మంచి సమయం మించిపోయిందా?

ABN , First Publish Date - 2020-03-20T08:39:04+05:30 IST

అవిసమగ్రమైన చర్యలు కాకపోవచ్చు కానీ, భారత దేశం కరోనా వైరస్‌ విషయంలో సహేతుకంగా మంచి కృషే చేసింది. ఎయిర్‌పోర్టుల్లో స్ర్కీనింగ్‌ కావచ్చు, క్వారంటైన్‌ కావచ్చు, ప్రజలకు...

మంచి సమయం మించిపోయిందా?

కరోనా నివారణకు వ్యాక్సిన్‌ లేనందున సామూహిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపడమే మనం చేయగలిగింది. మానవాళికి, వైరస్‌కు మధ్యన పరుగు పందెంలా ఉంటుందిది. ఈ పరుగులో మానవాళి బాగా వెనుకపడింది. టీకా అనేది దాదాపు ఏడాది దూరంలో వెలుగు రేఖలా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో నిర్ధారణ పరీక్షల ద్వారానే కరోనాను కట్టడి చేయగలం. మరి, భారత దేశంలో ఎందుకు ఎక్కువ మందికి పరీక్షలు జరపడం లేదు? 


అవిసమగ్రమైన చర్యలు కాకపోవచ్చు కానీ, భారత దేశం కరోనా వైరస్‌ విషయంలో సహేతుకంగా మంచి కృషే చేసింది. ఎయిర్‌పోర్టుల్లో స్ర్కీనింగ్‌ కావచ్చు, క్వారంటైన్‌ కావచ్చు, ప్రజలకు అవగాహన కల్పించడం కావచ్చు, వైరస్‌ సోకిన వారి గుర్తింపు కావచ్చు..  ఇలా ఏ విషయంలోనైనా చెప్పుకోదగిన చర్యలు చేపట్టింది. చేయాల్సినదంతా చేస్తోంది. అయినా, కరోనా సామూహికంగా వ్యాప్తి చెందితే, దేశం నియంత్రించలేనన్ని కేసులు విస్ఫోటనంలా పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటువంటిది జరగొద్దని కోరుకుందాం. కానీ, వ్యాధి నిర్ధారణకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వైరస్‌ విస్తరించే   ప్రమాద ముంది. ఈ సౌకర్యాలను పెంచడంలో ‘నిదానం’ ఎందుకో అర్థం కావడం లేదు. వనరులు లేక పోవడమా, చేస్తున్నది సరిపోతుందన్న భావనా, లేక కరోనా కేసుల సంఖ్యను కృత్రిమంగా తక్కువ చేసి చూపడంలో భాగమా?.. ఈ అన్నీ కూడా కారణాలే కావచ్చు. 


ఐసీయూల్లో చేరిన శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల్లో 500 మందికి ‘ర్యాండమ్‌’గా టెస్టులు జరిపితే కరోనా లేనట్లు తేలిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. ఈ కారణంగా కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ నిర్ధారణ పరీక్షలు జరప నిరాకరించడాన్ని సమర్థించుకోలేం. నా స్నేహితుడొకాయన తనకు కరోనా లక్షణాలున్నాయని భావించి ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు రోజంతా ఫోన్‌ చేయగా చేయగా చివరాఖరికి లైన్‌ కలిసింది. రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రికి వెళ్లండి అని చెప్పారు. తీరా అక్కడికెళితే ‘ట్రావెల్‌ హిస్టరీ’ లేకపోవడం, అంటే విదేశాల్లో పర్యటించకపోవడం, పర్యటించిన వారితో సంబంధాలు లేవన్న కారణంతో ఆయనకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనిరాకరించారు. ఆయన ఒక్కడినే కాదు, చాలామందిని ఇలాగే వాపసు పంపించారు. వీరిలో ఏ ఒక్కరు కరోనా సోకిన వారున్నా కూడా ఏమవుతుంది? తనకు వ్యాధి లేదన్న ధీమాతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వారు వైరస్‌ వ్యాప్తికి దోహదం చేసే ప్రమాదముంది. 


కరోనా రోగులు విపరీతంగా పెరుగుతోన్న చాలా దేశాలు ఇలాంటి తప్పిదమే చేశాయి. ఇరాన్‌తో సరిహద్దు కలిగిన టర్కీలో ఇప్పటి వరకూ కేవలం రెండు కేసులే నమోదయ్యాయంటే, వారు ‘అనుమానితుల’కు నిర్ధారణ పరీక్షలు జరపడంలో క్రియాశీలంగా వ్యవహరించడమే కారణం. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లనే అమెరికాలోనూ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. (భారత దేశం టర్కీ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించింది కానీ, అమెరికా నుంచి వస్తున్న వారిపై నిషేధం లేకపోవడం ఆశ్చర్యకరం).


వ్యాధి నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా కొనసాగిస్తున్న దేశాలు, ప్రాంతాలే కరోనా వ్యాప్తిని కట్టడి చేసి, కేసులను తగ్గించగలిగాయి. ఇలా టెస్టుల నిర్వహణలో క్రియాశీలంగా ఉన్న దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, జపాన్‌, హాంగ్‌కాంగ్‌లు, కరోనా సోకిన వారికి చికిత్సలు అందించేందుకు అవసరమైన డాక్టర్లు, వైద్య సిబ్బంది, క్వారంటైన్‌, తదితర సర్వ సౌకర్యాలను కూడా సిద్ధంగా ఉంచాయి. 


చాలా కేసుల్లో వ్యాధి లక్షణాలు కనిపించక పోవడం వల్ల ముందస్తు సామూహిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రాథమిక దశలో జరిపే నిర్ధారణ పరీక్షల వల్లనే కరోనాను కట్టడి చేసే అవకాశం లభిస్తుంది. వైరస్‌ వ్యాప్తిని నివారించగలిగిన దేశాలకు, పరీక్షలు చేస్తున్నా కూడా నివారించలేకపోతున్న దేశాలకు ఈ విషయంలోనే తేడా ఉంది. వ్యాధిగ్రస్తులను గుర్తించలేకపోవడం  వల్ల పిల్లలు, వృద్ధులు వంటి దుర్భలురకు కరోనా  సులభంగా సోకుతోంది. దక్షిణ కొరియాలో జరుపుతున్న సామూహిక పరీక్షల్లో తేలిన విషయమేమిటంటే, కరోనా సోకిన చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి, లేదా అసలు కనిపించడమే లేదు. ఇటువంటి వారిని గుర్తించి ఒంటరిగా (ఐసొలేషన్‌లో) ఉంచడం వల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమే కాదు, మరణాల సంఖ్యను కూడా తగ్గించగలుగుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించని పేషెంట్లను గుర్తించి ‘ఐసొలేషన్‌’లో పెట్టడం అనేది ఇటలీలో కూడా మంచి ఫలితాలను ఇస్తోంది. ‘వో’ అనే పట్టణంలోని మొత్తం 3,300 మందికి రెండు సార్లు సామూహికంగా నిర్ధారణ పరీక్షలు జరపారు. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి ‘ఐసొలేషన్‌’లో పెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో కరోనా వ్యాప్తిని ఆపగలిగారు. కొత్తగా ఎవరికీ సోకడం లేదని తేలింది. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి కూడా పూర్తి స్థాయి నిర్ధారణ పరీక్షలు జరపడానికి భారత దేశం నిరాకరిస్తుండగా,  అటువంటి లక్షణాలు లేని వారికి సైతం దక్షిణ కొరియా పరీక్షలు నిర్వహిస్తుండడం గమనార్హం. 


కరోనా నివారణకు వ్యాక్సిన్‌ లేనందున సామూహిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపడమే మనం చేయగలిగింది. మానవాళికి, వైరస్‌కు మధ్యన పరుగు పందెంలా ఉంటుందిది. ఈ పరుగులో మానవాళి బాగా వెనుకపడింది. టీకా అనేది దాదాపు ఏడాది దూరంలో వెలుగు రేఖలా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో నిర్ధారణ పరీక్షల ద్వారానే కరోనాను కట్టడి చేయగలం. మరి, భారత దేశంలో ఎందుకు ఎక్కువ మందికి పరీక్షలు జరపడం లేదు? అంత శక్తి లేకపోవడమైతే కారణం కాదు, అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపిన సమాచారం ప్రకారం భారత్‌కు రోజుకు 8,000 శాంపిల్స్‌ను పరీక్షించగల సామర్థ్యం ఉంది. కానీ, మార్చి 18 నాటికి రోజుకు కేవలం 90 శాంపిల్స్‌ను మాత్రమే పరీక్షించింది. ఇప్పటి వరకూ నాలుగు మరణాలు సంభవించిన ప్రస్తుత సమయంలో ఈ సంఖ్య ఇంకా పెరుగనున్నట్లు, వైరస్‌ విజృంభించే ప్రమాదం కనిపిస్తున్న నేపథ్యంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో జరపకపోవడం విచిత్రమే.


కరోనా మరణాలకు కేంద్రం రూ. 4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దేశంలో ఇది విలయం సృష్టించనుందన్న ఆందోళన ఉంది కాబట్టే భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందని అర్థమవుతోంది కదా! మరయితే, సామూహిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపడానికి అయిష్టత చూపుతోంది ఎందుకు? మోదీ ప్రభుత్వం, పది లక్షల వ్యాధి నిర్ధారక కిట్‌ల కొనుగోలుకు జర్మనీకి ఆర్డరిచ్చింది. మరో పక్క ఐసీఎంఆర్‌ ఈ పరీక్షలను నిదానంగా పెంచుతోంది. ఈ వారంలో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామమిది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తోందని తెలిసిన ఫిబ్రవరిలో లేదా కేరళలోని ఒకటి రెండు కేసులతోనే ఆగదనీ, మన దేశంలోనూ విస్తరిస్తుందని అర్థమైన మార్చి మొదటి వారంలో కానీ ఈ చర్యలు తీసుకుంటే బావుండేది. దక్షిణ కొరియా, సింగపూర్‌, తైవాన్‌, టర్కీ దేశాలు బాటలోనే మనమూ ఆ కీలకమైన సమయంలో సామూహిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉంటే కరోనా మహమ్మారి కట్టడి అయ్యేది. కానీ, ఆ సమయం మించిపోయింది. ఈ విధంగా సరైన సమయంలో సత్వర పరీక్షలు నిర్వహించనందునే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌ ఈ వైఖరికి కారణం ఏంటనే అంశంపై ఆ దేశ మీడియా పరిశోధనలు చేసింది. కానీ, మన దేశంలో మీడియా అలాంటి  పరిశీలనలు ఏమీ చేయలేక పోయింది. నిర్ధారణ పరీక్షలు చేయకుండా నిధులు విడుదల చేయడం ద్వారానూ, ‘డేటా’ను గోప్యంగా ఉంచడంవల్లనూ కరోనాను అధిగమించగలమని ప్రభుత్వం భావిస్తోంది కాబోలు. దేశంలో రైతు ఆత్మహత్యల వివరాలు, వినియోగదారుల వ్యయ సమర్ధతనూ దాచినట్టుగా, కరువు అనే పదాన్ని వాడకుండా అది సంభవించనే లేదని చెప్పినట్టుగా ఇదీ అంతే కావచ్చు. ఖండించడమనేదే వ్యూహమైతే, త్వరలోనే ఘోరమైన షాక్‌కు గురవుతాం. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదని ఆశిద్దాం.

శివమ్‌ విజ్‌

(ద ప్రింట్‌)

Updated Date - 2020-03-20T08:39:04+05:30 IST