ఫ్యాన్సీ నెంబరు ఇకపై సామాన్యుడికి అందని ద్రాక్షేనా?

ABN , First Publish Date - 2022-06-17T06:03:21+05:30 IST

ఫ్యాన్సీ నెంబరు అనేది ఇకపై సామాన్యుడికి అందని ద్రాక్షలా మారనుంది.

ఫ్యాన్సీ నెంబరు ఇకపై సామాన్యుడికి అందని ద్రాక్షేనా?

డిపాజిట్‌ అమౌంట్‌ను భారీగా పెంచిన రవాణాశాఖ

రూ.50వేలది ఇకపై రూ.2లక్షలు 


తిరుపతి(రవాణా), జూన్‌ 16: ఫ్యాన్సీ నెంబరు అనేది ఇకపై సామాన్యుడికి అందని ద్రాక్షలా మారనుందా? పెరిగిన ధరలను చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. సాధారణంగా కొత్త బైక్‌, కార్లు కొనుగోలు చేసినవారు తమ సెంటిమెంటుకు అనుగుణంగా కావాల్సిన నెంబర్ల కోసం ఆన్‌లైన్‌లో రూ.2వేల నుంచి రూ.50వేల వరకు చెల్లించి పొందుతుంటారు. సామాన్యులు సైతం బైక్‌లకు రూ.2వేలు చెల్లించి తమకు నచ్చిన నెంబర్లను ఎంపిక చేసుకుంటుంటారు. 9999 నెంబరు కావాలంటే గతంలో రూ.50వేలు చెల్లించాలి. ఎవరూ బిడ్‌కు రాని పక్షంలో వారికి ఆ నెంబరు సొంతమవుతుంది. ప్రస్తుతం 9999 నెంబరు కావాలంటే రూ.2లక్షలు చెల్లించి బిడ్‌కు వెళ్లాల్సిందే. ఆన్‌లైన్‌లో పోటీకి ఎవరూ రాకుంటే రూ.2లక్షలతోనే నెంబరు సొంతమవుతుంది. పోటీకి వస్తే మాత్రం రూ.2లక్షలు కాస్తా మరిన్ని లక్షలకు చేరే అవకాశం ఉంది. ఇదివరకు రూ.2వేల నుంచి రూ.50వేల వరకు రూ.2, 10, 20, 30, 50 వేల సరళిలో మాత్రమే ఫ్యాన్సీ నెంబర్ల కోసం వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.2లక్షల వరకు పెంచేశారు. అలాగే సరళిని కూడా రూ.2, 5, 10, 15, 20, 30, 50, లక్ష, రెండు లక్షలుగా మారుస్తూ.. రవాణాశాఖ జీవో జారీ చేసింది. దీనివల్ల సామాన్యులు ఇకపై ఫ్యాన్సీనెంబర్లకు పోటీపడే అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. 


ఉన్నత శ్రేణికే ఈ నెంబర్లు 

9999 ఫ్యాన్సీ నెంబరుకు రూ.2లక్షలు, 1, 9, 999 నెంబర్లకు రూ.లక్ష, 3333, 4444, 5555, 6666, 7777 నెంబర్లకు రూ.50వేలు చెల్లించి బిడ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. 

రవాణాశాఖ సూచించిన మరిన్ని ఇతర ఫ్యాన్సీ నెంబర్ల కోసం రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు, రూ.2వేలను ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

Updated Date - 2022-06-17T06:03:21+05:30 IST