నిషేధం అమలయ్యేనా?

ABN , First Publish Date - 2022-06-28T04:51:03+05:30 IST

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, పర్యవేక్షణ లోపం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇది సాధ్యపడటం లేదు.

నిషేధం అమలయ్యేనా?
పాలమూరులో ప్లాస్టిక్‌ కవర్లలో వస్తువులు తీసుకెళ్తున్న వ్యక్తులు

వచ్చే నెల ఒకటి నుంచి 16 రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం

పురపాలికల్లో కనిపించని ప్రచారం

వాడొద్దని ఏళ్ల తరబడి చెబుతున్నా కానరాని మార్పు

దుకాణదారులకు నోటీసులు జారీ చేస్తున్న పుర సిబ్బంది


పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, పర్యవేక్షణ లోపం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇది సాధ్యపడటం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒకసారి వాడి పారేసే 16 రకాల ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. జూలై ఒకటి నుంచే ఈ నిషేధం అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం 75 మైక్రాన్‌ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం ఉండగా, ఇకపై 120 మైక్రాన్‌ల మందం గల ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించడంతో సాధ్యమయ్యేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- మహబూబ్‌నగర్‌


మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై ఇది వరకు చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇవ్వకపోవడంతో కేంద్రం ఇటీవల చేసిన ఆదేశాల అమలుపై సందిగ్ధం నెలకొంది. ఒకసారి వాడి పారేసే వివిధ రకాల వస్తువులను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ విషయమై ఇది వరకే ఉత్తర్వులు అందాయి. పాలమూరు పురపాలిక పరిధిలో ఈ నెల 24 నుంచి వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ఓ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలపై ఎలాంటి ప్రచారం చేయకపోవడం గమనార్హం. ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏ కార్యక్రమం చేపట్టినా విజయం సాధించలేమన్న విషయం తెలిసినా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విచారకరం. పాలమూరు పురపాలికలో 106 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, అందులో 15 నుంచి 20 టన్నుల వరకు ప్లాస్టిక్‌ ఉండటం విశేషం.


16 రకాల వస్తువులివే..

మార్కెట్‌లో ప్రస్తుతం ప్రతీ వస్తువు ప్లాస్టిక్‌తో ముడిపడి ఉన్నాయి. క్యారీ బ్యాగ్స్‌, ఇయర్‌ బడ్స్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ ఫోర్క్‌, ఐస్‌క్రీమ్‌ స్పూన్స్‌, స్ట్రాలు, బెలూన్స్‌, ప్లాస్టిక్‌ ఫ్లాగ్స్‌, 100 మైక్రాన్‌ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న ఫ్లెక్సీలు, స్వీట్‌బాక్స్‌ల ప్యాకింగ్‌ కవర్లు, సిగరేట్‌ ప్యాకెట్స్‌, డిస్పోజల్‌ వాటర్‌, టీ గ్లాసులు, వాటర్‌ బాటిళ్లు వంటి సింగిల్‌ యూజ్‌ వస్తువులపై నిషేధం విధించారు. వీటన్నింటిపై నిషేధం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడం వల్లే అధికార యంత్రాంగం పెద్దగా ప్రచారం చేయడం లేదని తెలుస్తోంది. ఈ నిషేధం అమలు కోసం మునిసిపాలిటీల పరిధిలో అన్ని రకాల వ్యాపారులు, పాఠశాలల నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా చాలా మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేసే కంపెనీల నుంచే ఇవి తయారు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్‌, కాగితం సంచులు సప్లయ్‌ చేస్తే ఫలితాలు వస్తాయి. తనిఖీలను కూడా ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.


రూ.50 వేల వరకు జరిమానా

ఇదివరకు తనిఖీలలో పట్టుబడితే ప్లాస్టిక్‌ను సీజ్‌ చేయడంతోపాటు రూ.500-1000 వరకు, రెండోసారి అయితే రూ.5000 వరకు జరిమానా విధించేవారు. దీనివల్ల పెద్దగా మార్పు ఉండటం లేదు. జిల్లాలో గుర్తుకు వచ్చినపుడే అధికారులు తనిఖీలు చేయడం వల్ల మిగతా సమయాల్లో యథేచ్ఛగా వీటిని వినియోగిస్తున్నారు. అందుకే జరిమానాలు భారీగా పెంచాలని నిర్ణయించారు. మొదటిసారి ఉల్లంఘనలకు పాల్పడితే రూ.2,500-5,000, రెండోసారి రూ.5,000-10,000, మూడోసారి రూ.10,000-50,000 వరకు జరిమానా విధించనున్నారు.


ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో రోజూ ప్లాస్టిక్‌ పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరుతోంది. గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, కల్వకుర్తి, మక్తల్‌ పురపాలికల్లోనూ అధిక మొత్తంలో ప్లాస్టిక్‌ వినియోగం అవుతోంది. వీటి వినియోగం రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గకపోవడంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని గ్రహించిన కేంద్రం 16 రకాల వస్తువులపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌పై నిషేధం కఠినంగా అమలు చేస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అధికార యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్‌ వినియోగంపై జరిగే నష్టాలపై అవగాహన రావాల్సి ఉంది. ప్లాస్టిక్‌ వినియోగంపై ఇదివరకు రూ.5,000 వరకే జరిమానాలు విధించే అవకాశం ఉండగా, ఇప్పుడు రూ.50 వేల వరకు జరిమానా విధించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.



Updated Date - 2022-06-28T04:51:03+05:30 IST