రెబ్బెన మండలంవాసుల ‘డబుల్‌’ కల నెరవేరేనా?

ABN , First Publish Date - 2022-05-09T04:23:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ముం దుకు కదలడం లేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం పేద ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తుండగా మండలంలో ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా పునాది పడలేదు.

రెబ్బెన మండలంవాసుల ‘డబుల్‌’ కల నెరవేరేనా?
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు అధికారులు కేటాయించిన స్థలం

- తప్పని ఎదురు చూపులు

- ముందుకు కదలని ఇళ్ల నిర్మాణాలు

రెబ్బెన, మే 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ముం దుకు కదలడం లేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం పేద ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తుండగా మండలంలో ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా పునాది పడలేదు. పథకాన్ని ప్రారంభించి సంవత్స రాలు గడుస్తున్నా ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరగక పోవడం శోచనీయం. మండలంలోని కేవలం రెండు గ్రామ పంచాయతీలకు మాత్రమే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేసినా నిర్మాణానికి నోచుకో లేదు. వాటిలో ఒక పంచాయతీలో పనులు ప్రారంభిం చారు. అయితే ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించిన స్థలం వివాదంలో ఉండడంతో నిర్మాణాలు నిలిచి పోయాయి. ఇక మిగిలిన పంచాయతీలో ఇళ్ల నిర్మా ణాలకు అసలు భూమిని కూడా కేటాయించలేదు. దీంతో మండలంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మా ణాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. 

నిలిచి పోయిన పనులు

పాత గ్రామ పంచాయతీల ప్రకారం మండలంలో 12గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో కేవలం రెబ్బెన, కొండపల్లి పంచాయతీలకు మాత్రమే అప్పట్లో ప్రభుత్వం 70డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేసింది. రెబ్బెన పంచాయతీకి 40ఇళ్లు, కొండపల్లికి 30ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో రెవెన్యూ అధి కారులు రెబ్బెన పంచాయతీకి మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరానగర్‌ సమీపంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ఆనుకుని 2.26ఎకరాల భూమిని కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేం దుకు కాంట్రాక్టర్‌ పిల్లర్ల కోసం గుంతలు సైతం తవ్వారు. కానీ అధికారులు కేటాయించిన స్థలం తమకు చెందిందంటూ ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచి పోయాయి. పనులు నిలిపి వేసి సంవత్సరాలు గడుస్తున్నా వివాదాస్పద స్థలంపై అధికారులు ఎటూ తేల్చడం లేదు.

నేటికీ స్థలం కేటాయించని అధికారులు

కొండల్లి పంచాయతీ పరిధిలోని నేర్పల్లికి మంజూరైన ఇళ్ల నిర్మాణాల కోసం రెవెన్యూ అధికారులు నేటి వరకు స్థలాన్ని కేటాయించ లేదు. బుద్దానగర్‌ సమీ పంలో ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాన్ని ప్రతిపాధించగా అది సైతం కోర్టు పరిధిలో ఉన్నట్లు సమాచారం. స్థలం అందుబాటులో లేని కారణంగా మంజూరైన ఇళ్లు నేటికీ నిర్మాణానికి నోచుకోకుండా పోయాయి. ప్రభుత్వ స్థలం ఉన్నా రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపి స్తున్నారు.

అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

- జి తిరుపతి, బీజేపీ మండలాధ్యక్షుడు 

మండలంలో నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి హామీ ఇచ్చి సంవత్స రాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడ కూడా నిర్మించక పోవడం విచా రకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించి మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

కోర్టు పరిధిలో ఉంది

- రియాజ్‌ అలీ, తహసీల్దార్‌

మండలానికి మంజూరైన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలకు కేటాయించిన స్థలం వివాదంలో ఉన్న కారణంగా పనులు నిలిచి పోయాయి. స్థల వివాదం కోర్టు పరిధిలో ఉంది. నేర్పల్లి కోసం కేటాయించిన స్థలం సైతం కోర్టులోనే ఉన్నట్లు సమాచారం. దీంతో ఇళ్ల నిర్మాణాలు సాగడం లేదు. సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించాం.

Read more