తొలి రెండ్రోజులు ఉద్యోగులకే శ్రీవారి దర్శనం?

ABN , First Publish Date - 2020-06-05T10:50:05+05:30 IST

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని అధికారులు ప్రణా ళికలు రూపొందిస్తున్నారు.

తొలి రెండ్రోజులు ఉద్యోగులకే  శ్రీవారి దర్శనం?

తిరుమల, జూన్‌ 4: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని అధికారులు ప్రణా ళికలు రూపొందిస్తున్నారు. తొలి రెండ్రోజులు దర్శనాన్ని టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికే కేటాయించనున్నట్టు సమాచారం. ప్రభుత్వ అనుమతితో ఎనిమిదో తేదీనుంచి దర్శనాలు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ అధికారుల సమావేశంలో దర్శన విధి విధానాలు, భక్తులు భౌతికదూరం పాటించేలా తీసుకోవాల్సిన చర్యలు, థర్మల్‌స్ర్కీనింగ్స్‌ తదితరాలపై చర్చించారు.


థర్మోగ్రాఫిక్‌ కెమెరాల ఏర్పాటు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అలిపిరి, తిరుమలలో ఽథర్మోగ్రాఫిక్‌ కెమెరాలను ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ దాత ఐదు థర్మోగ్రాఫిక్‌ కెమెరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. కంటికి కనిపించని వాటిని చిత్రీకరించడంతోపాటు వస్తువులు, మనిషిలోని ఉష్ణోగ్రతలను కూడా దూరం నుంచే ఈ కెమెరాలు స్పష్టంగా గుర్తిస్తాయి. ఇందులో భాగంగానే గురువారం తిరుమలకొచ్చిన రెండు కెమెరాల పనితీరును అధికారులు పరిశీలించారు. థర్మో గన్ల కంటే సేఫ్‌ప్రో అనే సంస్థకు చెందిన ఈ కెమెరాలతో ఎక్కువ ప్రయోజనం ఉండటంతో వీటి ఏర్పాటుపై రెండు, మూడ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. 


దుకాణాలకు అనుమతి ఇలా.. 

శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాక తిరుమలలోని అన్ని దుకాణాలను తెరవడానికి టీటీడీ అనుమతినిచ్చింది. అయితే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తెరవాలన్న నిబంధన పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే లాక్‌డౌన్‌ ముగిసేవరకు అన్ని దుకాణాలు తెరవడానికి వీల్లేదు. ఒకరోజు ఒక దుకాణం తెరిస్తే.. మరుసటిరోజు దాని పక్క దుకాణం తెరిచేలా అధికారులు ఆదేశాలు ఇవ్వనున్నారు. దుకాణాల్లో పనిచేసేవారి వివరాలన్నీ తప్పనిసరిగా టీటీడీ విజిలెన్స్‌, రెవెన్యూ, హెల్త్‌విభాగాలకు అందజేయాలి. తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలి. దుకాణాల్లో కాలంచెల్లిన ఆహారపదార్థాలపై డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ గురువారం వ్యాపారులకు టీటీడీ లేఖలు పంపింది.


కాగా, ఘాట్లలో వాహనాలను ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే అనుమతించనున్నారు. శ్రీవారి దర్శనాన్ని తొలి రెండ్రోజులు టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికే కేటాయించనున్నట్టు తెలుస్తోంది. మూడో రోజున తిరుమలలో ఉండే స్థానికులకు ఇచ్చేలా టీటీడీ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. వీరంతా టైమ్‌ స్లాట్‌ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా పొందాలి. ఉదయం ఆరు నుంచి సాయంత్రం నైవేద్య విరామ సమయం ఏడు గంటల వరకు ఆరువేల మందికి దర్శనం కల్పించేలా ప్రణాళిలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.మూడ్రోజుల తర్వాత లోటుపాట్లను సరిదిద్దుకుని ఇతర ప్రాంతాలకు చెందినవారికి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు కేటాయించే అవకాశాలున్నాయి. 

Updated Date - 2020-06-05T10:50:05+05:30 IST