ప్రాణాల విలువ కాసులేనా?

ABN , First Publish Date - 2020-08-12T07:31:06+05:30 IST

గతఆదివారం తెల్లవారుజామున విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం దిగ్భ్రాంతికరమైన సంఘటన. ఓ వైపు కరోనా వైరస్ బూచిని చూపించి కార్పొరేట్ వ్యవస్థలు వ్యాధిని ‘సరుకు’గా మార్చి వేస్తున్నాయి...

ప్రాణాల విలువ కాసులేనా?

పారిశ్రామిక రంగం నుండి సేవారంగం వరకూ అన్నింటా నేడు కార్పొరేట్ ఆర్థిక విధానం బలపడుతోంది. ఎల్‌జి పాలిమార్స్ నుండి స్వర్ణ ప్యాలెస్ వరకూ విస్తరిస్తోన్న ప్రజల హత్యలు అందుకు నిదర్శనం. ప్రజల ప్రాణాలను డబ్బులతో (నష్టపరిహారంతో) లెక్కించే కొత్త పరిస్థితిని ఇవి వెల్లడిస్తున్నాయి. సమాజంలో కార్పొరేట్ ఆర్థిక పునాదులు పెరిగేకొద్దీ, దానికి అనుబంధ రాజకీయ, నైతిక సంస్కృతులు కూడా పెరుగుతున్నాయి. రానున్న కాలంలో ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది.


గతఆదివారం తెల్లవారుజామున విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం దిగ్భ్రాంతికరమైన సంఘటన. ఓ వైపు కరోనా వైరస్ బూచిని చూపించి కార్పొరేట్ వ్యవస్థలు వ్యాధిని ‘సరుకు’గా మార్చి వేస్తున్నాయి. మరోవైపు చికిత్స పేరిట ప్రైవేట్ వైద్య వ్యవస్థ మానవ ప్రాణాలతో జూదక్రీడకు దిగింది. మరోవైపు బ్రతికిన కరోనా రోగుల నుండి చికిత్స నిమిత్తం వేల రూపాయల వసూళ్లతో పీడించే స్థితి ఉంది. ఇదిలావుండగా బ్రతుక్కి భద్రత లేని కారణంగా కార్పొరేట్ భారీ లాభ దాహానికి బలై ప్రమాదంలో ప్రాణం కోల్పోయే మృతుల కుటుంబాలకు సత్వర ప్రభుత్వ భారీ నష్ట పరిహారం అమలు జరుగుతోంది. కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యంచే పీడించబడే రోగుల కంటే ప్రభుత్వంచే సత్వర విలువను చేకూర్చబడే భౌతిక కాయాలకు నేడు ‘రాజకీయ ప్రాధాన్యత’ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాణమున్న ‘మనుషల’కీ మరణానంతర ‘శవాల’కీ మధ్య తేడాలు, పొలికల తులనాత్మక పరిశీలనకు కొత్త చూపుతో కొత్త కొలబద్దలు అవసరమవుతున్నాయి. 


విశాఖ ఎల్‌జి పాలిమార్స్ మృత్యుకేళి నుండి నేటి విజయవాడ స్వర్ణ ప్యాలెస్ మృత్యుకాండ వరకూ జరిగిన ప్రమాదాల పట్ల ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తే ఒక కొత్త రాజకీయ పోకడ కనిపిస్తుంది. ప్రమాదాలకు ముందు ప్రాణం ఉన్న మనుషుల కంటే, ప్రమాద దుర్ఘటనల తర్వాత వాటిలో ప్రాణాలు కోల్పోయిన నిర్జీవ భౌతిక కాయాలకి రాజకీయ ప్రాధాన్యత పెరుగుతున్నది. ఇది ఓ కొత్త ధోరణిగా నేడు ఉనికిలోకి వస్తోంది. దీని భావి దుష్ఫలితాలను ‘మనిషి’ని కేంద్రంగా చేసుకుని విశ్లేషణ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. 


గత కాలాలలో ఇలాంటి దుర్ఘటనలలో ప్రమాదవశాత్తు మరణాలు జరిగిన సందర్భాల్ని గుర్తు చేసుకుంటే, నాటికీ నేటికీ మధ్య మారిన, మారుతోన్న రాజకీయ సంస్కృతి మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏదేని ఓ ఇండస్ట్రీ లేదా ఫ్యాక్టరీ లేదా కంపెనీ లేదా సేవా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒకవేళ ఒకరో కొందరో ప్రమాదవశాత్తు మరణించారని అనుకుందాం. నష్ట పరిహారం కోసం ఆ మృతుల కుటుంబాల విజ్ఞప్తిని గతంలో సంబంధిత యాజమాన్యాలు పట్టించుకునేవి కాదు. ఆ మృతుల తరపున వందలు, వేలమంది ప్రజలు సంఘీభావంగా రంగప్రవేశం చేసి ఆందోళనకి దిగేవారు. పంచనామా కూడా బహిష్కరించి, మృతుల భౌతిక కాయాలతో రాస్తారోకోలు చేస్తే తప్ప ప్రభుత్వ అధికారులు దిగి వచ్చే వారు కాదు. ఐనా నాడు ఒక్క మంత్రి కూడా కనిపించే వారు కాదు. కనీసం జిల్లాస్థాయి ఉన్నతాధికారులు హామీలిచ్చే బాధ్యత చేపట్టేవారు కాదు. సాధారణంగా స్థానిక పోలీసు అధికారులు మధ్యవర్తిత్వ బాధ్యత చేపట్టేవారు. అరుదుగా మండలస్థాయి రెవిన్యూ అధికారుల పాత్ర ఉండేది. తాత్కాలికంగా దహన ఖర్చుల్ని ప్రకటించి, తదుపరి నష్టపరిహారం హేతుబద్ధంగా చర్చించుకుందామని హామీలతో దాటించ చూసేవారు. అట్టి హామీల అమలులో ఆ తర్వాత మృతుల కుటుంబాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ తర్వాత మృతుల ప్రాణాలకు నష్టపరిహారానికై కూరగాయల బేరం వలె రోజుల తరబడి చర్చలు జరపాల్సిన దుస్థితి ఎదురయ్యేది. గతంలో ఇలాంటి ప్రమాద దుర్ఘటనల సందర్భంగా వుండే పరిస్థితి యిది. అలాంటి గత రాజకీయ సంస్కృతి నేడు మౌలికంగానే మారిపోయింది.


నేడు ప్రమాదం జరిగిన వెంటనే ఆగమేఘాల మీద ప్రభుత్వాధినేతలు ప్రమాదస్థలికి చేరుతున్నారు. ప్రమాదాల తీవ్రతను బట్టి జిల్లా మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు భారీ ప్రచార ఆర్భాటంతో వాలిపోతున్నారు. మృతులకు నష్ట పరిహారం పై మధ్యవర్తిత్వ పాత్ర పోషించే అవసరం నేడు పోలీసు అధికారులకి గానీ, కనీసం జిల్లా కలెక్టర్లకు గానీ లేకుండా పోయింది. ఇది కొత్తగా విశ్లేషించాల్సిన వింత ధోరణి. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించే మొత్తాలు కూడా నేడు పౌర సమాజాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ సందర్భంగానే మరికొన్ని ఆసక్తికర విషయాల్ని కూడా గుర్తుచేయాలి. మృతుల కుటుంబాల తరపున నష్ట పరిహారానికై తోటి మనుషులు ప్రతిస్పందించాల్సిన ఆవశ్యకత నేడు లేకుండా పోయింది. దాని కోసం పౌర, ప్రజాతంత్ర ఉద్యమ సంస్థలు ఉద్యమించే అవసరం కూడా లేకుండా పోయింది. తుదకి మృతుల కుటుంబాలకు సైతం నష్టపరిహారానికై డిమాండ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. మరో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మృతుల కుటుంబాలు ప్రమాద స్థలాలను చేరకముందే, ప్రభుత్వ అధినేతలు పర్యటన పూర్తి చేసి, నష్ట పరిహారం కూడా ప్రకటిస్తున్నారు. పైగా ఒక్కొక్క మృతునికి పావు కోటి నుండి అరకోటి లేదా కోటి వరకు నష్టపరిహారం ప్రకటించే స్థితి ఏర్పడింది. ఇలా దిగ్భ్రాంతికర ఫక్కీలో ప్రకటించే సత్వర, భారీ నష్టపరిహారాల్లో నిజంగానే ‘మానవత్వమే’ ప్రధానంగా ఉంటే, అదో మార్పుగా గుర్తించి స్వాగతించవచ్చు. కానీ లోతుగా పరిశీలిస్తే, దీని వెనక భారీ ‘అమానుష’ రాజనీతి ఉందని అర్థమవుతుంది. 


పారిశ్రామిక రంగం నుండి సేవారంగం వరకూ అన్నింటా నేడు కార్పొరేట్ ఆర్థిక విధానం బలపడుతోంది. ఎల్‌జి పాలిమార్స్ నుండి స్వర్ణ ప్యాలెస్ వరకూ విస్తరిస్తోన్న ప్రజల హత్యలు అందుకు నిదర్శనం. ఇవన్నీ ప్రజల ప్రాణాలను డబ్బులతో (నష్టపరిహారంతో) లెక్కించే కొత్త పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. నేడు సమాజంలో కార్పొరేట్ ఆర్థిక పునాదులు పెరిగేకొద్దీ, దానికి అనుబంధ రాజకీయ, నైతిక సంస్కృతులు కూడా పెరుగుతున్నాయి. రానున్న కాలంలో ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది. నిజానికి ఈ తరహా చావులన్నీ కార్పొరేట్ కంపెనీలు సాగించే హత్యలు మాత్రమే. అవి చేసే హత్యానేరాల్ని కళ్ళుకప్పే లక్ష్యంతో ప్రజల నుండి పన్నుల రూపంలో వసూళ్లు చేసిన ప్రభుత్వధనం నుండి కుహనా ప్రజా ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం నేడు కొత్తరాజకీయ సంస్కృతిగా మారుతోంది. ఇదో రకం కార్పొరేట్ సాంస్కృతియే! ఆచరణలో ప్రజల మరణాలకు మాత్రమే యిది విలువ ఇస్తుంది. అంతే తప్ప ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వదు.


నేడు కార్పొరేట్ సంస్థలు తమ లాభదాహానికై మనుషుల్ని చంపే హక్కుని స్వాభావిక హక్కుగా మార్చజూస్తున్నాయి. వాటికి బ్రతికి వున్న మనుషుల్ని చంపే హక్కుని చేకూర్చాలంటే, వాటి చేత ఖూనీ చేయబడ్డ శవాలకి వారి బంధుమిత్రులు కోరక ముందే ధర చెల్లించే కొత్త రాజకీయ సంస్కృతిని వ్యాప్తిలోకి తేవడం పాలక వర్గాలకు ఆవశ్యకమైనది. అదే నేడు జరుగుతోంది. ఈ కొత్త రాజకీయ సంస్కృతి పూర్తి స్థాయిలో మున్ముందు ఉనికిలోకి వస్తే ఏం జరుగుతోంది? దాని ప్రకారం సమాజానికి చెందిన సమిష్టి ‘మనిషి’కి, అంటే సంఘజీవికి ఎట్టి ‘విలువ’ ఉండదు. కానీ అట్టి మృతుల ‘శవా’నికి మాత్రం ‘విలువ’ లభిస్తుంది. అంటే బ్రతికిఉన్న ‘మనిషి’ ఏ పౌర సమాజానికి చెంది ఉంటాడో, అట్టి సమాజం కోరే ‘ప్రమాద నియంత్రణ’, ‘ప్రాణ భద్రత’ వంటి కోరికలను పాలక వర్గాలు పట్టించుకోవు. తద్భిన్నంగా సంఘజీవి ఐన మనిషిని చంపే హక్కును సాంప్రదాయబద్ధం చేయజూస్తాయి. మరోవైపు వారి కుటుంబాలకి సాపేక్షికంగా సంతృప్తికరమైన నష్టపరిహారం చెల్లించి, సమాజాన్ని నోరు మూయిస్తాయి. ఇది అత్యంత ప్రమాదకర కార్పొరేట్ రాజకీయ సంస్కృతి. ఇది దేశవ్యాప్తంగా నేడు పాలక వర్గాలు క్రమంగా అమలులోకి తెస్తోన్న కొత్త ప్రమాదకర సంస్కృతే! అట్టి ప్రమాదకర దారిలో జగన్ ప్రభుత్వం మరింత ముందున్నది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం అత్యంత న్యాయమైనది. నిజానికి వారు ఎవరి కోసం మరణించారు? ఎవరి నిర్లక్ష్యానికి బలయ్యారు? అవి నిజానికి హత్యలు తప్ప సహజ మరణాలు కాదు. ఆ మృతులపై ఆధారపడ్డ వారి కుటుంబాల్ని ఎవరు పోషించాలి? ఇవన్నీ సామాజిక ప్రశ్నలే! అందుకే నష్ట పరిహారం డిమాండ్ అవసరమైనదే. ఐతే మనుషుల్ని తమ లాభదాహం కోసం చంపే హక్కుని చట్టబద్ధం చేసుకునే కార్పొరేట్ వ్యవస్థల దుష్టలక్ష్యాలకు ‘నష్ట పరిహారం’ ఓ సాధనంగా మారనివ్వరాదు. 


కాలమాన పరిస్థితుల్లో వస్తున్న మార్పుల్ని బట్టి ఆయా ఉద్యమ డిమాండ్లు కూడా మారతాయి. పాత పరిస్థితుల్లో గత కాలాల్లో ప్రధాన డిమాండ్లు కాలం మారినప్పుడు వాటికి గల ప్రాధామ్యాల్ని కోల్పోతాయి. అందుకు గల హేతుబద్ధత, న్యాయబద్ధతల్ని కోల్పోతాయి. వాటి స్థానంలో కొత్త డిమాండ్లు ప్రథమ వరసలోకి రాక తప్పదు. ఇప్పుడు క్రింది తరహా డిమాండ్లకు ప్రాధామ్యత పెరిగి, మొదటి వరసలోకి చేరతాయి. వాటికే ప్రాసంగికత ఏర్పడుతుంది. ఇవి: కార్పొరేట్ నేరాల వల్ల మరణాలను హత్యానేరాలుగా గుర్తించి, సంబంధిత హంతక యాజమాన్యాలపై హత్యానేరం కేసుల్ని నమోదు చేయాలి. అందుకై క్రొత్తచట్టాన్ని తేవాలి; మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే బాధ్యత సంబంధిత యాజమాన్యాలదే. అవి చెల్లించకపోతే, ముందుగా బాధితులకు ప్రభుత్వాలు చెల్లించి, వాటి ఆస్తుల్ని జప్తుచేసి వసూలు చేసే విధంగా కొత్తగా చట్టాలను తేవాలి. 


పాత డిమాండ్లకు కాలదోషం పట్టదు. పైన పేర్కొన్న కొత్త డిమాండ్లకు ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు పెరుగుతాయి. పైరెండు డిమాండ్లపై సంఘటిత సామాజిక రాజకీయ ప్రజా ఉద్యమ నిర్మాణ ఆవశ్యకతని తాజాప్రమాదాలు వెల్లడి చేస్తున్నాయి. అప్పుడే నేడు క్రమంగా బలపడుతోన్న కార్పొరేట్ వాణిజ్య రాజకీయ సంస్కృతికి ప్రజల ప్రాణాలు బలికాకుండా ఒక రక్షణ ఉంటుంది. ‘ప్రమాదాలు సహజం, మరణాలు సహజం, వాటిని స్వాభావిక హక్కుగా మార్చాలి’ అని నేడు పాలక వర్గాల్ని కార్పొరేట్ సంస్థలు లాభదాహ బుద్ధితో డిమాండ్ (కమాండ్ కూడా) చేస్తున్నాయి. వాటి దుర్నీతికి బలికాకుండా సకల వర్గాల ప్రజలు, ముఖ్యంగా శ్రామికవర్గం ఉద్యమించడానికి ఈ ప్రమాదాలు దిశానిర్దేశం చేస్తాయి.

పి. ప్రసాద్ 

జాతీయ కార్యదర్శి, భారత కార్మిక సంఘాల సమాఖ్య

Updated Date - 2020-08-12T07:31:06+05:30 IST