ఇంకా బ్రతికే ఉంది

ABN , First Publish Date - 2021-08-23T08:34:10+05:30 IST

వానపడుతున్నా కదలని దున్నపోతులా నగరం నిలబడే ఉంది జేసీబీలతో ఒళ్ళంతా పొక్కిలి పొక్కిలైతున్నా అభివృద్ధి గడ్డిని నెమరేస్తూనే ఉంది...

ఇంకా బ్రతికే ఉంది

వానపడుతున్నా కదలని దున్నపోతులా

నగరం నిలబడే ఉంది

జేసీబీలతో ఒళ్ళంతా

పొక్కిలి పొక్కిలైతున్నా

అభివృద్ధి గడ్డిని నెమరేస్తూనే ఉంది


అగ్గిపెట్టెల్లాంటి అపార్టుమెంటుల్లో

జనం అగ్గిపుల్లల్లాగా

కుక్కేయ బడ్డా కూడా

రోజురోజుకూ కొత్త జనంపై

మోజు పెంచుకుంటూనే ఉంది


నగరం నడుస్తూనే ఉంది

వెయ్యికాళ్ళ జెర్రిలా

రైళ్ళల్లో, బస్సుల్లో

గజిబిజిగా బిజీబిజీగా

ఉరుకుతూనే ఉంది


అక్కడక్కడా

తెగిపడిన పక్షిరెక్కల్లాంటి

ఫ్లైఓవర్ల కింద

ఆదిమ మానవుడు వేసిన

రాక్‌ పెయింటిగుల్లో

చిదిమేయబడ్డ

పల్లెల్ని దాచుకొని

ఇంకా ముస్తాబౌతూనే ఉంది


ఫ్యాక్టరీలొదిలే

అమృత జలాలతో

తన పునాదులు తడుపుకొని

తనలో మెదులుతున్న

అనాగరిక జీవాలకు

దాహార్తిని తీరుస్తూనే ఉంది


మానని పుండ్లలాంటి రోడ్లతో

కాలనీల చీము పారే కాలువలతో

సిగరెట్‌ పొగలతో పేరుకునిపోయిన 

      ఊపిరితిత్తులతో

వేరొకరి కష్టార్జితాన్ని

జుర్రుకొని బతికే పరాన్నజీవులతో

నగరం నడుస్తూనే ఉంది


అమాయకపు ఆడపిల్ల

అర్థరహితమైన అరనవ్వులా

చనుబాలతో పాటు బిడ్డ

రక్తాన్ని పీలుస్తున్నా

భరించే తల్లి సహనంలా

ఈసారి ఆలి పుస్తెలమ్మైనా సరే

పేకాటలో గెలవాలనుకున్న

వ్యసనపరుడి నమ్మకంలా

కపటబుద్ధిని కండువా కిందే

దాచేసిన రాజకీయనాయకుడి

    వాగ్దానంలా

నగరం ఇంకా బ్రతికే ఉంది. 

కృష్ణ సముద్ర

karikalaveera@gmail.com

Updated Date - 2021-08-23T08:34:10+05:30 IST