ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా?

ABN , First Publish Date - 2022-06-30T06:05:53+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రణాళికలకే పరిమితమైంది. పాఠశాలల పునఃప్రారంభంలోపే ఈ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఆ అంచనాలను అధికారులు అందుకోలేకపోతున్నారు.

ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా?
గుడిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంపికైన పాఠశాలలు 1,092

నిధులు మంజూరైంది 356 బడులకే

పనులు చేసేందుకు సర్పంచ్‌లు, చైర్మన్ల విముఖత


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రణాళికలకే పరిమితమైంది. పాఠశాలల పునఃప్రారంభంలోపే ఈ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఆ అంచనాలను అధికారులు అందుకోలేకపోతున్నారు. నిధుల విడుదలలో జాప్యం, పను లు చేపడితే బిల్లులు మంజూరవుతాయో? లేదో? అన్న సందేహం తో సర్పంచ్‌లు, ఎస్‌ఎంసీ చైర్మన్లు ముందుకు రావడంలేదు. పను లు చేపట్టేందుకు జారీ చేసిన జీవోల్లో ఉన్న ఇబ్బందులు పనులకు అడ్డంకిగా మారాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. 



పాఠశాలల పునఃప్రారంభంలోపే ‘మనఊరు-మనబడి’, ‘మనబస్తీ-మనబడి’ కార్యక్రమాల్లో మొదటి దశకింద ఎంపికైన స్కూళ్లలో గుర్తించిన 12రకాల పనులను పూర్తి చేయా ల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తరగతులు ప్రారంభమైనా పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులకు మౌలిక వసతులు అందకపోగా, అ ప్పటికే చేపట్టిన పనులకు సైతం ఆటంకం ఏర్పడుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,145 ప్రభుత్వ పాఠశాలలు ఉండ గా 1,092 పాఠశాలలను మొదటి విడతగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. వీటిలో పనుల అంచనాలు పూర్తయినవి 1,069 కాగా, రివాల్వింగ్‌ ఫండ్‌ మంజూరైన పాఠశాలల సంఖ్య 356 మాత్రమే. రివాల్వింగ్‌ ఫండ్‌ కింద చేపట్టాల్సిన పనులు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. రూ.30లక్షల కంటే అధిక వ్యయంతో సివిల్‌ పనులను చేపట్టాల్సి వస్తే అక్కడ టెండర్‌ ప్రక్రియ ద్వారా పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో అవి ఇంకా ప్రారంభంకాలేదు. దీంతో పాఠశాలలు ప్రారంభమైనా పనులు నత్తనడకన సాగుతున్నాయి. 


యాజమాన్య కమిటీ ద్వారా చేపట్టాల్సిన పనులు

విద్యుద్దీకరణ, తాగునీటి వసతి, శిథిలావస్థకు చేరిన గదు ల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, డైనింగ్‌హాల్‌, పెద్ద, చిన్నతరహా మరమ్మతులు. 


ఉపాధి హామీ కింద..

 నీటివసతితో మరుగుదొడ్లు, ప్రహరీలు,వంటగదుల నిర్మాణం


విద్యాశాఖ నేరుగా చేపట్టే పనులు..

ఫర్నిచర్‌, పెయింటింగ్‌, ఆకుపచ్చ బోర్డుల ఏర్పాటు, డిజిటల్‌ తరగతుల ఏర్పాటు. 


ఆలస్యానికి కారణాలు

‘మన ఊరు-మనబడి’ కోసం పాఠశాలస్థాయిలో ప్రభుత్వ నిధులు జమ, ఖర్చుకోసం ఒక ఖాతా, విరాళాల జమ, ఖర్చుకోసం మరో ఖాతా తెరవాలని ప్రభుత్వం సూచించిం ది. ‘మన ఊరు-మనబడి’ ఖాతాను నిర్వహణ కమిటీ చైర్మన్‌, ప్రధానోపాధ్యాయుడు, సహ ఇంజనీర్‌, సర్పంచ్‌, మునిసిపాలిటీల్లో చైర్మన్‌ సంయుక్తంగా నిర్వహించాలని మొదట సూచించారు. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయుడు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఇద్దరే చాలని మంత్రివర్గ ఉపసంఘం పేరుతో మరో సందేశం వచ్చింది. ఈ గందరగోళంతో చాలాచోట్ల ఖాతాలు తెరవలేదు. ప్రతీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘాల నుంచి ఇద్దరు క్రియాశీల సభ్యులు, సర్పంచ్‌, ఇద్దరు ఎస్‌ఎం సీ సభ్యులు, ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో కమిటీ ఏర్పాటు చేసి మరో బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంది. చాలాచోట్ల ఈ కమిటీలు ఏర్పాటు కాలేదు. కొన్నిచోట్ల అంచనాలు రూపొందించడంలో తప్పులు దొర్లుతున్నాయి. 


దాతల స్పందన అంతంతే

కార్యక్రమానికి రూ.2లక్షలు విరాళంగా ఇస్తే విద్యా కమిటీ లో సభ్యుడి హోదా, రూ.10లక్షల విరాళం ఇస్తే అదనపు తరగతి గదికి దాత సూచించిన పేరు, రూ.1కోటి ఇస్తే పాఠశాలకు దాత సూచించిన పేరు పెడతామని ప్రభుత్వం స్పష్టంచేసింది. దాతలు తాము కోరుకున్న సహాయం చేసే వీలు లేకుండా సూచించిన 12 పనులు చేపట్టేందుకు విరాళాలు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉండడంతో వారు ఆసక్తి చూపడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  


పనులు చేపట్టేందుకు ఆందోళన

మనబడి పనులను విద్యాకమిటీ చైర్మన్‌ పూర్తి చేయాల్సి ఉంది. అయితే వీరి వద్ద ఆమేరకు పెట్టుబడులు లేకపోవడంతో సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోతే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో సర్పంచ్‌లు ఉన్నారు. ధైర్యంతో పనులు పూర్తి చేసినా చివరి నిమిషంలో చెక్‌ పవర్‌ ఉన్న ఎస్‌ఎంసీ చైర్మన్‌ తిరుగుబాటు చేస్తే ఎలా అని కొందరు సర్పంచ్‌లు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. కొంతమంది సర్పంచ్‌లు పనుల అగ్రిమెంట్‌కు సంబంధించి ఎస్‌ఎంసీ చైర్మన్లతో బాండు పేపర్లు రాయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో నిధులు జమకావడం దశలవారీగా జరుగుతోంది. దీంతో జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ముందుగా నిధులు పడిన పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో విద్యుత్‌కు సంబంధించిన పనులు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రారంభమయ్యాయి. 

 

కొత్త గదుల నిర్మాణాలకు అంచనాలు 

శిథిలావస్థకు చేరిన గదులకు బదులు కొత్త గదుల నిర్మాణాలకు అంచనాలు రూపొందించమని ఆదేశించగా కొందరు అదనపు తరగతుల నిర్మాణాన్ని అంచనాల్లో చేర్చారు. దీంతో సవరించి పంపాలని తిప్పి పంపారు. పాత గదులను కూలగొట్ట వద్దంటూ మొదట పేర్కొన్నారు. ఆ తర్వాత శిథిలావస్థకు చేరిన గదులను కూల్చివేయొచ్చంటూ సవరణలు చేయడంతో క్రమంగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్‌ నిర్మాణాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అంచనాలు రూపొందించారు. తర్వాత ఒక్కో పాఠశాలకు రూ.14లక్షలతో ఒకే డైనింగ్‌ షెడ్‌కు అంచనాలు రూపొందించమని ప్రభుత్వం ఆదేశించడంతో మళ్లీ అంచనాలు రూపొందించాల్సి వచ్చింది. పంపిన అంచనాలు సరైనవా, కావా తేల్చేందుకు ఎంఈవో, స్పెషల్‌ ఆఫీసర్‌, ఇంజనీర్లు ఫీల్డ్‌ లెవల్‌లో పరిశీలించాలని చెప్పడంతో ప్రక్రియ ఆలస్యమైంది. అంచనాల నుంచి అనుమతి, నిధుల బదిలీ ఆదేశాల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. ఈ ప్రక్రియ విద్యాశాఖకు కొత్త కావడం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి రావడం జాప్యానికి కారణమవుతోంది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు వంటగదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయి. చాలాచోట్ల ఈ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. 


నిధుల విడుదలకు ఇబ్బంది ఉండదు : బి.భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి, నల్లగొండ

‘మన ఊరు-మనబడి’, ‘మనబస్తీ-మన బడి’ పనులకు నిధులు విడుదలకావన్న సమస్యే ఉండదు. ఈ పథకానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి, ఇతర పథకాల నుంచి ముందే కోత విధించి ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకున్నారు. జిల్లాలో అంచనాలు రూపొందించిన పాఠశాలలకు 10 నుంచి 15 శాతం నిధులు కలెక్టర్‌ ద్వారా విడుదలవుతున్నాయి. ప్రతీ నియోజకవర్గానికి రూ.1.50కోట్ల నుంచి రూ.2కోట్ల వరకు మంజూరవుతాయి. నల్లగొండ జిల్లాలో రూ.13కోట్ల వరకు నిధులు విడుదలకానున్నాయి.   



జిల్లా మొత్తం మొదటి దశకు అంచనాలు రివాల్వింగ్‌ ఫండ్‌ 

పాఠశాలలు ఎంపికైనవి పూర్తయినవి మంజూరైనవి

నల్లగొండ 1,483 517 503 131

సూర్యాపేట 950 329 326 125

యాదాద్రి 712 246 240 100

మొత్తం 3,145 1,092 1,069 356


నేటికీ ప్రారంభంకాని పనులు 

పెద్దఅడిశర్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నూ  తన హంగులతో తీర్చిదిద్దాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ ఇప్పటివరకు పాఠశాలల్లో ఎలాం టి పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా కన్పించడంలేదు. పెద్దఅడిశర్ల మండలంలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడంలేదు. మండలంలో మొత్తం  55 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో తొలివిడతలో అభివృద్ధి చేయడానికి శిథిలావస్థలో ఉండి కనీస వసతులు లేని 18 పాఠశాలలను ఎంపిక చేఏశారు. వీటిలో నాలుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కడ పనులు ప్రారంభం కాలేదు.


త్వరలోనే పనులు ప్రారంభిస్తాం : తరి రాములు, ఎంఈవో

మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం లో భాగంగా 18 పాఠశాలలు ఎంపికయ్యాయి. డబ్బు లు ఖాతాలో జమ కాలేదు. త్వరలోనే పనులు మొద లు పెడతాం. 

Updated Date - 2022-06-30T06:05:53+05:30 IST