శిక్ష విలువ రూపాయా? మూడునెలల స్వేచ్ఛా?

ABN , First Publish Date - 2020-09-02T06:38:30+05:30 IST

రెండునెలలుగా దుమారం రేపిన కోర్టు ధిక్కారం కేసు రూపాయి జరిమానాతో ముగిసింది. ప్రశాంత్ భూషణ్ జూన్ 27, 29 తేదీలలో రాసిన రెండు ట్వీట్లు సుప్రీంకోర్టు ఆగ్రహానికి...

శిక్ష విలువ రూపాయా? మూడునెలల స్వేచ్ఛా?

న్యాయవ్యవస్థపై తన ఆరోపణలు పరమ సత్యాలని వాదించడం ద్వారా ప్రశాంత్ భూషణ్ కోర్టు పరువు మరింత దిగజార్చారని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ ఆరోపణలు ఒకవేళ సత్యాలే అయినా వాటిని జనహితం కోసం చెప్పాలని చట్టం షరతు విధించిందని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. ఆగస్టు 31న శిక్షా నిర్ణయ తీర్పులో భావ ప్రకటనా స్వేచ్ఛ ముఖ్యం అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ ప్రశాంత్ ట్వీట్లు కోర్టు ధిక్కారమే అని ఆగస్టు 14న ఇచ్చిన తీర్పే ఇప్పుడు శాసనంగా నిలబడుతుంది.


రెండునెలలుగా దుమారం రేపిన కోర్టు ధిక్కారం కేసు రూపాయి జరిమానాతో ముగిసింది. ప్రశాంత్ భూషణ్ జూన్ 27, 29 తేదీలలో రాసిన రెండు ట్వీట్లు సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. కేసును స్వయంగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఆ రెండు ట్వీట్లు కోర్టుకు అగౌరవమనీ ప్రశాంత్ భూషణ్ ధిక్కారానికి శిక్షార్హుడని ఆగస్టు 14న, 31న వెలువరించిన రెండు తీర్పులలో తీర్మానించింది. న్యాయశాస్త్రంలో ఒక రూపాయి నష్టపరిహారాన్ని contemptuous damages లేదా nominal damages అంటారు. అంటే నామమాత్రం. ఒక రూపాయి ఏ నష్టాన్నీ పరిహరించలేదు. కొన్ని సందర్భాల్లో నష్టాన్ని మదింపు వేసి కచ్చితంగా దాన్ని పూడ్చే డబ్బెంతో నిర్ధారించడం సాధ్యం కాదు. దానికి రెండు పరిణామాలు. పాతిక లక్షలు చెల్లించండి అనవచ్చు. ఇదీ భారీ సొమ్ము. చెల్లించడానికి అతను కష్టపడవలసి ఉంటుంది. లేదా కొన్నేళ్లు కష్టపడి దాచుకున్న సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. అది శిక్షాపూర్వకమైన పరిహారం. కోర్టు ధిక్కారం కేసులలో మరీ ఎక్కువ సొమ్ము కట్టి తీరండి అనీ ఆదేశించవచ్చు. నిందితుడిని శిక్షించడం ఇష్టం లేక, వదిలేయడం అంతకన్నా ఇష్టం లేక సరే ఓ పదిరూపాయలు కట్టి బతికిపో అన్నట్టు ఈసడింపు పరిహారం అనుకోవచ్చు. దీని లక్ష్యం అతను నేరస్థుడని నిర్ధారించడమే.


నిజానికి సుప్రీంకోర్టు విధించిన జరిమానా రూపాయి వెనుక ఏముందని ఆలోచిస్తే అనేక ఆంక్షల రూపాలు కనిపిస్తాయి. పైకి ఒక రూపాయి, కాని దాని విలువ మూడు నెలల స్వేచ్ఛ. మూడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ఒక ప్రసిద్ధ సీనియర్ న్యాయవాది, అంటే ప్రశాంత్ భూషణ్ అంతటి న్యాయవాది, ప్రాక్టీసు చేస్తే ఎంత సంపాదించగలరో అంత దాని విలువ. భారత న్యాయవ్యవస్థ విమర్శకులందరికీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీవ్రమైన వార్నింగ్ ఈ తీర్పు. ప్రశాంత్ భూషణ్ బాగా పలుకుబడి కలిగిన సంపన్న ప్రముఖుడు. అతను ఒక్క రూపాయితో తప్పించుకోగలిగాడు. కాని నీవో నేనో అయితే మూడునెలలు జైల్లో ఉండాలి, అదనంగా ఒక సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది మూడు సంవత్సరాలు సంపాదించింనంత సొమ్ము జరిమానాగా కట్టాలి అని ఈ హెచ్చరిక.


దీని అర్థం తెలిసిన తరువాత ప్రజాస్వామ్యంలో విమర్శాస్వేచ్ఛ విజయం అని సంతోషించడం సాధ్యమా? సుప్రీంకోర్టు తన సుప్రిమసీని చాటింది. కోర్టు ధిక్కారం ఏనాటికైనా విమర్శా స్వేచ్ఛకు అతీతం అని నిర్ధారించింది. ఒళ్లు దగ్గర బెట్టుకుని రాయకపోతే జైళ్లు పిలుస్తాయని చాలా స్పష్టంగా వివరించిందీ తీర్పు. అంతే కాదు సుప్రీంకోర్టు కనుక ఆగ్రహిస్తే 2009 నాటి పాత కేసు దుమ్ము దులపగలదనీ, కొత్త కేసు చేపట్టి రెండునెలల్లో నీ చేతి రాత ద్వారానే నీ తలరాతను మార్చగలదనీ కూడా హెచ్చరించింది. ప్రశాంత్ భూషణ్ వేరు, సామాన్య జర్నలిస్టులు వేరు, సోషల్ మీడియాలో రాసుకునే మామూలు మనుషులు వేరు. కోర్టుధిక్కార కేసు దాఖలయిందని, కోర్టు సువో మోటోగా స్వీకరించిందని బాహ్య ప్రపంచానికి తెలిసే లోగా ట్వీట్ రచయిత కటకటాలు లెక్కబెడుతుంటాడని ఈ కేసు సందేశాన్ని ఇచ్చింది. బాధితులకు అర్థం కాకపోయినా, అర్థం చేసుకోకపోయినా అది కోర్టువారి తప్పుకాదు. హెడ్ లైన్ చూసి లవ్వులు, లైకులు కొట్టి నోటికొచ్చిన తిట్లు తిట్టడం మనదేశంలో కొత్తగా అలవాటయింది. పూర్తి వివరాలు టీవీ వాళ్లు చెప్పరు. పత్రికలు వివరాలు రాసినా చదవరు. కనుక ఇది ప్రశాంత్ ప్రజాస్వామ్యం, విమర్శా విజయాల వలె వారికి కనిపిస్తాయి. రూపాయి మీద జోకులు వేస్తుంటారు కూడా.


క్షమాపణ చెప్పబోనని పట్టుదల చూపినట్టే రూపాయి ససేమిరా ఇవ్వనని అంటే మూడు నెలలు జైలు మూడేళ్ల సంపాదన అని అర్థమైంది కనుక సుప్రీంకోర్టు తీర్పును స్వీకరిస్తాను. ఒక రూపాయి గౌరవంతో చెల్లిస్తానని ప్రశాంత్ ప్రకటించారు. రూపాయి చెల్లిస్తే జైలు లేకపోవడం ఎంత నిజమో క్షమాపణ చెప్పి ఉంటే ఈ తీర్పులు లేవన్నదీ అంతే నిజం. వ్యక్తిగతంగా ఈ వివాదంలో స్వేచ్ఛ కోసం ధైర్యంగా పోరాడే సాహసిగా ప్రశాంత్ భూషణ్ ప్రసిద్ధుడైనాడు. అందులో సందేహం లేదు. ప్రశాంత్ భూషణ్ ప్రముఖుడు, సుప్రీంకోర్టులోనే 35 సంవత్సరాలనుంచి ప్రాక్టీసు చేస్తున్న ప్రసిద్ధ వ్యక్తి, ఒకనాడు ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా పని చేసిన శాంతి భూషణ్ తనయుడు. బొగ్గుగనుల కేసు, గోవా గనులు, ఒడిషా గనులు, సివిసి నియామకం కేసు, సిబిఐ డైరెక్టర్ కేసు, పోలీసు సంస్కరణల కేసు, కారుణ్యమరణాల కేసు, హెచ్పిఎల్ ప్రైవెటేజేషన్‌ కేసు, వీధి అమ్మకందారుల కేసు, రిక్షా కార్మికుల కేసు, సింగూరు భూసేకరణ, కరువులో పాలన, గ్రామ న్యాయన్యాయాల కేసు, ఎలక్టోరల్ బాండ్స్ కేసు.. ప్రశాంత్ భూషణ్ వాదించిన పేరెన్నికగన్న కేసులు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న యోధుడు. ఆయన పక్షాన న్యాయవాదులు మాజీ న్యాయమూర్తులు, లా విద్యార్థులు నిలబడ్డారు. ఎక్కడో ఒకటి రెండు బార్ అసోసియేషన్ వర్గాలు, ఒకరిద్దరు విమర్శకులు తప్ప ఆయన వెంట న్యాయలోకం నిలబడింది. ఇది సుప్రీం కోర్టుకు, ఒక న్యాయవాదికి మధ్య పోరాటంలా అనిపించినా అటూ ఇటూ మొత్తం రాజ్యాంగ శక్తులన్నీ నిలబడ్డాయా అనేంత తీవ్రస్థాయిలో వివాదం నడిచింది. ఆయన క్షమాపణ చెప్పడు కాని రూపాయి చెల్లిస్తాడు. ప్రశాంత్ భూషణ్‌కు అది సాధ్యం అయింది. జర్నలిస్టుకు, ట్వీట్ రాసిన వాడికి దిక్కెవడు?


తనను అన్యాయంగా నిందించి ధిక్కరిస్తే శిక్షించి గౌరవం కాపాడుకుంటానని సుప్రీంకోర్టు వివరిస్తున్నది. ఇది నిజానికి ప్రశాంత్ భూషణ్ వర్సెస్ సుప్రీంకోర్టు ఘర్షణ కాదు. ఇది కోర్టు ధిక్కార పరిమితికి, విమర్శా స్వేచ్ఛ స్థితిగతులకు మధ్య జరిగిన పోరాటం. ఎవరు నిలిచారు? ఎవరు గెలిచారు?


కోర్టును స్కాండలైజ్ చేసారని అభియోగం. అంటే కోర్టును అన్యాయంగా నిందించారని. ఈ నేరానికి శిక్ష వేసే ముందు ఇది ఏ నేరం, దీని పరిధి ఏమిటి, విస్తారం ఎంత? అంతా అస్పష్టం. ఈ నేరాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చాలా తక్కువగా వాడాలని సుప్రీంకోర్టు ఇదివరలో బరడకాంత మిశ్రా కేసులో హెచ్చరించింది కదా అని ప్రశాంత్ తన జవాబులో పేర్కొన్నారు. నంబూద్రిపాద్ పైన ఇదే నేరానికి గాను సుప్రీంకోర్టు 1960లో యాభైరూపాయల జరిమానా విధించింది. తరువాత పిఎన్ డుడా వర్సెస్ శివశంకర్ కేసులో నంబూద్రిపాద్ కన్నా, ప్రశాంత్ భూషణ్ కన్నా తీవ్రమైన ఆరోపణలుచేసినప్పటికీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి శివశంకర్‌ను సుప్రీంకోర్టు 1988లో శిక్షించకుండా వదిలేసింది. కనుక తనను కూడా శిక్షించడానికి వీల్లేదని ప్రశాంత్‌ భూషణ్ వాదించారు. కాని 1988 తీర్పును కాదని, ఈ విమర్శ కోర్టు ధిక్కారమే అని తేల్చి ఇదే తీర్పు రాబోయే రోజుల్లో శాసనంగా నిలిచిపోయేట్టు చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావస్వేచ్ఛకి గ్యారంటీ ఉందని, దాన్ని ఆర్టికిల్ 129, 142(2) (కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం) అధిగమించబోవని ప్రశాంత్ చేసిన వాదనను అంగీకరించలేదు. భావస్వేచ్చ ప్రజాస్వామ్యానికి కీలకం అనీ, అసమ్మతి అత్యవసరమనీ, అభిప్రాయ నిర్మాణ స్వేచ్ఛ ఉందని, సదుద్దేశంతో చేసిన విమర్శ శిక్షార్హం కాదని రాజీవ్ ధావన్ దుష్యంత్ దవే వాదించారు. అదీ నిలబడలేదు.


ఆరోపణ విచారణలో ఉండగా ప్రశాంత్ జవాబును కోర్టు పరిశీలించక ముందే పత్రికలకు ఇతర మీడియాకు విడుదల చేయడం సరైన పని కాదని భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ కూడా ఒప్పుకున్నారని సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ ఆగస్టు 24న ప్రశాంత్ తన రెండో జవాబును కూడా కోర్టుకు ఇవ్వకముందే మీడియాకు ఇచ్చారని, అందులో సుప్రీంకోర్టును ఇంకా కించపరిచారని విమర్శించింది. కోర్టు పరిశీలించకముందే తన జవాబు పత్రాలను మీడియాలో చర్చకు పెట్టి, కోర్టు స్వేచ్ఛగా వ్యవహరించకుండా ఉండాలనే లక్ష్యంతో, తనను శిక్షించకూడదని మీడియా ద్వారా కోర్టుపైన వత్తిడి తెచ్చారని, ఇది కోర్టు పనిలో జోక్యం చేసుకోవడమే అవుతుందని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దోషి అని తీర్పు చెప్పిన తరువాత శిక్షా నిర్ధారణకు ముందు ఈ విధంగా ప్రచారం చేస్తూ మళ్లీ కోర్టుధిక్కారానికి పాల్పడ్డారని తేల్చింది. 


క్షమాపణ చెప్పి ఈ వివాదం ముగించాలనే ఉద్దేశంతో అందుకు అనేక అవకాశాలు కల్పించినప్పటికీ ప్రశాంత్ క్షమాపణ చెప్పకపోగా, తాను తప్పు చేయలేదనే వాదనను పదేపదే వినిపించారనీ, మీడియాకు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారనీ. క్షమాపణ చెబితే తన అంతరాత్మ పట్ల అది ధిక్కారమవుతుందని, బాహాటంగా విమర్శించడం ఒక్కటే ప్రజాస్వామ్య విలువలకు శ్రీరామరక్ష అని ప్రశాంత్ భూషణ్ వాదించారని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో ప్రస్తావించింది. ఈ ప్రకటన న్యాయస్థానం విధ్యుక్తవిధులను నిర్వహించడాన్ని ప్రభావితం చేసే విధంగా ఉందని సుప్రీంకోర్టు అంటూ, భావస్వేచ్ఛ ఎంతో గొప్పదనే విషయం నిర్వివాదమే అయినా ఇతరుల హక్కులను కూడా గౌరవించాలని న్యాయమూర్తులు తేల్చారు. తాను చేసిన ఆరోపణలు పరమ సత్యాలని వాదించడం ద్వారా ఆయన కోర్టు పరువు మరింత దిగజార్చారని, ఒకవేళ సత్యాలే అయినా వాటిని జనహితం కోసం చెప్పాలని చట్టం షరతు విధించిందని, కనుక ఈ మినహాయింపు కోర్టును ధిక్కరించిన నిందితుడిని రక్షించబోదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.


సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు 2018 జనవరి 12న నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశాన్ని అందులో చేసిన విమర్శలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు అటువంటి సమావేశం మొదటిది చివరిదీ కూడా కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు వ్యవస్థ అంతర్గతంగా ఇటువంటి సమస్యలను పరి ష్కరించుకునే వివేకం భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వీరిని, అలాగే రిటైరయిన తరువాత అగ్రస్థాయి న్యాయస్థానాల పనితీరును తీవ్రంగా దుయ్యబట్టిన మాజీ న్యాయమూర్తులను ఒక్కొక్క రూపాయితో నామమాత్రంగానైనా శిక్షించి కోర్టు గౌరవాన్ని నిలుపుకోవచ్చు కదా అనే సందేహానికి తావు లేదు. ఎందుకంటే ఒక్కొక్క విమర్శ పైన ఎవరైనా అటార్నీ జనరల్ ఆమోదంతో ఫిర్యాదు చేస్తే కోర్టులు వినే అవకాశం ఉంది. లేదా సువోమోటో కేసులు తీసుకునే అవకాశం కూడా ఉంది. రెండూ జరగలేదు. ఎందుకంటే అది అంతే. 


శిక్షానిర్ణయ తీర్పులో భావప్రకటనా స్వేచ్ఛ ముఖ్యం అనే అభిప్రాయాన్ని ఆగస్టు 31న సుప్రీంకోర్టు ప్రకటించడం ముదావహం. అయినప్పటికీ ప్రశాంత్‌ భూషణ్ ట్వీట్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే అని ఆగస్టు 14న ఇచ్చిన తీర్పు ఇప్పుడు శాసనంగా స్థిరపడుతుంది. విమర్శా స్వేచ్ఛ పరిమితమైందని, కోర్టు ధిక్కారం దాన్ని మించిందని సుప్రీంకోర్టు వారు న్యాయవ్యవస్థకు మరింత పటిష్ఠమైన రక్షణ కవచాన్ని నిర్మించుకున్నారు. కథలో నీతి ఏమంటే ప్రశాంత భూషణ్ వంటి పెద్దలు తమను మించిన పెద్దలను కోర్టులో నిలబెట్టి రూపాయితో బయటపడతారు. Laws are like cobwebs, which may catch small flies, but let wasps and hornets break through అని జోనాథన్ స్విఫ్ట్ అనే వ్యంగ్య రచయిత ఓ విసురు విసిరాడు. చట్టాలు సాలెగూళ్ల వంటివి. చిన్న పురుగులు స్వేచ్ఛా రెక్కలు టపటప కొట్టుకుంటూ సాలెగూడు జిగురులో చిక్కుకుంటాయి. బల్లులు తొండలు గూడునే చీల్చేస్తాయి. ఇక కొండ చిలువలు, అనకొండల గురించి చెప్పేదేముంది? పాటిస్తే చట్టం ఒక బలం, అనుసరిస్తే- సంవిధానం ఒక సంరక్షణ.

మాడభూషి శ్రీధర్

Updated Date - 2020-09-02T06:38:30+05:30 IST