‘ముందస్తు’ హడావిడేనా?

ABN , First Publish Date - 2022-03-10T07:47:34+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా? మొన్న భారీ బడ్జెట్‌... దళితబంధుకు పెద్ద పీట..

‘ముందస్తు’ హడావిడేనా?

  • కేంద్రంలోని బీజేపీని చూపి ఎన్నికలకు
  • బీజేపీ ముక్త్‌ భారత్‌ అంటూ కేసీఆర్‌ నినాదం
  • మొన్న భారీ బడ్జెట్‌.. దళితబంధుకు పెద్దపీట
  • 16% ఉన్న దళితులను ఆకట్టుకునేందుకు యత్నం
  • తాజాగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల ప్రకటన
  • ఇవన్నీ ముందస్తు కోసమేనంటున్న విశ్లేషకులు


హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా? మొన్న భారీ బడ్జెట్‌... దళితబంధుకు పెద్ద పీట.. నిన్న ఉద్యోగాల జంబో నోటిఫికేషన్ల ప్రకటన. ఇవన్నీ ఆ కోవలోనివేనా? కేంద్రంపై నెపంతో అసెంబ్లీని రద్దు చేయబోతుందా? తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నిలకు వెళ్లేలా కనిపిస్తుందని అంటున్నారు. పలు అంశాలపై కేంద్రప్రభుత్వంతో వివాదాలు నెలకొంటుండడంతో దీనినే సాకుగా చూపి ముందస్తు ఎన్నికలకు వెళుతుందని అంచనా వేస్తున్నారు. 2014లో మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి కాకుండానే 2018 సెప్టెంబరు 6న అసెంబ్లీని రద్దు చేసింది. అదే ఏడాది డిసెంబరులో ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చింది. అంటే... 2023 డిసెంబరు వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగవచ్చు. కానీ, దీనికి ముందుగానే ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్‌ వ్యూహం రచించినట్లుగా తెలుస్తోందని పరిశీలకుల అభిప్రాయం. ఇటీవల చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతోనే ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. 


కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేస్తూ కేసీఆర్‌ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొంత దెబ్బ తిన్నప్పటికీ... బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉందనే కారణంగా, బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా చిత్రీకరించి, త్రిముఖ పోటీకి రంగం సిద్ధం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహంతో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు అన్యాయం చేయడం వల్ల ముందస్తుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కేసీఆర్‌ చెప్పదల్చుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని తూర్పారపట్టిన కేసీఆర్‌... బీజేపీ ముక్త్‌ భారత్‌ అంటూ నినాదమిచ్చారు. రాష్ట్రంలోనూ దూకుడు పెంచారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో సుమారు 16 శాతం దళితులు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడం కోసం దళితబంధుకు సర్కారు పెద్ద పీట వేసింది. దీనివల్ల దళితులు తమకు అండగా ఉంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు. బుధవారం నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు. ఏకంగా 91,142 ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు. మరో పక్క కేంద్రంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దేశాన్ని బాగు చేయడానికి జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.


కేంద్రంపైకి నెపాన్ని నెట్టి...

రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి టీడీపీ, కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతాయంటూ 2018 సెప్టెంబరులో అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్‌ .. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధికి, పునర్నిర్మాణానికి అసెంబ్లీని రద్దు చేసి, ప్రజల తీర్పు కోసం వెళుతున్నాంటూ ప్రకటించారు. అదే కోవలో ఇప్పుడు బీజేపీకిపైకి నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయబోనంటూ కేంద్రంలోని బీజేపీ తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. కేంద్ర గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదంటున్నారు. బీజేపీ ప్రభుత్వ అన్యాయాన్ని ఎదురించడానికి, ప్రజల ద్వారా ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి ముందస్తు ఎన్నికలకు వెళతానంటూ చెప్పబోయే అవకాశం ఉందంటున్నారు.


టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనూ హడావుడి మొదలు!

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా హడావుడి చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు రానున్నాయని, అందరూ సిద్ధంగా ఉండాలంటూ టీఆర్‌ఎస్‌ అలంపూర్‌ ఎమ్మెల్యే డా.అబ్రహం ఇటీవల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ బుధవారం ఉద్యోగాల ప్రకటన చేయగానే... అసెంబ్లీ నియోకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఉద్యోగార్థులకు కోచింగ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడానికి కొంత మంది ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అంటే... టీఆర్‌ఎస్‌ ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, చివరికి నిరుద్యోగులకు కూడా మేలు చేస్తున్నామంటూ చెప్పదల్చారని విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హడావుడి కూడా పెరిగింది. ఆయన సలహాల మేరకే టీఆర్‌ఎస్‌ సుప్రీం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగాల ప్రకటన, భారీ బడ్జెట్‌ ఆ కోవలోనివేనని చెబుతున్నారు.

Updated Date - 2022-03-10T07:47:34+05:30 IST