దొంగ ఓట్లకు ‘తిరుపతి’ని ఎంచుకుంది అందుకేనా?

ABN , First Publish Date - 2021-04-19T06:56:12+05:30 IST

భారీగా దొంగ ఓట్లు వేసుకునేందుకు..

దొంగ ఓట్లకు ‘తిరుపతి’ని ఎంచుకుంది అందుకేనా?
శనివారం తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికేతరులు

చిత్తూరు(ఆంధ్రజ్యోతి): భారీగా దొంగ ఓట్లు వేసుకునేందుకు తిరుపతిలో వైసీపీ నేతలు ప్రయత్నించడం.. మీడియా దీనిని బహిర్గత పరచడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిని ఎందుకు ఎంచుకున్నారన్నది చర్చకు వచ్చింది. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్‌ 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుపతి మినహా మిగిలిన ఆరు చోట్ల వైసీపీకి మెజార్టీ దక్కింది. చిత్తూరు జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తిలో 32,919, సత్యవేడులో 42,196 ఓట్ల ఆధిక్యత వైసీపీకి లభించింది. తిరుపతి సెగ్మెంట్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,578 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ మెజార్టీ టీడీపీకి పెరుగుతుందని భావించిన వైసీపీ నేతలు దొంగ ఓట్లు పోల్‌ చేసుకోవడానికి తిరుపతిని ఎంచుకున్నారు.


రెండు వారాల ముందు నుంచే ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇక్కడ మకాం వేశారు. ఆయా డివిజన్లలో దొంగ ఓట్లకు ప్రణాళిక రచించారు. దీనికోసం ఉపసర్పంచికి 10, సర్పంచికి 20, వార్డు సభ్యుడికి 50 మందిని పిలుచుకుని రావాలని ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి డ్వాక్రా సంఘం నుంచి కనీసం ఇద్దరికి తగ్గకుండా తీసుకు రావాలని ఆర్‌పీలకు, గ్రూప్‌ లీడర్లకు లక్ష్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. అనుకున్నట్టే ఎన్నికలకు ముందు రోజు రాత్రి, శనివారం ఉదయం ప్రత్యేక వాహనాల్లో తమ నియోజకవర్గాల ప్రజల్ని తిరుపతికి తరలించారు. ఎవరైనా అడిగితే దర్శనాల పేరు చెబుతూ భక్తుల్లా ముందుకు కదిలారు. 


ఏం జరిగిందంటే.. 

వాస్తవానికి ఉదయం తొలి గంటలోనే దొంగ ఓట్లను వేయించాలనేది అధికార పార్టీ వ్యూహం. దీనిపై శనివారమే ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఓ వైపు, మీడియా మరోవైపు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినవారిని వెంటాడటంతో ఈ బాగోతం తెలుగు రాష్ట్రాల దృష్టిలో పడింది. దీంతో కొన్ని ఓట్లను వేయించలేకపోయారు. మధ్యాహ్నానికి వెనక్కి తగ్గినా.. సాయంత్రం చివరి గంటలో మళ్లీ దొంగ ఓట్ల ప్రక్రియను ప్రారంభించాలనుకున్నా అన్నిచోట్ల వేయలేకపోయారు. పోలింగ్‌ వేళ వందలాది వాహనాల్లో వేలాదిగా స్థానికేతరులు తరలి వచ్చారంటే పోలీసు శాఖ తీరుపై విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. 

Updated Date - 2021-04-19T06:56:12+05:30 IST