టీకాల కొరత తీరేదెలా?

ABN , First Publish Date - 2021-05-04T09:37:11+05:30 IST

కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడేందుకు మనకు అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా అభివృద్ధి పరిచిన కొవిషీల్డ్; భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్....

టీకాల కొరత తీరేదెలా?

విడ్ మహమ్మారి నుంచి బయటపడేందుకు మనకు అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా అభివృద్ధి పరిచిన కొవిషీల్డ్; భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్. కొవిషీల్డ్‌ను మనదేశంలో పూణే లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. టీకా విక్రయ ధరలో సగభాగాన్ని ఆస్ట్రాజెనెకాకు రాయల్టీ (సొంతదారుకు ఇచ్చే ప్రతిఫలం)గా సీరమ్‌ సంస్థ చెల్లించవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కొవిషీల్డ్ టీకాను ఆ సంస్థ రూ.150కు విక్రయిస్తోంది. ఇందులో రూ.75 లైసెన్స్ నిబంధనల ప్రకారం ఆస్ట్రాజెనెకాకు చెల్లించాలి. మిగతా రూ.75తో కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేయడం తమకు లాభదాయకంగా లేదని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ స్పష్టం చేసింది. రాష్ట్రాలకు రూ.300 చొప్పున, ప్రైవేట్ కొనుగోలుదారులకు అంతకంటే ఎక్కువ ధరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను విక్రయించేందుకు సీరమ్ నిర్ణయం తీసుకుంది.


ఆస్ట్రాజెనెకాకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అంత పెద్దమొత్తంలో రాయల్టీ ఎందుకు చెల్లించాలి? ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్ల్యుటిఓ)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మనం ప్రొడక్ట్ పేటెంట్‌ను అంగీకరించి తీరాలి. పేటెంట్ ఉన్న ఒక వస్తువును , దాన్ని అభివృద్ధిపరిచిన కంపెనీ మినహా మరే ఇతర కంపెనీ ఉత్పత్తి చేయకూడదు, చివరకు ప్రత్యామ్నాయ ప్రక్రియను ఉపయోగించడం ద్వారా కూడా ఉత్పత్తి చేయకూడదని ప్రొడక్ట్ పేటెంట్ నిర్దేశిస్తోంది.  1995లో డబ్ల్యుటిఓ ఒప్పందంలో భాగంగా ప్రొడక్ట్ పేటెంట్లను మనం అంగీకరించాం. అంతకు ముందు ప్రాసెస్ (ప్రక్రియ) పేటెంట్లు ఉండేవి. ఇవి, ఒక వస్తువును ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసేందుకు అనుమతించేవి. ప్రొడక్ట్ పేటెంట్స్ పర్యవసానంగా కొవిషీల్డ్ టీకాను ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసేందుకు వీలు లేదు. ఫలితంగా మనదేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తికి పరిమితులు నెలకొన్నాయి. మన ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండాపోయాయి.  


మనకు అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్ కొవాగ్జిన్ . దీన్ని మన భారతీయ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి పరిచింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అడుగుజాడల్లో ఈ కంపెనీ కూడా తమ టీకాను రూ.150 చొప్పున కేంద్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది. ప్రభుత్వం ‘నిర్బంధ లైసెన్సింగ్ ’ నిబంధనను ఉపయోగించుకోవచ్చని ప్రపంచ వాణిజ్యసంస్థ పేటెంట్ల నియమాలు స్పష్టంగా పేర్కొన్నాయి. కొవిడ్ విపత్తు లాంటి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పేటెంట్ ఉన్న ఒక వస్తువును ఇతర కంపెనీలు కూడా ఉత్పత్తి చేయవచ్చని డబ్ల్యుటిఓ పేటెంట్ నియమాలు స్పష్టం చేశాయి. నిర్బంధ లైసెన్స్‌లు జారీ చేసేందుకు యోగ్యమైన ప్రాతిపదికలు ఏమిటో దేశాలే నిర్ణయించుకోవచ్చని డబ్ల్యుటిఓ స్పష్టంగా పేర్కొంది. అలాగే ఎలాంటి విపత్కర పరిణామాలను జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించవచ్చునో కూడా ప్రపంచ వాణిజ్యసంస్థ విశదం చేసింది. అయితే మన ప్రభుత్వం ‘నిర్బంధ లైసెన్సింగ్’ వెసులుబాటును ఉపయోగించుకోలేదు. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే బహుళజాతి కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందేమోనని మన ప్రభుత్వం భయపడినట్టుంది. 


ప్రపంచ వాణిజ్యసంస్థతో మనం కుదుర్చుకున్న ఒప్పందంపై నిశిత దృక్కులు సారించవలసిన అవసరముంది. కొవిడ్ ఉపద్రవం అందుకు సరైన సమయం. 1995లో ఈ ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ప్రొడక్ట్ పేటెంట్లతో చేకూరే నష్టం కన్నా స్వేచ్ఛా వాణిజ్యంతో సమకూరే లాభాలు అత్యధికంగా ఉంటాయని సంపన్నదేశాలు నమ్మబలికాయి. ముఖ్యంగా వ్యవసాయక ఉత్పత్తుల విషయంలో మనం ఇతోధిక లబ్ధి పొందుతామని భరోసా ఇచ్చాయి. ఈ ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉభయార్ధ సాధకమని చెప్పాయి. అధునాతన సాంకేతికతలతో పాటు ఎగుమతి మార్కెట్లు అపారంగా లభిస్తాయని అన్నారు. వాస్తవమేమిటి? పాతిక సంవత్సరాల అనంతరం డబ్ల్యుటిఓ ఒప్పందం వల్ల బహుళజాతి కార్పొరేట్ సంస్థలు మాత్రమే అధికంగా లబ్ధి పొందుతున్నాయని స్పష్టమయింది. 


వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీ పెట్టుబడులు సమకూర్చాలి. ఇది తప్పనిసరి. భారత్ బయోటెక్ యజమాని డాక్టర్ కృష్ణ ఎల్లా ఒక టీవీ కార్యక్రమంలో విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు తమ తమ ప్రభుత్వాల నుంచి అందుతున్న ఇతోధిక ఆర్థిక సహకారంతో వ్యాక్సిన్లను అభివృద్ధి పరుస్తున్నాయని చెప్పారు. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్ బయోటెక్‌కు ప్రభుత్వం నుంచి కేవలం రూ.65 కోట్ల సహాయం మాత్రమే లభ్యమయింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను సొంతంగా అభివృద్ధి పరిచిన తరువాత మాత్రమే భారత్ బయోటెక్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1500 కోట్ల ఆర్థిక సహాయమందింది. భారత్ బయోటెక్ నుంచి కొవాగ్జిన్ పేటెంట్‌ను ప్రభుత్వం కొనితీరాలి. ఆ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు అన్నిటికీ అనుమతి ఇవ్వాలి. తద్వారా అన్ని దేశాలూ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆ వ్యాక్సిన్‌ను తమకుతామే అభివృద్ధి పరచుకుని కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడతాయి. దీనివల్ల బహుళజాతి కార్పొరేట్ కంపెనీల టీకాలకు మార్కెట్ పడిపోతుంది. వాటి వాణిజ్య ఔద్ధత్యానికి తగిన గుణపాఠం చెప్పినట్టవుతుంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇతోధికం చేసేందుకు భారత్ బయోటెక్‌కు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. ప్రొడక్ట్ పేటెంట్లను రద్దు చేయాలి. అవసరమైతే ప్రపంచ వాణిజ్యసంస్థ నుంచి వైదొలగాలి. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-05-04T09:37:11+05:30 IST