గుజరాత్ బీజేపీ రెండ్రోజుల మేథోమధన సదస్సు

ABN , First Publish Date - 2022-05-14T23:23:08+05:30 IST

కాంగ్రెస్ నేతలు 'చింతన్ శివిర్' పేరుతో ఉదయ్‌పూర్‌లో సమావేశాలు నిర్వహిస్తుండగా, గుజరాత్ బీజేపీ సైతం 'మేథోమథన సదస్సు'కు ...

గుజరాత్ బీజేపీ రెండ్రోజుల మేథోమధన సదస్సు

అహ్మదాబాద్: కాంగ్రెస్ నేతలు 'చింతన్ శివిర్' (Chintan Shivir) పేరుతో ఉదయ్‌పూర్‌లో సమావేశాలు నిర్వహిస్తుండగా, గుజరాత్ బీజేపీ సైతం 'మేథోమథన సదస్సు' (Brainstorming conclave) కు సన్నద్ధమవుతోంది. అహ్మదాబాద్‌ శివార్లలోని గోల్ఫ్ రిసార్ట్‌లో ఆది, సోమవారం ఈ  సమావేశాలను నిర్వహించనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పర్యావరణం-అడవులు-వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపిందర్ యాదవ్‌, గుజరాత్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ సిన్హ్ వాఘేలా, భార్గవ్ భట్, వినోద్ చావ్డా, రజనీ పాటిల్ సహా 35 నుంచి 40 మంది ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు.


ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్ ఎన్నికల్లో 182 సీట్లలో గెలుపు లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ వ్యూహరచన సాగిస్తున్నారు. ఫ్యాక్షనలిజం, ఫిరాయింపులతో సతమతమయ్యే కాంగ్రెస్ కంటే ఈసారి గుజరాత్ ఎన్నికల్లో అడుగుపెడుతున్న ఆప్‌పై ప్రధానంగా దృష్టి సారించి కౌంటర్ స్ట్రాటజీ తీసుకురావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ అంశాన్ని గుజరాత్ బీజేపీ నేతల మేథోమధన సదస్సులో చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పాటిల్ వర్గీయుల కంచుకోటగా సూరత్‌కు పేరుండగా, గత ఏడాది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 27 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ముఖ్యంగా పాటీదార్ ఓటర్లు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం ఇందుకు కారణం. అప్పట్నించి కేజ్రీవాల్ ఐదుసార్లు గుజరాత్‌లో పర్యటించారు. భారతీయ ట్రైబల్ పార్టీ (BTP)తో పొత్తు ఉంటుందని కూడా ప్రకటించారు. రాజ్‌కోట్‌లో జరిగిన ర్యాలీలో వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య యాత్రా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు.


కేజ్రీ వెర్సస్ సీఆర్ పాటిల్

గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, కేజ్రీవాల్ మధ్య కొద్దికాలంగా మాటల యుద్ధం జరుగుతుండటంతో ఆ రాష్ట్రంపై ఆప్ దృష్టి సారించిందనే బలమైన సంకేతాలు వెళ్లాయి. పాటిల్‌కు మరాఠీ మూలాలున్నాయని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించడంతో దీనిపై కౌంటర్ స్ట్రాటజీని బీజేపీ 'శివిర్' రూపొందించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆప్‌కు ఖలిస్థాన్ భావజాలం ఉందని, ఖలిస్థాన్ రాజ్యాంగబద్ధమైన హక్కని నమ్ముతుందని, ఇది దేశ భద్రతకు ముప్పని పాటిల్ ఇటీవల విమర్శలు గుప్పించగా, దీనికి కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర మూలాలున్న వ్యక్తికి బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారని, ఆ పదవికి ఒక్క గుజరాతీ కూడా బీజేపీకి కనిపించలేదా అని విమర్శించారు. పాటిల్ కేవలం పార్టీ అధ్యక్షుడే కాదని, గుజరాత్ ప్రభుత్వాన్ని కూడా నడుపుతుంటారని, ఆయన "de facto CM" అని అన్నారు. ''ఇది గుజరాత్ ప్రజలను అవమానించడమే. గుజరాత్‌కు గుజరాత్ అధ్యక్షుడిని ఇవ్వండి'' అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

Read more