నేడు అసెంబ్లీ నిరవధిక వాయిదా?

ABN , First Publish Date - 2020-09-16T09:42:05+05:30 IST

ఈ నెల 28 వరకూ జరగాల్సిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అర్ధాంతరంగా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

నేడు అసెంబ్లీ  నిరవధిక వాయిదా?

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదన 

శాసన సభాపక్ష నేతలతో మాట్లాడిన స్పీకర్‌

చర్చించాల్సిన అంశాలున్నాయన్న భట్టి

జీహెచ్‌ఎంసీపై చర్చ జరగాలన్న అక్బరుద్దీన్‌ 

నేడు వెలువడనున్న నిర్ణయం


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 28 వరకూ జరగాల్సిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అర్ధాంతరంగా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సిబ్బందితో పాటు భద్రతా సిబ్బందిలో కరోనా కేసులు పెరుగుతుండడం, నాంపల్లి ఎమ్మెల్యేకూ కరోనా సోకిన నేపథ్యంలో బుధవారం సభ అనంతరం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి.. మంగళవారం కాంగ్రెస్‌, ఎంఐఎం శాసన సభాపక్ష నేతలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్‌ ఒవైసీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనపై వారి అభిప్రాయాలను కోరారు. చర్చించాల్సిన అంశాలు ఇంకా ఉన్నప్పుడు ఎలా వాయిదా వేస్తారంటూ భట్టి ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సమస్యలపై సభలో చర్చించాల్సి ఉందని అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. అయితే అసెంబ్లీ, భద్రతా సిబ్బందిలో ఇప్పటికే 60 మందికి కరోనా సోకిందని, రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయని స్పీకర్‌ వారి దృష్టికి తెచ్చినట్లు సమాచారం.


కాగా, ఈ అంశంపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శాసనసభను వాయిదా వేయాలని నిర్ణయిస్తే మండలిని బుధ లేదా గురువారం వాయిదా వేసే అవకాశముందని చెబుతున్నారు. వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు, వీఆర్‌ఓల రద్దు బిల్లు తదితర ముఖ్యమైన 12 బిల్లులకు శాసనసభ ఆమోదం లభించేసింది. ప్రభుత్వం అనుకున్న బిజినె్‌సను పూర్తి చేసుకున్నందునే సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేయించాలని భావిస్తున్నట్లుగా విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు 17న తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గురువారం సభ లోపల, బయటా నిరసనలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుందనే బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తోందని పలువురు నేతలు అంటున్నారు.’

Updated Date - 2020-09-16T09:42:05+05:30 IST