పింఛను పెంపు..ఇంకెప్పుడయ్యా!

ABN , First Publish Date - 2020-09-25T06:30:22+05:30 IST

సామాజిక పింఛను పెంపు పాలకుల హామీలకే పరిమితమవుతోంది. గత ఏడాది జులై మొదటి వారంలో సామాజిక

పింఛను పెంపు..ఇంకెప్పుడయ్యా!

3 నెలలు గడుస్తున్న పెరగని రూ.250

వలంటీర్ల నుంచి సమాధానం నిల్‌

పింఛనుదారుల నిరీక్షణ 


నెల్లూరు (హరనాథపురం), సెప్టెంబరు 24 : సామాజిక  పింఛను పెంపు పాలకుల హామీలకే పరిమితమవుతోంది. గత ఏడాది జులై మొదటి వారంలో సామాజిక పింఛనుదారులకు ఏటా రూ.250 పెంచుతామని వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అప్పట్లో రూ.250 పెంచి పింఛను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు పెంపు లేనేలేదు. ఎప్పుడు పెంపు ఉంటోందో కూడా తెలియని పరిస్థితి. పింఛనుదారులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,65,460 మంది పింఛనుదారులు ఉండగా, రూ.89.67 కోట్లు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్‌ రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామని జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏటా రూ.250 చొప్పున ఇస్తామని, నాల్గవ సంవత్సరం వచ్చే సరికి పింఛను రూ.3వేలకు చేరుకొంటుందని చెప్పి మాట మార్చారనే ఆరోపణలు ఉన్నాయి.


అయితే ఏటా పెంచుతామన్న పింఛను కూడా ఇప్పటిదాకా లేదు. పెంపుపై వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను లబ్ధిదారులు అడిగినా వారి నుంచి సమాధానం ఉండటం లేదు. వృద్ధాప్య, వితంతు, చేనేత, మత్స్యకారులు, ఒంటరి మహిళ, చర్మకారులకు పింఛను పెంచాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా రిలీఫ్‌ కింద దేశవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్‌దారులకు ఒక్కొక్కరికి రూ.1000 మంజూరు చేసింది. ఒక్కో దఫా రూ.500 చొప్పున రెండుసార్లు విడుదల చేసింది. ఆ మేరకు కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో జమ చేసింది. అయితే, మన రాష్ట్రంలో ఈ పరిహారం కూడా ఆయా పెన్షన్‌దారులకు అందించలేదనేది సమాచారం.


జిల్లాలో పింఛనుదారుల వివరాలు

పింఛను లబ్ధిదారుల చెల్లిస్తున్నది

         సంఖ్య (రూ.కోట్లలో)

వృద్ధాప్య 1,58,361 37.06

వితంతు 1,33,012 31.30

వికలాంగ 36,108 11.22

చేనేత 5,999 1.39

కల్లుగీత కార్మికులు 3094 0.70

అభయ హస్తం 3,886 0.21

మత్స్యకారులు 4905 1.10

ఒంటరి మహిళ 11764 2.74

హిజ్రాలు 124 4.08

కిడ్నీ వ్యాధిగ్రస్థులు 1143 1.14

డప్పుకళాకారులు 2117 0.64

చర్మకారులు 1520 0.34

డీఎంహెచ్‌ఓ 2932 1.49

కళాకారులు 594 0.25

మొత్తం 3,65,460 89.67


ఉత్తర్వులు అందాల్సి ఉంది

సామాజిక పెన్షన్‌ల పెన్షన్‌ మొత్తం పెంపుకు సంబంధించి ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఉత్తర్వులు అందిన వెంటనే పెంపుకు అన్నీ చర్యలను తీసుకొంటాం.

- ఎస్వీ నాగేశ్వరరావు, పీడీ, డీఆర్‌డీఏ 



ఎదురుచూస్తున్నా

నెల నెలా వచ్చే పింఛనే నాకు ఆధారం. ఈ ఏడాది జూలై నుంచి పింఛను డబ్బు పెంచాల్సి ఉంది.  అవకాశం ఉంటే ఈ పాటికి ఇచ్చేవాడేమో.. ఇస్తే మంచిది. అదనంగా వచ్చే డబ్బులతో ఇంటి అవసరాలు తీరుతాయి. ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నా.

- గుర్రం రంగయ్య, మనుబోలు



పెంచనేలేదు

ప్రతి సంవత్సరం రూ.250 పింఛను డబ్బు పెంచుతామన్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా పెంచలేదు. నాకిప్పుడు 80 సంవత్సరాలు. ఇప్పుడు అసలు పింఛనే ఇవ్వడంలేదు.  కాలు దెబ్బ తగిలి ఇంటి దగ్గరే ఉంటున్నా.  పింఛను కోసం అధికారుల చుట్టూ తిరగలేదు. దయదలచి నాకు పింఛను ఇప్పంచండాయ్యా.

- వై.రవణమ్మ, కోవూరు


పింఛన్‌ పెంచలేదు

జగన్‌ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన పిదప రెండు వేలు ఉన్న పింఛన్‌ని 2250కి పెంచారు. ఈ ఏడాది ఇంకా పెన్షన్‌ పెంచలేదు. ఎప్పుడు పెంచుతారో ఏమో తెలియదు.

- జాలమ్మ, విడవలూరు


రూ.3వేలు వస్తాదని ఆశపడ్డాం

ఎన్నికల హామీలో భాగంగా జగన్‌ ముఖ్యమంత్రి అయితే పింఛను రూ.3000 వస్తుందని ఆశ పడ్డాం. కేవలం రూ.250 పెంచి ప్రతి ఏటా పెంచుతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు పెంచలేదు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛను పెంచి మాలాంటి వృద్ధులకు అండగా నిలబడాలి. 

- బీ పద్మ, కావలి


 

Updated Date - 2020-09-25T06:30:22+05:30 IST