పీవీ ఊరికేది ఠీవీ?

ABN , First Publish Date - 2022-06-28T07:50:22+05:30 IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ముగిసి ఏడాదైంది. మంగళవారం ఆయన 101వ జయంతి...

పీవీ ఊరికేది ఠీవీ?

వంగరను అద్భుత పర్యాటక కేంద్రం చేస్తామని హామీలు

శతజయంతి ఉత్సవాలు పూర్తై ఏడాదైనా అతీగతీ లేదు

రూ.15 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు..!

ఖజానా కటకటతో నిధుల విడుదలకు ఇబ్బంది!

నేడు పీవీ నరసింహారావు 101వ జయంతి

పీవీ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ నివాళి


భీమదేవరపల్లి, జూన్‌ 27: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ముగిసి ఏడాదైంది. మంగళవారం ఆయన 101వ జయంతి. అయినప్పటికీ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో రూ.15 కోట్లతో ప్రభుత్వం చేపడతామన్న పనుల్లో ఏవీ పూర్తి కాలేదు. చాలావరకు ప్రారంభమే కాలేదు. పంచాయతీరాజ్‌, పర్యాటక, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా చేయాలని నిర్ణయించిన ఈ పనుల పూర్తికి నిర్దిష్ట కాలపరిమితి కూడా లేకపోవడం గమనార్హం. కాగా, 7 కోట్లతో తలపెట్టిన విజ్ఞాన వేదికను కాంట్రాక్టరు రూ.3 కోట్లతో పనులు చేయగా విడుదలైంది రూ.1.25 కోట్లే. మిగతా బిల్లులకు కాంట్రాక్టరు ఎదురుచూస్తున్నారు. వంగరలో రూ.2.75 కోట్లతో పూర్తిచేసిన సీసీ రోడ్ల నిర్మాణంలోనూ రూ.1.30 కోట్లే విడుదలయ్యాయి. పీవీ 1921 జూన్‌ 28న జన్మించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత సంవత్సరం శత జయంతి ఉత్సవాలను తలపెట్టింది. దీనికిముందే.. వంగరలో అభివృద్ధి కార్యక్రమాలపై 2020 సెప్టెంబరు 2న మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ గ్రామానికి వచ్చి పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుటుంబ సభ్యులు, స్థానికులతో చర్చించారు. అదే ఏడాది అక్టోబరులో అభివృద్ధి పనులను చేపడుతామని స్వయంగా మంత్రి పేర్కొన్నారు. కాగా, పీవీ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడంతో పాటు వంగరలో పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఒక్కసారి కూడా వంగరకు రాలేదు.




ఆధునిక భారత నిర్మాత పీవీ 

జయంతి సందర్భంగా కేసీఆర్‌ నివాళులు


హైదరాబాద్‌: క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం పీవీ జయంతి నేపథ్యంలో కేసీఆర్‌ నివాళులర్పించారు. పీవీ చేపట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాక.. అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రతల్లో గుణాత్మక  ప్రగతి సాధించిందని కొనియాడారు. వినూత్న విధానాలను అనుసరించి, దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి... తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకుసాగుతామని కేసీఆర్‌ తెలిపారు.


మంత్రి సమీక్ష.. పనుల పూర్తికి ఒత్తిడి

హనుమకొండ జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై గత వారం మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా వంగర గురించి ఆయన ప్రస్తావించారు. తాను హామీలిచ్చి ఏడాదిన్నరైందని గుర్తుచేస్తూ, పనులు పూర్తిపై దృష్టిపెట్టాలని అధికారులను కోరారు. అధికారులు మాత్రం నిధులు రానిది తామేమీ చేయలేమని, ఇప్పటికే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా కటకట నేపథ్యంలోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.


ఇవి ముందుకు కదిలితే ఒట్టు..

హుస్నాబాద్‌-హనుమకొండ ప్రధాన రహదారిపై ఉన్న సమ్మక్కగుట్ట నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని పీవీ ఇంటి వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం, సమ్మక్క గుట్ట వద్దనే వంగర వెళ్లే ప్రధాన రహదారిపై పీవీ ఆర్చి గేట్‌ నిర్మాణం, పీవీ కుటుంబ పెద్దలు నిర్మించిన శివాలయం అభివృద్ధి, వంగర పెద్ద చెరువు, గుడికి మధ్య సస్పెన్షన్‌ బ్రిడ్జి, గురుకుల పాఠశాల ఎదురుగా పీవీ పార్కు నిర్మాణం, పీవీ నివాసాన్ని మ్యూజియంగా మార్చడం, వంగర చుట్టుపక్కల గ్రామాలకు తారు రోడ్డు సౌకర్యం వంటి పనుల్లో కదలిక లేదు.


‘‘దక్షిణ భారతం నుంచి దేశ ప్రధానిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి పీవీ. ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఇతర జాతీయ పార్టీలు సరైన గుర్తింపు ఇవ్వలేదు. తెలుగోడు.. తెలంగాణలో జన్మించిన పీవీకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చే విధంగా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఘన నివాళులర్పిస్తాం. పీవీ జన్మస్థలమైన వంగరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. అప్పుడే పీవీకి నిజమైన నివాళి..’’ 

- ఇదీ సీఎం కేసీఆర్‌ ప్రకటన.


‘‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ ఠీవి. ఆయన జన్మించిన వంగర గ్రామాన్ని దేశం గర్వపడేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. భావి తరాలకు పీవీ జీవిత చరిత్ర తెలిసేలా మ్యూజియం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వంగర వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు అభివృద్ధికి ప్రణాళికల నివేదికలు అందజేసి నిధుల మంజూరుకు కృషి చేస్తాం..’’ 

- ఇవీ ప్రభుత్వం తరఫున పీవీ శతజయంతి సంవత్సరం సందర్భంగా రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఇచ్చిన హామీలు.


అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వంగరలో ప్రకటించిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు  పనులు చేపడితే అందరం సంతోషిస్తాం.

-పీవీ సోదరుడి కుమారుడు మదన్‌మోహన్‌రావు

Updated Date - 2022-06-28T07:50:22+05:30 IST