చిత్తడి నేలల్లోనే సచివాలయమా?

ABN , First Publish Date - 2021-11-26T08:17:31+05:30 IST

తెలంగాణ సచివాలయాన్ని చిత్తడి నేలల్లో నిర్మిస్తున్నారా? అన్న అంశంపై నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

చిత్తడి నేలల్లోనే సచివాలయమా?

  • తెలంగాణ సెక్రటేరియట్‌ నిర్మాణంపై నివేదిక ఇవ్వండి
  • కేంద్ర పర్యావరణ శాఖకుఎన్జీటీ ఆదేశం
  • చిత్తడి నేలల్లోనే సచివాలయం నిర్మిస్తున్నారా?


న్యూఢిల్లీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సచివాలయాన్ని చిత్తడి నేలల్లో నిర్మిస్తున్నారా? అన్న అంశంపై నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టడంపై ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయాన్ని కూల్చివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్జీటీ న్యాయసభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు కె.సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కేంద్ర పర్యావరణ శాఖ తప్పదోవ పట్టిస్తోందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదించారు. 


ట్రైబ్యునల్‌లో కౌంటర్‌ దాఖలు చేయలేదన్నారు. సచివాలయాన్ని నిర్మించడానికే పాత భవనాలను కూల్చివేశారన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా.. పర్యావరణ అనుమతులు వచ్చాయని శ్రవణ్‌ చెప్పారు. పర్యావరణ అనుమతులను సవాలు చేయవచ్చు కదా? అని బెంచ్‌ పేర్కొనడంతో.. అది తమ ఉద్దేశంకాదని, సచివాలయాన్ని కూల్చవద్దంటూ పిటిషన్‌ వేశామని శ్రవణ్‌ చెప్పారు. తప్పు జరిగిందా? అన్నది తేల్చి పరిహారం విధించడం మినహా ఏమి చేయగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే చేయాలని శ్రవణ్‌ కోరారు. హుస్సేన్‌సాగర్‌ చిత్తడి నేలల పరిధిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారని, దీనికి కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని శ్రవణ్‌ వాదించారు. సచివాలయ నిర్మాణం చిత్తడి నేలల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది స్పష్టత ఇవ్వాలని కేంద్ర పర్యవరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 17కు వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-26T08:17:31+05:30 IST