార్చి ఇతర ప్రాంతాల వైపు ప్రయాణిస్తున్నట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. 


సరిహద్దుల్లో అప్రమత్తం..

మిడతల దండు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ శ్రీదేవసేన అధికారులతో సమన్వయ సమా వేశాన్ని నిర్వహించి సరిహద్దుల్లో మిడతల దండు ప్రవేశాన్ని అడ్డుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సరిహద్దు మండలాల పరిధిలో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. సరిపడ రసాయనాలతో సిబ్బందిని సిద్ధం చేశారు. మిడతల దండు నివారణకు రైతులు చేయాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఏ క్షణంలోనైనా మిడతల దండు జిల్లాలోకి ప్రవేశిస్తే సరిహద్దులను దాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా జైనథ్‌, తాంసి, తలమడుగు, బేల, నార్నూర్‌, బోథ్‌, గాదిగూడ మండలాల్లో అధికారులు అప్రమత్తమై మిడతల రాకపై ప్రత్యేక దృష్టి సారించారు. 


వేసవితోనే తప్పిన ముప్పు..

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో జిల్లాకు మిడతల దండు ముప్పు తప్పినట్లయింది.  అలాగే జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మిడతల ఆగమనానికి ఆటంకాలు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. గత 24 గంటలుగా గాలి వీచే దిశగా మిడతలు మళ్టినట్లు చెబుతున్నారు. ప్రస్తు తం జిల్లాలో వేసవి దుక్కులు చేయడం ఇంకా తొలకరి వర్షాలు కురియక పోవడంతో పచ్చ దనం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులతో ఆకర్ష ణకు గురికాని మిడతలు తమ దిశను మార్చుకొని ఇతర ప్రాంతాల వైపు మళ్లినట్లు తెలుస్తోంది. తొల కరి వర్షాలు కురిస్తే జిల్లాలో పంటల సాగు ప్రారం భమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మిడ తల దండు ప్రవేశిస్తే భారీ నష్టమే జరుగుతుందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. 


ముప్పుతప్పినట్లే..శ్రీధర్‌చౌహాన్‌ (వ్యవసాయ పరిశోధన స్థానం, సీనియర్‌ శాస్త్రవేత్త, ఆదిలాబాద్‌)

మహారాష్ట్ర ప్రాంతంలోకి మిడతల దండు వచ్చినట్లు వార్తలు రావడంతో అప్రమత్తం కావడం జరిగింది. గాలివిచే దిశ మారడంతో జిల్లాకు మిడతల దండు ముప్పు తప్పినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి పంటలు లేక పోయినా చిగురించిన చెట్లపై మిడతల ప్రభావం ఉంటుంది. అయినా జిల్లా రైతాంగం మరికొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. తొలకరి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు వేసిన, నిత్యం పంటల పర్యవేక్షణ ఉండాలి. పంటలను ఎలాంటి చీడ పీడలు ఆశిస్తున్నాయో గమనించి వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలి.

Updated Date - 2020-06-01T09:40:43+05:30 IST