Jun 22 2021 @ 13:39PM

సమంత రిజెక్ట్ చేసిందా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఒక భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వారు 'బాహుబలి-బిఫోర్ ది బిగినింగ్'ను నిర్మించనున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి'కి ప్రీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సిరీస్‌కి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. 'బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్' పేరుతో 8 ఎపిసోడ్స్‌గా వెబ్ సిరీస్ చేయాలనుకున్నారు. దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని నెట్ ఫ్లిక్స్ వారు ప్లాన్ చేస్తున్నారట. నటీ, నటులతో సహా టీమ్ మొత్తాన్ని మార్చి చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించారట. కానీ ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పినట్టు నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రలో తను నటిస్తే చాలా విషయాలలో ప్రేక్షకులు పోల్చుకుంటారని..అది తనకు మైనస్ అయ్యే అవకాశం ఉన్న కారణంగానే రిజెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవముందనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.