పంపిణీ పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2020-08-10T09:11:02+05:30 IST

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రేషన్‌ కార్డుల ద్వారా నిత్యావసరాలు చౌకగా పంపిణీ చేస్తున్నారు

పంపిణీ పూర్తయ్యేనా?

అర్హులు 65,122 మంది

అందిన కార్డులు 39,169

పరిష్కారం కానివి 25,953


కర్నూలు, ఆంధ్రజ్యోతి:  దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రేషన్‌ కార్డుల ద్వారా నిత్యావసరాలు చౌకగా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రేషన్‌ కార్డుల స్థానే బియ్యం కార్డులను జారీ చేస్తోంది. వివిధ రకాల పథకాలకు రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది. రేషన్‌ కార్డులు ఉన్నవారు జిల్లాలో 11,91,344 మంది ఉన్నారు. అర్హత ఉండి కార్డులేని వారు కొత్తగా నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం జూన్‌లో అవకాశం కల్పించింది.


ఈ నేపథ్యంలో అనేక మంది బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 65,122 మందిని అర్హులుగా గుర్తించారు. వారిలో 39,169 మందికి మాత్రమే కార్డులు జారీచేశారు. మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.


ఐదు రకాల సేవలు

బియ్యం కార్డుల ద్వారా ఐదు రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తోంది. అర్హులైన వారికి కొత్తగా కార్డును అందించడం, ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా చేర్చడం, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారికి కార్డులు ఇవ్వడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, కార్డు వద్దనుకుంటే రద్దుచేయడం వంటి సేవలను ప్రభుత్వం అందజేస్తోంది. వీటి కోసం జిల్లాలో ఇంతవరకు 78,832 దరఖాస్తులు నమోదయ్యాయి.


వీటి పరిశీలన అనంతరం 65,122 దరఖాస్తులు అర్హత సాధించగా, 6,344 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అర్హత సాధించి వాటిలో 5 వేలకు పైగా కార్డులు వివిధ కారణాలతో ముద్రణకు నోచుకోలేదు. 


వలంటీర్ల ద్వారా పంపిణీ

జిల్లాలో లబ్ధిదారులకు బియ్యం కార్డులను పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం జిల్లా పౌర సరఫరాల శాఖకు అప్పజెప్పింది. ఆ శాఖ అధికారులు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కొత్తగా మంజూరైన కార్డులను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. లబ్ధిదారులకు వాటిని అందజేసిన తర్వాత వారి వేలిముద్రలను ఆ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 39,169 కార్డులను పంపిణీ చేయగా ఇంకా 25,953 కార్డులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. 

Updated Date - 2020-08-10T09:11:02+05:30 IST