బడిబస్సు భద్రమేనా?

ABN , First Publish Date - 2022-06-29T06:13:59+05:30 IST

నూతన విద్యాసంవత్సరం వారంరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రైవేటు పాఠశాలలు అయితే ఇప్పటికే పుస్తకాల అమ్మకాలు, అడ్మిషన్ల కసరత్తు ప్రారంభించాయి.

బడిబస్సు భద్రమేనా?

మూడొంతుల వాహనాలకు ఫిట్‌నెస్‌ లేదు

రెండేళ్లుగా అరకొర తనిఖీలు

కాలంచెల్లిన వాటితో నెట్టుకొస్తున్న యాజమాన్యాలు

బస్సు ఫీజు మాత్రం భారీగానే వసూలు

భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రమే

డ్రైవర్ల అర్హత పరిశీలన అవసరం

ఒంగోలు(క్రైం) జూన్‌ 22: నూతన విద్యాసంవత్సరం వారంరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రైవేటు పాఠశాలలు అయితే ఇప్పటికే పుస్తకాల అమ్మకాలు, అడ్మిషన్ల కసరత్తు ప్రారంభించాయి. వచ్చే 5 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం బడిబస్సుల విషయంలో ఎందుకో నిదానంగా వ్యవహరి స్తున్నాయి. మే 15 నుంచి ఫిట్‌నెస్‌ చేసుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో 1,426 స్కూలు బస్సులు ఉండగా ఇప్పటికి 378మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా 1,048 రాలేదు. స్కూల్‌ బస్సులు అన్నీ ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రమే విని యోగిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రైవేటు విద్యాసంస్థలు తెరిచారు. 


పట్టించుకోని రవాణా శాఖ అధికారులు 

జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, దర్శి రవాణా శాఖ కార్యాలయాల్లో బస్సులను ఫిట్‌నెస్‌ చేస్తారు. రోజుకు సరాసరిన ఒక్కో కార్యాలయంలో 5 బస్సుల చొప్పున మూడు చోట్ల 15 వాహనాలకు ఫిట్‌నెస్‌ చేసే అవకాశం ఉంది. ఇంకా పాఠశాలలు తెరిచేందుకు వారంరోజులు గడువు ఉంది. అంటే 105 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌  చేయవచ్చు. ఇప్పటివరకు స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ కోసం ముందుకు రానప్పటికీ రవాణాశాఖ  మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది. కొన్ని బస్సులు కాలంచెల్లినవి ఉన్నా వాటిని అలాగే యాజమాన్యాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల భద్రత అటు పాఠశాల యాజమాన్యాలకు కానీ, రవాణాశాఖ అధికారు లకు కానీ పట్టడం లేదు. రవాణా శాఖ మామూళ్లకు తలొగ్గి కాలం వెల్లబుచ్చుతున్నదన్న ఆరోపణలున్నాయి.


రెండేళ్లుగా అరకొర తనిఖీలు

కరోనా కాలంలో స్కూలు బస్సులు గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం అదే విధంగా తిప్పాలని  పాఠశాలల యాజమాన్యాలు భావిస్తున్నట్లు పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. వారంరోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభం కావాల్సి ఉన్నా ఇంకా ఫిట్‌నెస్‌ చేయించకపోవడమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం స్కూల్‌ బస్సులు చాలావరకు బాగాలేవు. ఒంగోలు నగరంలోని కొన్ని స్కూళ్లు మినహా మిగతాచోట్ల వాహనాలు కండిషన్‌లో లేనట్లే. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలకు అవకాశం ఇచ్చినట్లే. కాగా ఏటికేడు తల్లిదండ్రుల నుంచి బస్సు ఫీజు మాత్రం భారీగా వసూలు చేస్తూ వారిపై మాత్రం భారం మోపుతుండటం గమనార్హం.


పాటించాల్సిన నియమాలు ఇవీ..

 ప్రతి బస్సు వెనుక, ఎడమ వైపున విద్యాసంస్థ పేరు, పూర్తి చిరునామా, సెల్‌ఫోన్‌ నంబరు అందరికీ కనిపించేలా కచ్చితంగా రాయలి.

బస్సుకు అత్యవసర ద్వారం ఉండాలి. అది తెలిసే విధంగా స్పష్టంగా రాయాలి.

కిటికీలకు అద్దాలను, అడ్డంగా ఇనుప కడ్డీలను ఏర్పాటు చేయాలి.

పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు.

ఒక సహాయకుడిని కచ్చితంగా బస్సులో ఉంచాలి.

బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థుల సమాచారం ఉండాలి.

అగ్నిప్రమాద పరికరాలు, ప్రాథమిక చికిత్స కిట్‌లు ఏర్పాటు చేయాలి.

డ్రైవర్‌కు లైసెన్స్‌తోపాటు కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలి.

60 ఏళ్లకు పైబడిన డ్రైవర్లు ఉండకూడదు.

డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు చెక్‌ చేయిస్తూ ఉండాలి.

Updated Date - 2022-06-29T06:13:59+05:30 IST